180 కుటుంబాలు సీపీఐ(ఎం)లోకి

180 families
into the CPI(M).– సొంతింటికి వచ్చినంత ఆనందంగా ఉందన్న పూసుగుప్ప ప్రజలు
– పార్టీలోకి ఆహ్వానించిన పోతినేని సుదర్శన్‌
నవతెలంగాణ-చర్ల
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం పూసుగుప్ప గ్రామానికి చెందిన 180 కుటుంబాల ప్రజలు సీపీఐ(ఎం)లో బుధవారం చేరారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్‌ రావు పార్టీలో చేరిన మాజీ సర్పంచ్‌ వుయిక రామకృష్ణ, తాటి కన్నారావు, సోడి జగపతి, గుండి చిన్నబి తదితర గ్రామ పెద్దల సమక్షంలో 180 కుటుంబాలకు చెందిన ప్రజలకు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పూసుగుప్ప జోన్‌ కన్వీనర్‌ దొడ్డి హరినాగ వర్మ అధ్యక్షతన జరిగిన సభలో పోతినేని సుదర్శన్‌ రావు మాట్లాడారు. గిరిజన ప్రజల అభివృద్ధి కోసం నిరంతరం పోరాడుతున్నది సీపీఐ(ఎం) మాత్రమేనని తెలిపారు. సీపీఐ(ఎం) పోరాట ఫలితంగానే పోడు భూములకు పట్టాలు వచ్చాయని, రూ.200 కోట్ల పైచిలుకు తునికాకు బోనస్‌ సాధించామని చెప్పారు. గిరిజన గ్రామాల్లో వ్యవసాయ అభివృద్ధికి అవసరమైన వనరులను కల్పించడంలో ప్రభుత్వాలు శ్రద్ధ వహించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పూసుగుప్ప గ్రామానికి 150 ఎకరాలకు సాగునీరు అందించే విధంగా తాలి పేరు ప్రాజెక్టుపై లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పథకాన్ని మంజూరు చేయాలని డిమాండ్‌ చేశారు. అదేవిధంగా పూసువాగుపై చెక్‌ డ్యాం నిర్మాణం చేపడితే మరొక 200 ఎకరాల వరకు సాగులోకి వస్తాయని, చుట్టూ సాగునీటి వనరులు ఉన్నప్పటికీ పాలకుల వివక్షత కారణంగా పూసుగుప్ప అభివృద్ధికి నోచుకోవటం లేదని విమర్శించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గిరిజన హక్కులు, చట్టాల పైన తీవ్రమైన దాడి చేస్తోందని విమర్శించారు. 2020 నూతన అటవీ హక్కుల విధానం గిరిజన హక్కులకు గొడ్డలి పెట్టు లాంటిదని తెలిపారు. భూములు, అటవీ సంపద నుంచి గిరిజన జాతిని దూరం చేయటం కోసమే నూతన అటవీ విధానాన్ని కేంద్ర బీజేపీ ప్రభుత్వం రూపొందించిందని చెప్పారు. అనంతరం పార్టీ జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య మాట్లాడుతూ.. పూసుగుప్ప గ్రామంలోని సమస్యలు పరిష్కారం కోసం అండగా ఉంటామని చెప్పారు. మొత్తంగా సొంత గూటికి చేరటం సంతోషంగా ఉందన్నారు. గిరిజన ప్రజల సమస్యల పరిష్కారానికి సీపీఐ(ఎం) నిరంతరం కృషి చేస్తుందని, పూసుగుప్ప ప్రజలు సీపీఐ(ఎం) బిడ్డలని, వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటామని చెప్పారు. సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు మచ్చ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. పూసుగుప్ప ప్రాంతంలో అమరజీవి వుయిక పాపారావు నాయకత్వంలో అనేక పోరాటాలు నిర్వహించామని గుర్తు చేశారు. సొంత ఇంటికి వచ్చినంత ఆనందంగా వుందన్న పుసగుప్ప ప్రజలు మాట్లాడుతూ చెప్పారు. అనంతరం పార్టీలో చేరిన వుయిక రామకృష్ణ, తాటి కన్నరావు మాట్లడారు. సీపీఐ(ఎం) మా సొంత ఇల్లని, పార్టీలో తిరిగి చేరటం సొంత ఇంటికి వచ్చినంత ఆనందంగా ఉందని చెప్పారు. సీపీఐ(ఎం)తో తమ గ్రామానికి ఉన్న బంధం తరతరాలు నాటిదని, ఈ బంధాన్ని విడదీయలేమని తెలిపారు. కొన్ని అనివార్య పరిస్థితుల్లో కొద్ది కాలం పాటు పార్టీకి దూరమయ్యామని అన్నారు. పార్టీ జిల్లా డివిజన్‌, మండల నాయకుల చొరవతో తిరిగి సీపీఐ(ఎం)లో చేరినందుకు సంతోషిస్తున్నామని చెప్పారు. తొలుత పార్టీ నాయకులు వుయిక పాపారావు స్మారక స్థూపం వద్ద పార్టీ జెండాను పోతినేని సుదర్శన్‌ రావు ఆవిష్కరించారు. పాపారావు చిత్రపటానికి జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య, డీసీసీబీ మాజీ చైర్మెన్‌ యలమంచి రవికుమార్‌ పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా సీనియర్‌ నాయకులు యలమంచి రవికుమార్‌, నియోజకవర్గం నాయకులు కారం పుల్లయ్య, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కే.బ్రహ్మచారి, జిల్లా కమిటీ సభ్యులు రేపాకుల శ్రీనివాస్‌, పార్టీ చర్ల మండలం కార్యదర్శి కారం నరేష్‌, నాయకులు బి. రమేష్‌, సత్రం పల్లి సాంబశివరావు, తదితరులు పాల్గొన్నారు.