1,800 కి.మీ. = 5,800 కి.మీ!

1,800 కి.మీ. = 5,800 కి.మీ. ఇదెక్కడి లెక్క అనుకుంటున్నారు కదూ… వస్తున్నా అక్కడికే.. అయితే అంతకు ముందు ఒక సామెత గురించి చెప్పాలి. ”వడ్డించేవాడు మనవాడైతే బంతిలో ఎక్కడ ఉన్నా నీకు కావాల్సింది లభిస్తుంది” ఇదీ సామెత. అలాగే ప్రభుత్వంలో మనవాడుంటే నీ లాభానికి కొరతేమీ ఉండదు. ఇతెందుకు చెప్పాల్సి వస్తుందంటే… ఈ మధ్య దేశంలో జరుగుతున్న విషయాలు మనకు తెలుసు. ముఖ్యంగా అదానీ షేర్ల పతనం గురించి. అదానీ షేర్ల ధరలు అధఃపాతాళానికి దిగజారాయి. ఆయన కంపెనీల్లో పెట్టుబడి పెట్టినవాళ్ళు మునిగిపో తున్నారు. దానిమీద రెండు సభల్లో ఆందోళనలు జరుగుతున్నాయి. విపక్షాలు జేపీసీ (జాయింట్‌ పార్లమెంటరీ కమిటీ) డిమాండ్‌ చేస్తున్నాయి. అంతేకాదు లోక్‌సభలో రాహుల్‌ గాంధీ సంభాషణలోని చాలాభాగాలను సభ రికార్డుల నుంచి తొలగించారు. రాజ్యసభలో కాంగ్రెస్‌ అధ్యక్షులు మల్లికార్జున్‌ ఖర్గే సంభాషణాల్లోంచి కూడా కొన్ని భాగాలను సభ రికార్డులకు ఎక్కకుండా చూశారు. ఇంత జరుగుతున్నా మోడీ కానీ, కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తనట్లుంది. పైగా అదానీకి ఏదోవిధంగా లాభం చేకూర్చడానికి ఎంత చేయాలో అంత చేస్తోంది. అందుకో తాజా ఉదాహరణ ఇది. కేంద్ర ప్రభుత్వ మినిస్టరీ ఆఫ్‌ ఫవర్‌, శ్రమశక్తి భవన్‌ నుండి అధికారిక లేఖ ఒకటి పంజాబ్‌ పవర్‌ కార్పొరేషన్‌ సి Ê ఎండికి దాని కాపీ ఒకటి పంజాబ్‌ ప్రభుత్వంలోని సంబంధిత అధికారికి కూడా వెళ్ళింది. ఈ లేఖలో ఏముందో తెలుసుకోవటానికి ముందు మరో మాట. పంజాబ్‌ పవర్‌ కార్పొరేషన్‌ తమ రాష్ట్రంలోని విద్యుత్‌ ఉత్పాదనకి కావలసిన బొగ్గుని MCL (Mahanadi Coal Fields Limited) నుంచి తెప్పించుకుంటుంది. అది ఒరిస్సా, ఝార్ఖండ్‌లోని తమ బొగ్గుగనుల ద్వారా బొగ్గు రవాణా చేస్తుంది. ఒరిస్సా నుంచిగాని, లేదా ఝార్ఖండ్‌ నుంచి కానీ పంజాబ్‌కి దూరం 1800 కి.మీ. బొగ్గు రైలు ద్వారా అక్కడికి చేరడానికి 5 లేదా 6 రోజుల్లో చేరుతుంది. అయితే కేంద్ర ప్రభుత్వ విద్యుత్‌ శక్తి మంత్రాలయం ఇచ్చిన లేఖప్రకారం ఇప్పుడు పంజాబ్‌ ప్రభుత్వం అదే బొగ్గుని నేరుగా కాకుండా వయా శ్రీలంక, గుజరాత్‌ల మీదుగా తెప్పించుకోవాలి. దానికి వాళ్ళిచ్చిన భాష్యం ఆర్‌ఎస్‌ఆర్‌ అంటే రైల్‌, షిప్‌, రైల్‌. ఒరిస్సా ఝార్ఖండ్‌ల బొగ్గు ఇప్పుడు మొదట రైలు ద్వారా పోర్ట్‌కి చేరాలి. అక్కడినుండి ఓడ ద్వారా శ్రీలంక మీదుగా గుజరాత్‌లోని ముంద్రా పోర్ట్‌కు లేదా దహేజ్‌ పోర్టుకి చేరుతుంది. అక్కడి నుండి మళ్ళీ రైల్‌ ద్వారా పంజాబ్‌ చేరాలి. ఇదీ ఆలేఖ సారాంశం.
దీనివల్ల ఎవరికీ లాభం? భారత ప్రభుత్వానికా? లేక రాష్ట్ర ప్రభుత్వాలకా..? లేక ప్రజలకా? అంటే వీరెవరికీ కాదు. మరి? అదానీకి లాభం చేకూర్చిడానికి ఈ తంతంగమంతా. బొగ్గుతో నిండిన ఓడలు ఎక్కడ ఆగుతాయి. ముంద్రా పోర్ట్‌ లేదా దహేజ్‌ పోర్ట్‌లో. ఈ రెండూ కూడా అదానీ పోర్టులే! ఆదానీకి లాభం చేకూర్చడానికి మోడీ చేస్తున్న కుట్ర ఇది. ఒరిస్సా నుంచి సముద్రమార్గంలో భారతదేశం చుట్టూ తిరిగి గుజరాత్‌కి దూరం 5800 కిలోమీటర్లు. ఎక్కడ 1,800కి.మీ ఎక్కడ 5,800కి.మీ. ఏకంగా నాలుగు వేల కిలోమీటర్ల దూరం పెరిగింది. అంతే కాదు వారం రోజుల్లో చేరే బొగ్గు ఇప్పుడు చేరడానికి 25రోజులపైనే పడుతుంది.
ముందు కేవలం రవాణా ఛార్జీలే, కానీ ఇప్పుడు రవాణా ఛార్జీలకు అదనంగా పోర్ట్‌ ఛార్జీలు కూడా చెల్లించాలి. అంటే లాభం ఎవరికీ? అర్థం చేసుకోండి. అప్పుడు ఏకంగా ఒకసారి వాగన్‌లో లోడ్‌ చేస్తే తిరిగి గమ్యస్థానం వద్ద అన్‌లోడ్‌ అయ్యేది. మరిప్పుడు? మొదట రైలులో లోడ్‌ చేయాలి. దాన్ని పోర్ట్‌ వద్ద అన్‌లోడ్‌ చేయాలి. తిరిగి దాన్ని ఓడలో లోడ్‌ చేయాలి. గుజరాత్‌లో అన్‌లోడ్‌ చేయాలి. పంజాబ్‌ చేరడానికి తిరిగి రైల్లో లోడ్‌ చేయాలి. మళ్లీ గమ్యస్థానంలో అన్‌లోడ్‌ చేయాలి. ఈ నాలుగువేల కిలో మీటర్ల అదనపు రవాణా ఖర్చు, లోడింగ్‌ అన్‌లోడింగ్‌ లేబర్‌ ఖర్చు.
పంజాబ్‌ విద్యుత్‌శాఖ మంత్రి చెప్పిన ప్రకారం ముందు టన్ను బొగ్గు రూ.4,500కు లభిస్తే, ఇప్పుడది రూ.6750కు లభిస్తుంది. ఈ ఖర్చంతా ప్రజలు భరించాల్సి వస్తుంది. ప్రజలు ఒక యూనిట్‌ విద్యుత్తుకి రూ.1.40 నుండి 1.50 పైసలు ఎక్కువ చెల్లించాల్సి వస్తుంది. ఇదీ నేను పైన చెప్పిన సామెతకి సరిపోతుంది కదా…!
– పి. జయప్రకాష్‌, 837485426