ఐక్యరాజ్య సమితి షెల్టర్లలో 18వేల మంది పాలస్తీనియన్లు

In United Nations shelters
18 thousand Palestiniansగాజా : దాదాపు 23లక్షల మంది ప్రజలు నివసించే అతిచిన్న గాజా ప్రాంతంపై ఇజ్రాయిల్‌ యుద్ధ విమానాలు విరుచుకుపడుతుండడంతో బుధవారం 18వేల మందికి పైగా పాలస్తీనియన్లు ఐక్యరాజ్య సమితి షెల్టర్లలో తల దాచుకున్నారు. గాజాను ఇజ్రాయిల్‌ అష్ట దిగ్బంధనం చేయడంతో లోపల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పౌర భవనాలు, పాఠశాలలు, మసీదులపై దాడులతో పాటూ పలు చోట్ల పాలస్తీనియన్లు, సాయుధ ఇజ్రాయిల్‌ బలగాల మధ్య ఘర్షణలు కొనసాగుతున్నాయి. గత 16ఏళ్ళ నుండి ఇజ్రాయిల్‌ దారుణమైన దాడులకు కేంద్రంగా మారిన గాజా నుండి తప్పించుకోవడానికి పాలస్తీనియన్లకు వేరే దారి లేకుండా పోయింది. సురక్షిత ప్రాంతాలుగా భావించబడే ఐక్యరాజ్య సమితి ఆశ్రయాలు కూడా తాజా పోరాటంలో దాడులకు లక్ష్యాలుగా మారుతున్నాయి. ఆదివారం నాటి దాడిలో తమ ఆశ్రయ కేంద్రం ఒకటి నేరుగా దాడికి గురైందని ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. ఆ మరుసటిరోజు ఆశ్రయ కేంద్రాలుగా ఉపయోగిస్తున్న ఐదు పాఠశాలల భవనాలు దాడులకు దెబ్బతిన్నాయి. ఎంతమంది మరణించారో వివరాలు అందలేదు. గాజాను పూర్తిగా దిగ్బంధించామని ఇజ్రాయిల్‌ రక్షణ మంత్రి యోవ్‌ గాలంట్‌ తెలిపారు. అయితే ఆహారం, విద్యుత్‌, నీరు, ఇంధనం వంటి సరఫరాలను ఆపివేయడం వల్ల లోపల వున్న ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందని ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల కమిషనర్‌ వోల్కర్‌ తుర్క్‌ హెచ్చరించారు. గాజాలో పరిస్థితులు చూస్తుంటే ఉత్తర ఐర్లాండ్‌ను పూర్తిగా దిగ్బంధించాలంటూ బ్రిటీష్‌ ఆదేశించిన రోజులు గుర్తుకువస్తున్నాయని మార్క్‌ సెడాన్‌ అనే రచయిత వ్యాఖ్యానించారు.
హమాస్‌ కార్యకర్తలను టెర్రరిస్టులుగా ప్రస్తావించాలి ! : బీబీసీపై వస్తున్న ఒత్తిడి
ఇజ్రాయిల్‌-పాలస్తీనా ఘర్షణా రాజకీయాలు బ్రిటన్‌పై ప్రభావం చూపుతున్నాయి. హమాస్‌ను మిలిటెంట్లు లేదా పోరాట యోధులుగా కాకుండా టెర్రరిస్టులుగా ప్రస్తావించాలంటూ బీబీసీపై ఒత్తిడి వస్తోంది. ఇక్కడ డౌనింగ్‌ స్ట్రీట్‌లో యూదు కమ్యూనిటీని ఉద్దేశించి ఇమ్మిగ్రేషన్‌ మంత్రి రాబర్ట్‌ జెన్‌రిక్‌ ప్రసంగించారు. హమస్‌ చర్యలను ఖండించారు. ఈనాడు అక్కడ ఏం జరుగుతోందో యావత్‌ ప్రసంచం చూస్తోంది. అయితే మీడియాలో వస్తున్నట్లుగా వారు మిలిటెంట్లు లేదా ఫైటర్లు కాదు, వారు టెర్రరిస్టులు, హంతకులు, ఆటవికులు. బీబీసీ లేదా మనం టెలివిజన్‌ తెరపై చూస్తున్న మరెవరైనా సరే వారిని టెర్రరిస్టులుగానే సంబోధిం చాన్నారు. బీబీసీ తన మార్గదర్శకాలను మార్చుకోవాలని కోరుతూ యూదు గ్రూపులు సాంస్కృతిక శాఖ మంత్రి లూసీ ఫ్రాజర్‌ను కోరిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు వెలువడ్డాయి. ప్రస్తుతానికైతే, బీబీసీ దీనికి చలించడం లేదు. 2019లో చివరిసారిగా బీబీసీ తన సంపాదకీయ మార్గదర్శకాలను ఆధునీకరించింది.