19న నామినేషన్‌.. వేలాదిగా తరలిరండి

Nomination on 19.. Move in thousands– సీపీఐ(ఎం) భువనగిరి పార్లమెంటు అభ్యర్థి ఎండి. జహంగీర్‌
– రైల్వే స్టేషన్‌ నుండి భారీ ర్యాలీ అంబేద్కర్‌ చౌరస్తా వద్ద రోడ్‌ షో
– బీవీ రాఘవులు, తమ్మినేని వీరభద్రం రాక
నవతెలంగాణ-భువనగిరి
ఈ నెల 19న వేయనున్న నామినేషన్‌కు వేలాదిగా తరలిరావాలని సీపీఐ(ఎం) భువనగిరి పార్లమెంట్‌ అభ్యర్థి ఎండి.జహంగీర్‌ పిలుపునిచ్చారు. శనివారం భువనగిరి పట్టణ కేంద్రంలో ఇంటింటి ప్రచారం నిర్వహించి అనంతరం ఆయన మాట్లాడారు. 19న భువనగిరి పట్టణంలోని రైల్వే స్టేషన్‌ నుండి జగదేపూర్‌ చౌరస్తా వరకు భారీ ర్యాలీ నిర్వహించనున్నట్టు తెలిపారు. నామినేషన్‌ ర్యాలీకి సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, కేంద్ర కమిటీ సభ్యులు సీతారాములతో పాటు కేంద్ర, రాష్ట్ర నాయకులు పలువురు హాజరుకానున్నారని తెలిపారు. సీపీఐ(ఎం) పోటీ చేయడాన్ని స్వాగతిస్తూ కవులు, కళాకారులు, ప్రజాతంత్ర వాదులు, అభ్యుదయ వాదులతో పాటు కార్మికులు మద్దతు పలుకుతున్నారని తెలిపారు. భువనగిరి పార్లమెంటు నియోజకవర్గ వ్యాప్తంగా అనేక సమస్యలు తిష్టవేశాయని, గతంలో అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ నాయకులు అభివృద్ధిని మరిచిపోయి కుర్చీని కాపాడుకునే పనిలో పడ్డారన్నారు. భువనగిరి జిల్లా కేంద్రంలో నేటికీ పరిష్కారం గాని అనేక సమస్యలు ఉన్నాయని వాటి పరిష్కారం కోసం సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో అనేక దఫాలుగా ప్రజా ఉద్యమాలు జరిగాయని అన్నారు. ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి అరకొర వసతులతో సరైన వైద్యం అందించలేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. సమస్యల పరిష్కారం కోసం సీపీఐ(ఎం)కు ఓటేసి గెలిపించాలని, 19న జరిగే నామినేషన్‌కు ప్రజల అధిక సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని వారు పిలుపునిచ్చారు. వీరితోపాటు రాష్ట్ర కమిటీ సభ్యులు బట్టుపల్లి అనురాధ, పట్టణ కార్యదర్శి మాయ కృష్ణ, శాఖ కార్యదర్శి దండు గిరి, సీనియర్‌ నాయకులు దండు యాదగిరి, నాయకులు దండు పద్మారావు, ఆడెపు గిరి, మాయ రాణి, దండు స్వరూప, దండు ధనలక్ష్మి, నాగరాణి, స్వాతి, బట్టు లక్ష్మి, బట్టుపల్లి నవీన్‌ కుమార్‌, ఎనబోయిన లింగం, చంద్రశేఖర్‌ పాల్గొన్నారు.
దేశరాజకీయాల్లో కమ్యూనిస్టులది నిర్మాణాత్మక పాత్ర : ఎండీ జాహంగీర్‌
రంగారెడ్డి ప్రతినిధి : భువనగిరి పార్లమెంట్‌లో సీపీఐ(ఎం)ను గెలిపిస్తే దేశ రాజకీయాల్లో నిర్మాణాత్మక పాత్ర పోషిస్తామని భువనగిరి పార్లమెంట్‌ సీపీఐ(ఎం) అభ్యర్థి ఎండీ జహంగీర్‌ అన్నారు. ప్రజలను కులాల వారీగా చీల్చుతున్న బీజేపీ, బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీలకు గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండల సీపీఐ(ఎం) విస్తృత స్థాయి సమావేశం మున్సిపల్‌ కార్యదర్శి ఎల్లేష్‌ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి కాడిగల్ల భాస్కర్‌తో కలిసి జహంగీర్‌ పాల్గొన్నారు.
పోరాడేది ఎర్రజెండానే జూలకంటి రంగారెడ్డి
మునుగోడు : అవకాశవాదులకు, మతోన్మాదులకు వ్యతిరేకంగా పోరాడేది ఎర్రజెండానే అని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి అన్నారు. శనివారం నల్లగొండ జిల్లా మునుగోడు మండల కేంద్రంలో జరిగిన సీపీఐ(ఎం) మండల జనరల్‌ బాడీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజా సమస్యలపై అనునిత్యం పోరాడే సీపీఐ(ఎం) భువనగిరి పార్లమెంట్‌ అభ్యర్థి జహంగీర్‌ను పార్లమెంటుకు పంపేందుకు ఓటు వేయాలని ప్రజలను కోరారు. మండల సహాయ కార్యదర్శి వరుకుప్పల ముత్యాలు అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో ఆ పార్టీ జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్‌ రెడ్డి, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు బండ శ్రీశైలం, డీివైఎఫ్‌ఐ రాష్ట్ర నాయకులు అయితగొని విజరు, జీఎంపీఎస్‌ జిల్లా అధ్యక్షులు సాగర్ల మల్లేష్‌ తదితరులు పాల్గొన్నారు.