1947 టు విజన్‌ 2020 ఎ లౌ స్టోరీ

1947 టు విజన్‌ 2020 ఎ లౌ స్టోరీప్రేమ సర్వజనీనం కదా, ఎవరెవరి మధ్య ఎలా, ఎప్పుడు పుడుతుందో ఎవరికైనా తెలుస్తుందా? అభివృద్ధి చెందిన సైన్స్‌ ఒక యాప్‌ను కనుగొంటే బాగుండు. తల్లుల, తండ్రుల మెదళ్ళకు చిప్పుగా దిగొట్టి వాళ్ళే బాధ్యులని నేరం మోపవచ్చు. అంతా సెన్సార్ల లోకం. ప్రతి ఒక్కడు అడిగేటోడే ‘ఏ మమ్మ, ఏం తండ్రివి నువ్వు? పిల్లలు ఎటు పోతున్నారు, ఏం చేస్తున్నారో ఆ మాత్రం పసిగట్టలేరా?’ అని ప్రతి అడ్డమైన వాడు హితోక్తులు చెప్పేటోడే. వివీవినీ తల బొప్పికట్టింది ఆ తల్లిదండ్రులకు.
పాట్నా మహా నగరం పోలీస్‌ స్టేషన్‌ ముందు షోయెబ్‌ ఖాన్‌ ఎవరి కోసమో ఎదురు చూస్తున్నాడు, కాని ఆలోచనల ముసురుకు అడ్డంగా గొడుగు పెట్టలేక పోతున్నాడు. ఆలోచనల జడివాన కురుస్తూనే వుంది. అప్పుడు ఓ స్టేషన్‌ ముందు మా అబ్బాజాన్ను ఊరి పోలీస్‌ స్టేషన్‌ ముందు నిలబెట్టిన కొడుకు ఇతను. అతనో హోల్‌సేల్‌ ఫ్రూట్‌ మర్చెంట్‌. పాషా ఖాన్‌ అంటే తెలియనోడు లేడు. వ్యాపారంలో ఆరితేరిన వాడు. టౌన్‌లో పలుకుబడి వుండి, మంచి వాడని పేరు పడ్డవాడు. ఐదు పూటలు నమాజ్‌ చదివి, దాన ధర్మాలు చేసేవాడని ప్రతీతి. తన కోసం యాభై సంవత్సరాల క్రితం అబ్బా స్టేషన్‌ మెట్లెక్కి ఎవరి సహాయం కోరో ఎదురు చూపులు. అబ్బా ఎంత యాతన పడ్డాడో తన కోసం. ఇరవైఐదు సంవత్సరాల తరువాత ఇప్పుడు ఇతను, తండ్రీ కొడుకుల వారసత్వ పరంపర.
ఒక తరం తర్వాత అంటే కనీసం ఇరవై ఐదు సంవత్సరాల క్రితం, ఇలాంటి పోలీస్‌ స్టేషన్‌లోనే సెల్లులో ఆలోచనల నడుమ, ఇప్పుడు పోలీస్‌ స్టేషన్‌ షెడ్డు క్రింద ఆలోచనల మధ్య తనే. అప్పుడు యువ రక్తం, ఇప్పుడు శ్రమ వల్లనో, సమస్యల వల్లనో బాధ్యతలు బరువెక్కి నెమ్మదితనం అలవడిన నిదానం. యాభైఏండ్ల వయసు నేర్పిన అనుభవ జ్ఞానం, జుట్టు తెల్లబడి పెద్ద తరహాతనంతో నీరసించిన ముఖం వేలాడేసుకొని సి.ఐ సాబ్‌ కోసం ఎదురు చూపులు. అప్పుడు లోపట సెల్‌లో, ఇప్పుడు పోలీస్‌ స్టేషన్‌ బయట, అప్పుడు ఇప్పుడు ఆలోచనల నిండా ఒకే సందర్భం. ప్రేమ! అప్పుడు తనూ, ఇప్పుడు కొడుకు. ఒక్క సారిగా జ్ఞాపకాలు ముసురుకున్నాయి.
షోయబ్‌ఖాన్‌ వాళ్ళ ఇల్లు బాబ్జిరెడ్డి ఇంటికి ఎదురిల్లు కావడంతో ఇంట్లో వాళ్ళ మనిషిగానే తిరిగేవాడు. ‘అరే చోటు ఇదర్‌ ఆవో, ఉదర్‌ జావో, ఏ లావో, ఓ లావో ఎన్నో పురుమాయింపుల మధ్య పెరిగాడు. బాబ్జిరెడ్డి ఓ మోస్తరు భూస్వామి కింద లెక్క. పెద్ద డాబా లాంటి ఇల్లు, ఎడ్ల కొట్టాలు, గేదలు, గొర్లు, మేకల దొడ్లతో పెద్ద విస్తీర్ణంలో వుంది. షోయబ్‌ఖాన్‌కు ఆ ప్రాంతమంతా ఆట స్థలం. కలియ తిరిగేవాడు. ఆడ్డు చెప్పేవాళ్లే లేరు. స్కూల్లేని నాడు అమ్మీ అబ్బాలకు తనని పట్టుకోవడానికి వశపడేది కాదు. తనని వెతకడానికి అమ్మీ వస్తే ”బూబమ్మ గారు… వాడు ఇక్కడే ఎక్కడో వుండి వుంటాడు లెండి. వున్నీయండి, ఆడుకోనీయండి, పొద్దటి టిఫిన్‌ కోసమైతే వెతకవద్దు, నాతో కలిసి తింటాడు” అటుండేవాడు బాబ్జిరెడ్డి.
”స్నానం చేయ లేదండి” అమ్మీ నసిగితే…
”అట్లనా, నేను వెతికి పంపిస్తాను లెండి” అనేవాడు బాబ్జిరెడ్డి.
ఆ ఇంట్లో మంగలి వెంకమ్మ, యాకయ్య జంటకు సీత పుట్టే వరకు ఇంట్లో షోయబ్‌ ఖాన్‌దే రాజ్యం. సీత పుట్టిన తరువాత కూడా తనపట్ల బాబ్జిరెడ్డి ప్రేమ, ఆప్యాయతల్లో వ్యత్యాసం రాలేదు. బాబ్జిరెడ్డితో ఎదురుపడి మాట్లాడానికి షోయబ్‌ వాళ్ళ అమ్మీ భయపడుతుండేది. షోయబ్‌ ఇంటర్‌లో వుండగా, సీత ఎనిమిదో తరగతి చదువుతుంది. అప్పుడు బాబ్జిరెడ్డి ఫ్లాష్‌ బ్యాక్‌ తెలిసింది. ఇతను కూడా చెడ్డవాడా? అని ఆశ్చర్యపోయాడు షోయబ్‌ ఖాన్‌.
బాబ్జిరెడ్డి వాళ్ళది చానా పెద్ద కుటుంబమని, అన్నదమ్ములు, అక్కా చెల్లెళ్లు, చిన్నాన్న, పెదనాన్న పిల్లలతో చానా మందితో కళకళలాడుతూ వుండేదని, ఇతను తన తల్లిదండ్రులకు ఒక్కగానొక్క కొడుకు కావడం వల్ల, బాగా ఆస్తి పరులు కావడంతో, గారాబం పెరిగి పోయి, అడ్డు చెప్పేవారు ఎవరూ లేకపోవడంతో చెడు అలవాట్లకు బానిస కావడం, ఎవరి మాటా వినకపోవడం అలవడ్డాయి. తాగడం, చెడు తిరుగుళ్లకు అడ్డూ అదుపు లేకుండా పోయింది.
ఒకరోజు బాగా తాగిన మైకంలో పెద్దనాన్న వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. గదిలో ఒంటరిగా పడుకున్న చెల్లెలుపై అఘాయిత్యం చేశాడట. దాంతో ఆ చెల్లెలు అవమానం భరించలేక ఇంట్లోనే ‘ఉరి’ పోసుకొని చనిపోయింది. అప్పటినుంచి బాబ్జిరెడ్డి కుటుంబం వంటరిదై పోయింది. ఆస్తిపాస్తులున్నా లాభం లేకుండా పోయింది. చుట్టుపక్కల చుట్టాలు, రెడ్డి సామాజిక వర్గమంతా వెలివేశారు. పిల్ల నెవ్వరూ ఇవ్వడానికి ముందుకురాలేదు. పెళ్లి కాకుండా వుండి పోయాడు. ఆ అవమాన భారంతో తల్లిదండ్రులు చనిపోయారు. బాబ్జిరెడ్డిలో వచ్చిన మార్పుతో పెళ్లి ప్రయత్నాలు చేయకుండానే ఒంటరిగా మిగిలాడు. కానీ-
వ్యవసాయ పనుల కోసం మంగలి కులం యువ జంటను ఇంట్లో పనికి, జీతానికి పెట్టుకున్నాడు. భర్త వ్యవసాయ పనుల కోసం, భార్య ఇంట్లో పనుల కోసం కుదుర్చుకున్నాడు బాబ్జిరెడ్డి. తన కాంపౌండులోనే చిన్న ఇంటిని కట్టిచ్చి ఇచ్చాడు. ఎటు నుంచి ఏమైందో, బల ప్రయోగమో, లొంగుబాటో బయటి ప్రపంచానికి వాస్తవం తెలియదు. తెల్సినా, తెలుసుకున్నా ఆ బక్క, పేద జంట బాబ్జిరెడ్డికి ఎదురు నిలవగలరా? నిందను మోపగల స్థితిలో ఆ ఆలుమగల ఆలోచనలు సాగలేదు. ఏది జరిగినా తమ మంచికేనని సర్దుకొని పోయారు. బాబ్జిరెడ్డి నీడన బతికేస్తున్నారు.
ఆ మంగలి యాకయ్యకు పెద్ద ఆస్తిని అజమాయిషీ చేసే పెత్తనం కలిగింది. ఆ వ్యవసాయ కమతంలో ఏ పని చేయాలన్నా యాకయ్యను సంప్రదించకుండా పని మొదలు పెట్టడు. అదో తృప్తి యాకయ్యలో. ఇంత ఆస్తినంతటిని తనను నమ్మి అజమాషీ అనండి, పెత్తనం అనండి, ఒక హోదాను కట్టపెట్టాడు బాబ్జిరెడ్డి. దీంతో నోట్లో వున్న నాలుకను కూలి జనంపై అరవడానికి వాడేస్తుంటాడు. ఒంటి మీద ఇస్త్రీ మడత నలగని బట్టలు, పాత పడని చెప్పుల జత, నోట్లోకి బ్రిష్టల్‌ సిగరేట్టుతో కనిపిస్తాడు. తనలో పేరుకున్న నిరసనను సిగరేటు పొగలో గుప్పుగుప్పున వూదేస్తూ వుంటాడు. అదో దర్పం ఇతగాడికి. పక్కూర్లో బాబ్జిరెడ్డికి పది ఎకరాల పొలం వుంది. వరి కోతలకు వస్తే వారం పది రోజులదాకా ఇంటి ముఖం చూడ్డం సాధ్య పడదు. అట్లాంటి పని ఒత్తిడిలో తను వున్నప్పుడు, పొలం కోతల పని ఎక్కడదాక వచ్చిందో చూడవచ్చిన రెడ్డి ”అరె, యాకయ్య… నీ పెండ్లం నీల్లాడిందిరో’, ఆడ పిల్లపుట్టిందని, తల్లీబిడ్డ క్షేమంగా వున్నారని చెప్పాడు. వరి కోతలు కోస్తున్న కూలి వాళ్ళు తలలు పైకి ఎత్తకుండానే విని నవ్వుకున్నారు.
‘రెండు రోజులు కావస్తుంది, పోయి ఒక పాలి చూసిరాపొ” అని ఇంటికి తోలాడు బాబ్జిరెడ్డి. చుట్టూ పొలంలో పని చేస్తున్న కూలాళ్ళు అదో మాదిరిగా చూస్తుంటే….
”పిచ్చెదవ, ఎప్పుడు పనిపని అని పొలంలోనే చస్తాడు. పొలం అమ్మటా, పుట్టలెంట తిరుగుడే ద్యాస. ఇంటి దగ్గర తన కోసం ఒకతుందని మంచీ, చెబ్బర చూడాలని ద్యాసే లేదు ఎర్రి మాలోకం” అనుకుంటూ మరో దిక్కుకు పోయాడు బాబ్జిరెడ్డి అక్కడ వుండలేక. ఆ దృశ్యం చూస్తే నోరు తెరిచి చెప్పాల్సిన పనిలేదు. నిరసనని మౌనంగానే బాగా అంటినట్టు వివరంగా ప్రకటించవచ్చు అని తెల్సివస్తుంది.
సీతది చూడచక్కని రూపం. షోయెబ్‌ కంటే ఐదేళ్ళు చిన్నది. ఒక ఇంట్లో పెరిగిన పిల్లలు. చదువుల్లో క్లాస్‌ పైకి పెరుగుతున్నట్టే వాళ్ళ స్నేహం బలపడుతూ పోయింది. షోయెబ్‌ఖాన్‌ డిగ్రీ పాస్‌ అయినంక, బాబ్జిరెడ్డి గారే తన పలుకుబడితో ఉద్యోగం కూడా ఇప్పించారు. పక్క మండలంలోనే టీచర్‌ ఉద్యోగం.
షోయెబ్‌ఖాన్‌ అమ్మీ ఆగత లేదు, షోయెబ్‌కు పెండ్లి చేయాలని తెగ ఆరాట పడిపోతుంది. ఆ ఆగని ఆరాటంతోనే అబ్బాను రెక్క పట్టుకొని బాబ్జిరెడ్డి గారింటికి లాక్కెళ్ళి తన మనసులోని మాట బయట పెట్టింది షోయెబ్‌ అమ్మీ. బాబ్జిరెడ్డి అది విని వాడికి అప్పుడే పెళ్ళా అని పగలపడి నవ్వాడట. ”అప్పుడే వాడికి పెళ్ళికి తొందరెందుకు?” అని.
”ఎర్రగా బుర్రగా వున్నాడు, ఎవరైనా కాజేసుకోపోతే నేను అన్యామైపోతాను. వాడితో నా కోరికలు ముడిపడి వున్నాయి. అవి తీరకపోతే నేనుచస్తాను” అనింది షోయెబ్‌ఖాన్‌ అమ్మ.
‘అయ్యయ్యో… ఇంత దానికే ఆమాటలెందుకు. సరే అలానే కానీయండి. అలానే చూడండి. మా స్నేహితుల్లో ఎవరికైనా పెళ్ళీడు అమ్మాయిలు వున్నారేమో తెలుసుకుంటాను” అని అన్నాడంట బాబ్జిరెడ్డి.
‘సరే’ నని అమ్మీఅబ్బా ఇంటికి వచ్చారు.
ఇదంతా సీత ఇంట్లో అటూఇటూ తిరుక్కుంట విని తనూ అప్పటివరకు సంతోష పడింది. రాత్రికి మామూలుగానే నిద్రపోయింది. ఏదో కలలో మాదిరి ఉలిక్కిపడి లేచి మంచంలో కూర్చుంది. షోయెబ్‌కి పెళ్లైపోతే ఇంకో అమ్మాయి వచ్చి పక్కన చేరిపోయి వుంటే నేనెట్లా షోయెబ్‌తో చనువుగా మాట్లాడేది. అతన్ని కలవకుండా, మాట్లాడకుండా పొద్దు ఎట్లా గడుస్తుంది? షోయెబ్‌తో మాట్లాడకుండా వుండగలనా?
ఈ ఆలోచన ఏదో తేడాగా వుందే. తేడా, తేడానే అనుకోని మళ్ళీ పడుకుంది.
శనివారం సాయంత్రానికల్లా ఇంటికి వచ్చేవాడు, ఆదివారం వుండి సోమవారం పొద్దున్నే స్కూలుకు వెళ్ళేవాడు. సీత పని గట్టుకొని ఎదురు చూస్తుండేది. షోయెబ్‌ఖాన్‌ పెళ్ళి మాట విన్నదగ్గరి నుంచి అదోరకంగా మారిపోయింది. తనలో తను ఘర్షణ పడేది. మనసులో మాట చెప్పడానికి సమయం కోసం ఎదురు చూస్తుంది. ఆ ఆదివారం వెతుక్కుంటూ తోటలోని బాయి దగ్గరికి వచ్చాడు. సీత అక్కడే పూల మొక్కలకు పైపుతో నీళ్ళు పెడుతూ కన్పించింది.
”ఇక్కడున్నావా?” అని పలకరించాడు .
”ఎక్కడుంటాను? మా ఇంట్లోనే ఏవో వున్న పనులు చేసుకుంటూ వుంటాం గదా?’ అని సాగదీసింది. మాటల్లో తేడాను గమనించి ”ఏంటీ?” అని ఆసక్తిగా సీత వైపు చూశాడు షోయెబ్‌ఖాన్‌.
”ఆ, ఏమీలేదు. ఏముంటాయి మాదగ్గర కొత్త విషయాలు” అంది.
”కొత్తగా మాట్లాడుతుంటేను” అన్నాడు.
”నేనేమన్నా కొత్తవాళ్ళను చూడటానికి, కలవడానికి, దోస్తానా కలుపుకోవడానికి పోతున్నానా ఏంటి? అలా చూడటానికి పోయిన వాళ్ళ దగ్గరగదా కొత్త విషయాలు వుండేది” అంది.
”నసగకుండా అసలు విషయమేంటో సూటిగా చెప్పు” అన్నాడు.
”నాలో నీకు ఏ కొత్తదనం, అంటే ఎట్రాక్షన్‌ కనపడ్డం లేదా?” అంది.
”ఏమీ లేదే, చిన్నప్పటి నుంచి నిన్ను చూస్తున్నదే గదా, కొత్తేం కాదు కదా?” అన్నాడు.
”పెళ్లి సంబందాలు చూడటానికి పొతూనే వున్నావుకదా. వాళ్ళను చూస్తుంటే ఏ ఫీలింగ్‌ కలగటం లేదా? చెప్పు! ఆ దృష్టితో నన్ను కూడా చూడు అంటున్నా” అంది.
అదిరిపడ్డాడు. ”ఏమన్నా పిచ్చా నీకు?” గట్టిగా అర్సినంత పనిచేశాడు.
‘నీకు మీ ఇంట్లో పెళ్ళి సంబంధాలు చూస్తున్న దగ్గరి నుంచి నాకు ఈ ఆలోచన కలుగుతుంది. నాలో ఏం తక్కువ? పెళ్ళి చేసుకోవడానికి పనికిరానా?” అంది.
‘నాకు నిన్ను పెళ్ళి చేస్కోవాలని వుంది. చిన్నప్పటినుండి ఎలాగో కలిసే వున్నాం. చచ్చేవరకు ఇలానే బతుకుదాం అంటున్న” అని ఇంట్లోకి ఉరికింది.
సీతతో అవునని, కాదని చెప్పలేక పోయాడు. పెద్దాయనకు తెలిస్తే ఏమంటాడో, రియాక్షన్‌ ఊహించడం కష్టం. అమ్మానాన్నలకు ఏదో విధంగా సర్దిచెప్పడం కష్టం కాదు. షోయెబ్‌ను అమితంగా ప్రేమించే బాబ్జిరెడ్డి గారి తోనే సమస్య.
ప్రతి రంజాన్‌ పండుగనాడు అమ్మీ సేమియాలు చేయగానే పెద్ద గిన్నెలో పోసి ఇచ్చేది. ఎవరికోసమో చెప్పేది కాదు. షోయెబ్‌ జాగ్రత్తగా పట్టుకెళ్ళి బాబ్జిరెడ్డి గారు ఈజీ చైర్లో కూర్చోనుంటే స్వయంగా తన చేతులతో చెంచాతో తాగించే వాడు. ఆయన అలానే ఇష్టంగా తాగేవారు. ఇప్పుడు ఈ విషయం తెలిస్తే ఆ తీపంతా చేదెక్కి పోతుందేమో? ఎలా స్వీకరిస్తారు? చిన్నప్పటినుండి దగ్గరికి తీస్కోని లాలించినట్లు లాలించగలరా? తలలో చేయి పెట్టి గోముగా నిమరగలరా?
ఈ పెంకిపిల్ల అన్నంత పనిచేస్తే, తనేమై పోతాడు. నలుగురులో మనిషిగా బతకాలి కదా? అలా సాధ్యపడుతుందా? బాబ్జిరెడ్డి గారు సీతని తన కూతురని ఎక్కడా ఎప్పుడూ చెప్పలేదు. బహుశా చెప్పడు కూడా. ఆ రంగు, రూపు చూస్తే ఎవరూ కాదని కొట్టి పారేయలేరు. షోయెబ్‌కు, షోయెబ్‌ కుటుంబానికి తెలుసు, ఊరంతటికీ తెలిసిన బహిరంగ వాస్తవం, సీత బాబ్జిరెడ్డిగారి కూతురే అని.
బొక్కెన్ని బాయిలోకి గిరాటు వేసినట్టు, బాయిలో మునిగి పోతున్న ఫీలింగ్‌. ఏదన్నా ఆధారం దొరుకుతుందేమోనని వెతుకులాట. కొద్దిసేపు అక్కడే బాయి గోడ మీద కూర్చొని, తేరుకొని సరాసరిగా ఇంటికి వెళ్లిపోయాడు షోయెబ్‌ఖాన్‌.
”అలా సాధ్యపడుతుందా?’ వేదించే ప్రశ్న. ఏవో కారణాలు చెపుతూ రెండు వారాలనుంచి ఇంటికి రావడంలేదు షోయెబ్‌ఖాన్‌.
పొద్దుటే తలుపులు దబదబా చప్పుడవుతుంటే కళ్ళు నులుముకుంటూ నిద్ర లేచాడు షోయెబ్‌ ఖాన్‌.
‘ఎవరబ్బా ఇంత పొద్దుటే’ అనుకుంటూ తలుపు తెరిచాడు. తలుపు ఎదురుగా వున్న వ్యక్తిని చూసి నిర్గాంతపోయాడు.
”సీత” అన్నాడు ఆశ్చర్యపొతూ.
నోరు మూతపడక ముందే ”పక్కకు జరుగు, తలుపుకు అడ్డంగా నిలబడ్డావ్‌” అని షోయెబ్‌ని పక్కకు తోసుకుంటూ ఇంట్లోకి వెళ్ళింది. షోయెబ్‌ ఇంకా షాక్‌ నుంచి తేరుకోలేదు.
”ఇంత చిన్న ఇల్లు తీసుకున్నావ్‌? ఆ.. సరిపోద్దిలే. రెండుగదులు, ముందు చిన్న హాలు, ఒకటి బెడ్రూం, ఒకటి వంటగది అనుకుంటూ పరిశీలిస్తుంది.
”ఏంది పిల్లా, ఇట్లొచ్చినవ్‌ ఎవరైనా మనల్ని ఇట్లా చూస్తె లేపుకొచ్చిన్నేమోనని నన్ను అనుమానించరా?’ అన్నాడు షోయెబ్‌ ఖాన్‌.
”అనుకుంటే ఏమైతది, అనుకోని” అంది సీత.
”ఇంట్లో పాలు ఉన్నాయా? నేను టీ తాగాలి” అని హుకుం జారీ చేసింది.
”లేవు, తీస్కోని రావాలి” అని నైట్‌ డ్రస్‌ మీదనే చెప్పులు తొడుక్కొని బైటికి వెళ్ళాడు.
”అగో, అట్లుండాలి” మనసులో అనుకొని నవ్వుకుంది సీత.
ఇద్దరు ‘టి’ లు తాగినంక, ”ఇక చెప్పు టిఫిన్‌ ఏం తెమ్మంటావ్‌” అన్నాడు
”ఇంట్ల ఏం సరుకులు లేవా? మొన్న అమ్మ వచ్చివుండే గదా. సరుకులు ఏమీ తెప్పియలేదా?” అంటూ టీ తాగిన రెండు ఎంగిలి కప్పులు చేత పట్టుకొని వంట గదిలోకి వెళుతుంది.
అది గమనించి ”ఓ మేడం, ఇంట్ల వంట పని పెడతావా? అది ఏం నడువదు. టిఫిన్‌ తెస్తా, తిని ఇంటి దారి పట్టు” అన్నడు.
”పోవుడేంది, వెళ్ళి పోవడానికి రాలేదు. ఇక్కడ నీతో కలిసి బతకడానికి వచ్చాను” అంది సీత .
”ఇగో నాతోని పరాచికాలు ఆడబోకు, టిఫిన్‌ తిని ఇక్కడి నుంచి దొబ్బెరు” అన్నడు.
‘ఇది బాబ్జిరెడ్డి అంకుల్‌కు తెలిస్తే నన్ను బతకనిస్తాడా? ఏం ముఖం పెట్టుకొని ఆయన ముందు నిల బడాలి” అన్నడు.
”నీకు దైర్నం లేకుంటే చెప్పు, నేనే పోయి నాన్నతో చెప్పేస్తాను” అంది.
‘యా అల్లా’ తల పట్టుకున్నాడు షోయెబ్‌ ఖాన్‌.
”నా మనుసులోని మాటచెపితే ఏమీ బదులివ్వకుండా ముఖం చాటేస్తావా? ఇంటికి రాకుండా ఇక్కడే వుంటావా?” అంది సీత
”ఈ ఇంటి అడ్రస్‌ ఎట్లా తెలిసింది నీకు?’ అని ఓ అమాయకపు ప్రశ్న వేసిండు షోయెబ్‌ ఖాన్‌
”అత్తయ్య చెప్పింది” అంది సీత
”అత్తెంది? నిన్నటి వరకు ఆంటీ అని పిలిసేదానివి కదా” అన్నాడు.
”ఆంటీ అన్నా అత్తే, అత్తా అన్నా ఆంటీ నే, ఏం తేడా లేదు. భాషే వేరు” అంది.
‘ఒకళ్ళని ప్రేమించడం కంటే ప్రేమించబడటం గొప్ప అదృష్టం’ మనసులో అనుకునేవాడు షోయెబ్‌ఖాన్‌.
ఇదే తకరారు, సీత బైటికి వెళ్ళదు. షోయెబ్‌ ఖాన్‌ స్కూలుకు వెళ్ళడు. స్కూలుకు వెళ్ళడం మానేసి ఇంట్లోనే వుంటున్నాడు.
”ఇగో ఇంకొన్ని రోజులకైనా ఈ విషయం మీ ఇంట్లో, మా ఇంట్లో తెలుస్తుంది. బాబ్జిరెడ్డి మీ నాన్నకు తెలుస్తుంది, నా తాట తీస్తాడు. ఇది మాత్రం జరగటం ఖాయం” మాటిమాటికి అంటుండేవాడు షోయెబ్‌ ఖాన్‌.
రెండు మూడు రోజులు వెతికి లాభం లేదని బిడ్డ కనబడటం లేదని యాకయ్యతో పోలీస్‌ స్టేషన్‌లో ‘మిస్సింగ్‌’ కంప్లైంట్‌ పెట్టిచ్చాడు బాబ్జిరెడ్డి.
జంట పోలీస్‌స్టేషన్‌కు చేరుకుంది. షోయెబ్‌ఖాన్‌ అమ్మీఅబ్బాలకు తెలిసి నిర్గాంతపోయారు. షోయెబ్‌ఖాన్‌ తల్లి ఇంట్లోనుంచి బయటకు రావడం మానేసింది. అదే వీధిలో బాబ్జిరెడ్డి ఇల్లు, షోయెబ్‌ఖాన్‌ తండ్రి టౌన్‌లో ఫ్రూట్‌ మార్కెట్లో హోల్‌సేల్‌ దుకాణం కట్టేసి, ఉండబట్టలేక పోలీస్‌ స్టేషన్‌కు వెళ్ళి ఎస్‌.ఐ గారిని కలిస్తే… ‘సి.ఐ. గారు వస్తారు బైట వుండండి’ అంటే స్టేషన్‌ ముందు చెట్టు కింద నిల్చున్నాడు. కొడుకు లోపట సెల్లో వుంటే, బాబ్జిరెడ్డి ఫీలింగ్‌ ఎట్లా వుంటుందోనని సస్పెన్స్‌ వెంటాడుతుంది. పలక రించాడానికి వచ్చిన వాళ్ళతో మాట్లాడుతూ నిల్చున్నాడు పాషాఖాన్‌.
బాబ్జిరెడ్డి అధికార పార్టీకి, ఈ ప్రాంతానికి పెద్దదిక్కు. చక్రం తిప్పే సమర్దుడు. యం.ఎల్‌.ఏ, యం.పి కాక పోయినా పార్టీలో అంతటి స్థాయి వున్నవాడు. బాబ్జిరెడ్డి ఫీలింగ్‌ ఎట్లుండబోతుందో, ఏమంటాడోనని షోయెబ్‌ఖాన్‌ తండ్రికి ఒకటే దిగులు. కబురు చేరే వుంటుంది. బాబ్జిరెడ్డి ఇంకా స్టేషన్‌కు రాలేదు. వస్తాడోరాడో కూడా తెలియడం లేదు. అన్నిచోట్లా అవే గుసగుసలు. ఏమౌతుందోనని అందరిలో ఆసక్తి. సి.ఐ. రాగానే షోయెబ్‌ఖాన్‌ తండ్రిని లోపలికి పిలిచి మాట్లాడి ఇంటికి పంపించేశాడు. ఊరంతా ఒక ఉక్కపోతలో వున్నట్టు కుతకుతా వుడుకుతుంది. షోయెబ్‌ఖాన్‌ అమ్మీ ఇంట్లో నుంచి బయటకు రావడం మానేసింది. ఈ సస్పెన్సకు ఎలా తెర పడుతుందోనని ఎదురు చూస్తున్నారు జనం.
సి.ఐ. కారులో పిల్లలిద్దరితో వచ్చి బాబ్జిరెడ్డి ఇంటి ముందు ఆగింది. సి.ఐ. కారు దిగంగానే బాబ్జిరెడ్డి వచ్చి సి.ఐ.గారిని కలిశాడు. షోయబ్‌ఖాన్‌ భయంభయంగా కారు దిగుతుంటే బాబ్జిరెడ్డి చూసి ”ఏరా దగ్గర కూర్చొని అస్తమానం కబుర్లు చెప్పే వాడివి గదా, నీ నోట ఈ కబురు కూడా వింటే ఎంత సంతోషించే వాడిని” అన్నాడు.
షోయెబ్‌ఖాన్‌ అదిరి పోయాడు. రాజకీయ నాయకుడు కదా ఏ మలుపు తిప్పుతాడోనని నిజంగా భయపడ్డాడు. నోట మాట రాలేదు. చుట్టూ చూస్తున్నా ఏ దృశ్యం కంటికి కనిపించడం లేదు. ఏదో మాయతెర కమ్మేుసినట్టు వుంది షోయెబ్‌ఖాన్‌కి.
‘నాన్నా… ఇందులో షోయెబ్‌ఖాన్‌ది ఏమీ లేదు’ అంది సీత.
నవ్వుతూ కూతురుని దగ్గరికి తీసుకున్నాడు. అందరూ నవ్వుకున్నారు.
‘షోయెబ్‌ నాన్నను, అమ్మను పిల్చుకొని రాపో’ అని చెప్పి పంపాడు బాబ్జిరెడ్డి. యాకయ్య పక్కనే వుండి తన అయిష్టతని తెలియచేయపోయాడు. కోపంగా చూసి నిభాయించుకొని ఇలా అన్నాడు ”నా ఆస్తి విలువ ఎంత వరకు వుండొచ్చు చెప్పగలవా?” అని ప్రశ్నించాడు. జవాబు రాక పోవడంతో మళ్ళీ తనే ”నా ఆస్తికి, పదిరెట్ల ఆస్తి కలిపి కట్నకానుకలుగా ఇచ్చి చేసినా సీతకు ఈ గుణాలున్న పిల్లవాణ్ణి తేలేం. ఇక నీ ఇష్టం” అన్నాడు. ఎదురు జవాబు రాకపోవడంతో చర్చను ముగించాడు. తను ఎట్లాగో పెళ్ళికి నోచుకోలేదు. పిల్లల పెళ్లన్నా తన చేతుల మీదుగ జరుపుదామని అనుకొని వుంటాడు అనుకున్నారు జనం.
కాషాయరంగు జెండాలు చేతుల్లో పట్టుకొని వచ్చిన చిన్న గుంపు పోలీస్‌ స్టేషన్‌ ముందు ధర్నాకు దిగి యాంటీ ‘లౌ జీహద్‌’ నినాదాలు చేస్తుంటే ఆ అరుపులకు షోయెబ్‌ఖాన్‌ తేరుకొని ప్రస్తుతంలోకి వచ్చి ఏం జరగబోతుందో గమనిస్తున్నాడు.
ఇంతలో ఒక కానిష్టేబుల్‌ ఖాన్‌ చెంతకు వచ్చి ”మీరు ఇక్కడ వుండోద్దు, వెళ్ళి పొండి” అని హెచ్చరించాడు. ఏం జరగబోతుందో అర్దంకాక అయోమయంగా ఆలోచిస్తూ మంత్రిగారున్న గెస్ట్‌హౌస్‌కు వచ్చాడు షోయెబ్‌ఖాన్‌.
పాట్నా గెస్ట్‌హౌస్‌ ముందు ఖాళీ స్థలంలో పూలతోట పెద్ద విస్తీర్ణంలో వుంది. అక్కడక్కడ బెంచీలు వేసి వున్నాయి. ఆ బల్లల మీద కూలబడి మంత్రి గారి పిలుపు కోసం ఎదురు చూస్తున్నాడు. బాబ్జిరెడ్డికి ఫోన్‌ చేసి ఇక్కడి పరిస్తితులు చెప్పి ”ఒకసారి మంత్రిగారితో మాట్లాడండి. ఇక్కడ ఏం జరుగుతుందో నాకు అర్దం కావడం లేదని” చెప్పాడు.
పాపం సీత, కొడుకు గురించి ఆరా తీస్తూ, భోరుమని ఏడుస్తుంది. అంతలోనే ‘ఆ అమ్మాయిని చూశారా? ఎలావుంది? అమ్మాయితో మాట్లాడి వెంటపెట్టుకొని తెచ్చేయండి. ఇక్కడే పెళ్ళి చేసుకుందాం. పరిస్థితులు నిమ్మళంగా అవే సర్దుకుంటాయి” అంటుంది సీత.
ఓ గంటకు ఒక వ్యక్తి వచ్చి మంత్రిగారు పిలుస్తున్నారని చెప్పి పిల్చుకుపోయాడు.
మంత్రి గారు నవ్వుకుంటూ ఆహ్వానించాడు. కూర్చున్నాక క్షేమ సమాచారాలు అడిగి తెల్సుకొన్నాడు. ‘ఆప్‌ కే హోంమంత్రి జీ నే మేరేకో ఫోన్‌ మే ఆఫ్‌ కా ప్రాబ్లం కే బారేమే బతాయే’ అని మొదలు పెట్టి చెప్పిండు.
‘మీ అబ్బాయి చదువుతున్న ఐ.ఎ.యం కాలేజ్‌ కి చెందిన ఒక విద్యార్ది సంఘం వాళ్లు మీ కుర్రాడి మీద ‘లౌ జీహాద్‌’ మీద పోలీస్‌ స్టేషన్‌లో కేసు పెట్టారట. అందుకే మీ అబ్బాయిని అరెస్టు చేసి తెచ్చి స్టేషన్‌లో పెట్టారు. సరే ఆ విషయం నేను చూసుకుంటాను. సాయంత్రం వరకు వుండండి. అధికారులతో మాట్లాడి మీకు సొల్యూషన్‌ చెపుతాను, ఆందోళన పడకండి” అని చెప్పాడు. ”ఈ వ్యక్తితో వెళ్ళండి, మీకు ఇక్కడే బస ఏర్పాటు చేస్తాడు” అని చెప్పాడు.
ఉన్నత స్థాయి విద్య చదువుకున్న వాళ్లు ఈ దేశానికి ఏమని అర్దం చెపుతారో అర్దమవదు. రాత్రికి రాత్రే అల్లావుద్దీన్‌ అద్బుత దీపంలా ఏదో మిరాకిల్‌ జరగాలేమో? అయ్యా అంబేత్కర్‌ గారు, గాంధీ గారూ మళ్ళీ పుట్టండయ్యా.
వీళ్ళిద్దరితో పాటు కారల్‌మార్క్స్‌ని కలిపి అందించే రాజకీయ అవగాహన ఉన్న తరం అవసరం వుంది అనుకున్నాడు.

-హనీఫ్‌, 9247580946