1న పెన్షన్‌ విద్రోహ దినం : సీపీఎస్‌టీఈఏ

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
వచ్చేనెల ఒకటిన పెన్షన్‌ విద్రోహ దినం పాటించాలని సీపీఎస్‌టీఈఏ ప్రకటించింది. ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు దాముక కమలాకర్‌, ప్రధాన కార్యదర్శి చీటి భూపతిరావు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో సీపీఎస్‌ విధానాన్ని 2004, సెప్టెంబర్‌ ఒకటి నుంచి అమలు చేస్తున్నారని తెలిపారు. ఆ రోజు నుంచి ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యుల్లో మానసిక ప్రశాంతత లేదని పేర్కొన్నారు. సీపీఎస్‌ను రద్దు సెప్టెంబర్‌ ఒకటిన పెన్షన్‌ విద్రోహ దినంగా పాటించాలని కోరారు. ఉద్యోగులంతా నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరు కావాలని సూచించారు. జిల్లా కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలను చేపట్టాలని పిలుపునిచ్చారు. సీపీఎస్‌ను రద్దు చేసి ఓపీఎస్‌ను పునరుద్ధరిస్తామంటూ ఎన్నికల మ్యానిఫెస్టోలో కాంగ్రెస్‌ ప్రకటించిందని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆ హామీని నిలబెట్టుకోవాలని కోరారు.