– నేటితో ముగియనున్న దరఖాస్తు గడువు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)కు రాష్ట్రవ్యాప్తంగా 2,07,765 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. ఈ మేరకు టెట్ కన్వీనర్ రమేష్, పాఠశాల విద్యాశాఖ సంచాలకులు, టెట్ చైర్మెన్ ఈవి నరసింహారెడ్డి మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. టెట్ పేపర్-1కు 61,930 మంది, పేపర్-2కు 1,28,730 మంది, రెండింటికీ 17,104 మంది కలిపి మొత్తం 2,07,765 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారని వివరించారు.. టెట్ దరఖాస్తుల సమర్పణకు తుది గడువు బుధవారం వరకే ఉన్న విషయం తెలిసిందే. టెట్‌కు దరఖాస్తు చేసిన అభ్యర్థులు వారి దరఖాస్తులను సవరణ చేసుకునేందుకు అవకాశం కల్పించారు. ఈనెల 22 వరకు సవరణకు గడువుంది. ఇతర వివరాల కోసం https://schooledu.telangana.gov.in వెబ్‌సైట్‌ను సంప్రదించాల్సి ఉంటుంది. అభ్యర్థులకు ఏమైనా సందేహాలుంటే 7032901383/9000756178 నెంబర్లను సంప్రదించాలి.
టెట్ దరఖాస్తు గడువును పెంచాలి
టెట్ దరఖాస్తు గడువును రెండు, మూడు రోజులు పెంచాలని అభ్యర్థులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. బుధవారంతో దరఖాస్తు గడువు ముగియనున్న విషయం తెలిసిందే. టెట్ గడువును పొడిగించాలని డీఎడ్, బీఎడ్ అభ్యర్థుల సంఘం ప్రభుత్వాన్ని కోరింది. గ్రూప్-3 పరీక్షల హడావుడిలో అభ్యర్థులు చాలా మంది ఇంకా దరఖాస్తు చేసుకోలేదని వివరించింది.