– ఈ ఏడాది 25వేల మంది విద్యార్థులకు శిక్షణ
– ఏప్రిల్‌లో సింగపూర్‌లో అంతర్జాతీయ సదస్సు
– ఐసిఎస్‌ఐ ప్రెసిడెంట్ నరసింహన్ వెల్లడి
హైదరాబాద్ : ప్రస్తుత ఏడాదిలో వివిధ కోర్సుల్లో రెట్టింపు విద్యార్థులను నమోదు చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ది ఇన్స్‌ట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా (ఐసిఎస్‌ఐ) వెల్లడించింది. శనివారం హైదరాబాద్‌లో ‘డెమిస్టిఫైయింగ్ ఎన్‌సిఎల్‌టి ప్రాక్టిసెస్’పై సెమినార్‌ను నిర్వహించింది. ఈ సందర్బంగా ఐసిఎస్‌ఐ నేషనల్ ప్రెసిడెంట్ బి నరసింహన్, నేషనల్ కౌన్సిల్ మెంబర్ ఆర్ వెంకట రమణ మీడియాతో మాట్లాడారు. ప్రతీ ఏడాది వివిధ ప్రోగ్రామ్స్‌ల్లో 14,000 మంది విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నామన్నారు. ఈ ఏడాది దీన్ని 25వేల వరకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ప్రస్తుతం దేశంలో 72వేల మంది కంపెనీ సెక్రటరీలు ఉన్నారని నరసింహన్ తెలిపారు. 2047 నాటికి 30 ట్రిలియన్ డాలర్లకు ఆర్థిక వ్యవస్థ చేరితే.. 2 లక్షల మంది కంపెనీ సెక్రటరీల అవసరం ఉంటుందన్నారు. ఐసిఎస్‌ఐలో 72వేల పైగా సభ్యులు, 2 లక్షల మేర విద్యార్థులు నమోదై ఉన్నారని వెల్లడించారు. దేశంలోని 141 యూనివర్శిటీలతో ఒప్పందం కలిగి ఉన్నామన్నారు. తాజాగా ఉస్మానియా యూనివర్శిటీతో ఒప్పందం కుదర్చుకుంటున్నామన్నారు. సెక్యూరిటీస్ మార్కెట్స్‌పై ప్రోగ్రామ్‌ను చేపట్టడానికి సెబీతో భాగస్వామ్యం ఏర్పాటు చేసుకున్నామన్నారు. ఏప్రిల్ 5-6 తేదిల్లో సింగపూర్‌లో ఐసిఎస్‌ఐ మూడో అంతర్జాతీయ సదస్సును నిర్వహించనున్నామన్నారు. దీనికి భారత్ నుంచి 100 మంది ప్రతినిధులు హాజరు కానున్నారని తెలిపారు.