రిలయన్స్‌ లాభాల్లో 2 శాతం తగ్గుదల

రిలయన్స్‌ లాభాల్లో 2 శాతం తగ్గుదల– క్యూ4లో రూ.18,951 కోట్లుగా నమోదు
న్యూఢిల్లీ : ముకేష్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ ఇండిస్టీస్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఐఎల్‌) లాభాలు తగ్గాయి. గడిచిన ఆర్థిక సంవత్సరం (2023-24)లోని మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికం (క్యూ4)లో 18,951 కోట్ల నికర లాభాలు నమోదు చేసింది. ఇంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో రూ.19,299 కోట్ల నికర లాభాలు సాధించింది. దీంతో పోల్చితే గడిచిన క్యూ4 లాభాల్లో 1.8 శాతం తగ్గుదల చోటు చేసుకుంది. కాగా.. కంపెనీ రెవెన్యూ 11.3 శాతం పెరిగి రూ.2,40,715 కోట్లకు చేరింది. కంపెనీ మొత్తం వ్యయాలు 11.45 శాతం పెరిగి రూ.2,17,529 కోట్లుగా నమోదయ్యాయి.
ఆర్‌ఐఎల్‌ 2023-24కు గాను రెండో సారి డివిడెండ్‌ను ప్రకటించింది. ప్రతీ ఈక్విటీ షేర్‌పై రూ.10 డివిడెండ్‌ చెల్లింపునకు ఆ కంపెనీ బోర్డు ఆమోదం తెలిపింది. ఇంతక్రితం రూ.9 డివిడెండ్‌ను చెల్లించింది. ఆర్థిక సంవత్సరం 2023-24లో మొత్తంగా 2.6 శాతం వృద్థితో రూ.9,14,472 కోట్ల రెవెన్యూ ప్రకటించింది. ఇంతక్రితం ఏడాదిలో రూ.8.91 లక్షల కోట్ల రెవెన్యూ నమోదు చేసింది. ఇదే సమయంలో రూ.8.09 కోట్లుగా ఉన్న వ్యయాలు.. గడిచిన ఆర్థిక సంవత్సరంలో రూ.9.14 లక్షల కోట్లకు పెరిగాయి. 2023-24లో రూ.79,020 కోట్ల నికర లాభాలు నమోదయ్యాయి. ఇంతక్రితం ఏడాది రూ.73,670 కోట్ల లాభాలు ఆర్జించింది.
జియోకు బంఫర్‌ లాభాలు..
2023-24 మార్చితో ముగిసిన త్రైమాసికంలో రిలయన్స్‌ జియో 13.2 శాతం పెరిగి రూ.5,337 కోట్లకు చేరాయి. ఇంతక్రితం ఏడాది ఇదే క్యూ4లో రూ.4,716 కోట్ల లాభాలు నమోదు చేసింది. గడిచిన క్యూ4లో కంపెనీ రెవెన్యూ 11 శాతం పెరిగి రూ.25,394 కోట్లుగా చోటు చేసుకుంది. 2023-24లో జియో స్థూల రెవెన్యూ 10.4శాతం పెరిగి రూ.1 లక్ష కోట్లను చేరగా.. నికర లాభాలు 11.48 శాతం పెరిగి రూ.20,607 కోట్లుగా నమోదయ్యాయి.