హరితనిధిలో 20 శాతం ఆర్టీసీకి కేటాయించాలి సీఎస్‌కు ఎస్‌డబ్ల్యూఎఫ్‌ వినతి

హరితనిధిలో 20 శాతం ఆర్టీసీకి కేటాయించాలి
సీఎస్‌కు ఎస్‌డబ్ల్యూఎఫ్‌ వినతినవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
తెలంగాణ హరితనిధిలో 20 శాతం సొమ్మును ఆర్టీసీకి కేటాయించాలని టీఎస్‌ఆర్టీసీ స్టాఫ్‌ అండ్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌ (ఎస్‌డబ్ల్యూఎఫ్‌) విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు శుక్రవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారికి వినతిపత్రం సమర్పించారు. పర్యావరణ పరిరక్షణలో కీలకపాత్ర పోషిస్తున్న టీఎస్‌ఆర్టీసీకి హరితనిధి సొమ్ము కేటాయించి, ప్రజారవాణా మెరుగుదలకు కొత్త బస్సులు కొనుగోలు చేయాలని ఫెడరేషన్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వీరాంజనేయులు, వీఎస్‌ రావు కోరారు. 8 ఏండ్లుగా ఆర్టీసీ కార్మికులకు వేతనాలు పెరగలేదనీ, 2013 వేతన సవరణ బకాయి సొమ్మును చెల్లించలేదనీ, 9 డిఏల బకాయిలు ఇవ్వాల్సి ఉందనీ వివరించారు. ఆర్టీసీ కార్మికుల నుంచి హరితనిధి వసూలుపై కార్మికులకు అవగాహన కల్పించి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఆర్టీసీ బస్సుల సంఖ్య గణనీయంగా తగ్గిపోతున్నదనీ, వ్యక్తిగత వాహనాల వినియోగాన్ని తగ్గించాలంటే ఆర్టీసీ బస్సుల సంఖ్యను పెంచాల్సి ఉందని పేర్కొన్నారు. టార్గెట్లు పెట్టుకొని మొక్కలు నాటుతున్నారనీ, వాటి సంరక్షణను మాత్రం విస్మరిస్తున్నారని, చెట్ల నరికివేతకు పక్కా ప్రణాళిక లేకుండా ఉన్నదని అభిప్రాయపడ్డారు.