ఏడాదికి 200 రోజుల పని

– రోజుకు కనీస వేతనం రూ.600 ఇవ్వాలి
– కేంద్రానికి వ్యవసాయ కార్మిక సంఘాల నేతలు వినతి
న్యూఢిల్లీ : ఏడాదికి 200 రోజుల పని, రోజుకు కనీస వేతనం రూ.600 ఇవ్వాలని వ్యవసాయ కార్మిక సంఘాల నేతలు డిమాండ్‌ చేశారు. బుధవారం ఉపాధి హామీ సమస్యలపై గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ కార్యదర్శి శైలేష్‌ కుమార్‌ సింగ్‌కు వ్యవసాయ కార్మిక సంఘాల నేతలు వినతిపత్రం అందజేశారు. ప్రతినిధి బృందంలో ఏఐఏడబ్ల్యూయూ ప్రధాన కార్యదర్శి బి. వెంకట్‌, సహాయ కార్యదర్శి విక్రమ్‌ సింగ్‌, రాజ్యసభ ఎంపీ, సహాయ కార్యదర్శి వి. శివదాసన్‌, బీకేఎంయూ సంయుక్త కార్యదర్శి విఎస్‌ నిర్మల్‌, ఏఐఎస్‌కేఎస్‌ నుంచి అసిత్‌ గంగూలీ ఉన్నారు. ఈ సందర్భంగా ఉపాధి హామీ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. క్షేత్రస్థాయిలో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి వివిధ ఉదాహరణలతో వివరించారు. గ్రామీణ మంత్రిత్వ శాఖ కార్యదర్శితో జరిగిన చర్చ సానుకూల దిశలో జరిగిందనీ, అవసరమైన స్థాయిలో సమస్యలను చేపట్టేందుకు ప్రతినిధి బృందానికి హామీ ఇచ్చారని బి.వెంకట్‌ తెలిపారు.
డిమాండ్లు
ఏడాదికి 200 రోజుల పని,
రోజుకు కనీస వేతనం రూ.600 కల్పించాలి.
కులాల వారీగా నిధుల కేటాయింపు, ఉపాధి హామీ అమలుకు సంబంధించిన సూచనలను ఉపసంహరించుకోవాలి.
ఎన్‌ఎంఎంఎస్‌ తో ఆన్‌లైన్‌ హాజరును ఉపసంహరించుకోవాలి.
ఆధార్‌ ఆధారిత చెల్లింపు వ్యవస్థ (ఏబీపీఎస్‌) నుంచి వేతన చెల్లింపును డీలింక్‌ చేయాలి.
ఉపాధి హామీ కోసం రూ. 2.56 లక్షల కోట్లు కేటాయించాలి.
ఉపాధి హామీ డిమాండ్‌ ఆధారిత పాత్రను నిర్ధారించాలి.
పెండింగ్‌లో ఉన్న వేతనాలన్నింటినీ వెంటనే చెల్లించాలి.
సామాజిక తనిఖీతో ఉపాధి హామీ పనుల కింద అవినీతిని
తనిఖీ చేయాలి. సామాజిక తనిఖీ కోసం బడ్జెట్‌ను పెంచాలి.
60 ఏండ్లు దాటిన ఉపాధి హామీ కార్మికులు,
వ్యవసాయం, గ్రామీణ కార్మికులకు పెన్షన్‌ ఇవ్వాలి.
ఉపాధి హామీ వర్క్‌ సైట్లలో ప్రాథమిక సౌకర్యాలు కల్పించాలి.