మాజీ భారత ప్రధాని శ్రీమతి ఇందిరా గాంధీ గతంలో ఎమెర్జెన్సీ ప్రకటించిన రోజును, అంటే జూన్ 25ను రాజ్యాంగ హత్యాదినం (సంవిధాన్ హత్యా దివస్) అని అంటున్నాడు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. బీజేపీ పాలనలో జరిగిన అరాచకాలను గుర్తుచేసుకుంటూ ‘రాజ్యాంగ విధ్వంసక దశాబ్ది (2014-2024)గా ఈ దేశ ప్రజలు గుర్తించారు. ఇక రోడ్డు మీదికి వచ్చి నిరసనలు తెలియజెయడమే తరువాయి. అది త్వరలో జరుగుతుందని ఆశిద్దాం! గోది మీడియాలో హెడ్ లైన్స్ కోసం మోడీ-షాలు తాపత్రయపడడం ఈ ప్రకటనలో కనిపిస్తుంది తప్ప, ‘సంవిధాన్ హత్యాదివస్’లో పసలేదు. పైగా ‘హత్య’ అనేది మోడీ, షాలకే కాదు, బీజేపీ-ఆరెస్సెస్ వారికి చాలా ఇష్టమైన పదం. ఒక్కసారి గతంలోకి చూడండి తెలుస్తుంది. జాతిపిత గాంధీని హత్యచేసిన వారెవరూ? వారి నాయకుడే అయిన దీన్ దయాళ్ ముఖోపాధ్యాయను మట్టుబెట్టింది ఎవరో తెలుసుకోండి. జస్టిస్ లోయ హత్య గురించి తెలుసుకోండి. కొన్ని కొన్ని హత్యల వివరాలు బయటపడవు కానీ, హత్య అనేది ఆరెస్సెస్-బీజేపీలకు చాలా ప్రీతిపాత్రమైన పదం. అలాంటిది నిర్వహించడం కూడా బహుశా వారికి వారి శాఖల్లో తర్ఫీదు ఇస్తారేమో! సంవిధాన్ హత్యా దివస్ – ప్రకటించగానే, ఉద్ధవ్ ఠాక్రే గ్రూపు శివసేన నాయకుడు సంజరు రౌత్ ఇలా అన్నారు- ”ఎమర్జెన్సీ అంటే ఏమిటో ఈ దేశ గృహమంత్రికి తెలియదనుకుంటా. దేశంలో ఎవర్జెన్సీ విధించ బడ్డప్పుడు ఆయన వయసు ఎంతోనాకు తెలియదు. బాలా సాహెబ్ ఠాక్రే పార్టీ శివసేనను చీల్చి ఒక నకిలీ శివసేన ముఠాతో చేతులు కలిపి సయ్యాటలాడే వారికి బాలాసాహెబ్ ఠాక్రే దార్శనికత ఏం అర్థమవుతుందీ? అంతటి ఆ బాలాసాహెబ్ ఠాక్రేనే ఆనాడు ఎమర్జెన్సీకి ఇందిరాగాంధీకి పూర్తి మద్దతు ప్రకటించాడు. ఆ మాత్రం పరిజ్ఞానం లేనివారు ఈ రోజు ఏం మాట్లాడుతున్నారో ఆలోచించుకోవాలి!” అని.
పార్లమెంట్‌లో విపక్షం – ఇండియా కూటమి రాజ్యాంగాన్ని పరిరక్షిస్తామని బలంగా నొక్కిచెప్పింది.బీజేపీ విధానాలను ఎండగట్టింది. ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ ఎల్లవేళలా రాజ్యాంగం – ప్రతిని పట్టుకుని తిరుగుతున్నాడు. తనను కలవడానికి వచ్చిన ప్రతిఒక్కరికీ రాజ్యాంగం ప్రతిని బహుకరిస్తున్నాడు. దేశ ప్రజలకు రాజ్యాంగం పట్ల అవగాహన పెంచుతున్నాడు. దానితో ప్రజల్లో ఒక చైతన్యం పెల్లుబుకుతోంది. నైతికంగా దిగజారిన మోడీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చామని విర్రవీగనక్కరలేదు. వాస్తవంగా వారికి వచ్చినవి 130 సీట్లే. మోసపూరితంగా ఈవీఎంల టాంపరింగ్‌తో మరో వంద పెరిగాయి. ఇది బహిరంగ రహస్యం. అయినా కూడా పార్లమెంట్‌లో (జూన్ 2024) తగినంత బలం లేదు. వెన్నుపోటుదారుల్ని మోసకారుల్ని ఊతకర్రల్లాగా చంకలో వేసుకుని, మోడీ ప్రభుత్వం కుంటుతూ నడుస్తోంది. ఇది ఎప్పుడైనా కూలిపోవచ్చని విజ్ఞులైన విశ్లేషకులు చెపుతున్నారు. కార్పోరేట్లు, దొంగ బాబాలు కూడా మోడీ ప్రభుత్వానికి ఊతకర్రలే.
దేశంలో ప్రధాన మీడియా ఎంతగా దిగజారిపోయిందో చెప్పడానికి ఒక సంఘటనను పరిశీలిద్దాం. అంబానీ కొడుకు అనంత్ అంబానీ పెళ్ళి, రాధిక మార్చంట్‌తో 12 జులై 2024న జరిగింది. అందుకోసం దాదాపు రూ.1300కోట్లు ఖర్చు చేశారని వార్తలొచ్చాయి. దేశంలో కాంగ్రెస్ పార్టీ బలపడిందని, రాహుల్‌గాంధీ బలమైన ప్రతిపక్షనేతగా ఎదిగాడని గ్రహించిన అంబానీ, పెండ్లిపత్రిక పట్టుకుని ఢిల్లీలోని 10, జనపథ్‌కు వెళ్లాడు. సోనియాగాంధీని కలిశాడు. గంటసేపు కూర్చుని పిచ్చాపాటి మాట్లాడాడు కానీ, అక్కడ రాహుల్ గాంధీ జాడ కనబడలేదు. అంబానీని కలవడం ఇష్టం లేని రాహుల్ గాంధీ ఇంట్లో లేకుండా అక్కడికి 50 కి.మీ. దూరంలో తాపీ మేస్త్రీలతో నిర్మాణ పనులకు సంబంధించిన విషయాలు తెలుసుకుంటూ, వారితో కలిసి పనులు చేస్తూ గడిపాడు. దీనిలో స్పష్టంగా ఆయన ఈ దేశ ప్రజలకు చెప్పదలుచుకున్న విషయమేమంటే – రాజకీయ నాయకులు జనంలో ఉండాలి, జనం కోసం ఉండాలి! మోడీ,షాల వలె కార్పోరేట్లకు ఊడిగం చేస్తూ వారి ఇండ్ల ముందు పాలేర్లుగా బతకొద్దు అని! దీనిలో మరో విషయం కూడా ఉంది. అంబానీ ఇంట్లో జరిగిన పెండ్లిని ప్రధాన మీడియా ఒక జాతీయ కార్యక్రమంలా చూపించింది. అంబానీని పట్టించుకోకుండా ప్రజలతో కలిసి, తన పని తాను చేసుకుపోయిన రాహుల్ గాంధీని ఏ టి.వి. ఛానలూ చూపించలేదు దేనికి ప్రాధాన్యత ఇవ్వాలో, దేనికి ఇవ్వగూడదో ఇక ఇప్పుడైనా ప్రధాన మీడియా నేర్చుకోవాలి.లేదా పంథా మార్చు కోవాలి. రాహుల్ గాంధీ చర్య కార్పొరేట్ల అహం కారం మీద దెబ్బ కొట్టినట్లయ్యింది. బీజేపీ ఏర్పరిచిన ఒక తప్పుడు విధానాన్ని మార్చి తనకై తాను ప్రజల పక్షాన నిలబడ్డట్టయ్యింది.
‘నఫ్‌రత్‌కి రాస్తోంపే మొహబ్బత్ కి దుకాన్ ఖోల్ తే జాయేంగే’ (మీ విద్వేషపు రహదారుల్లో మేం ప్రేమ దుకాణాలు తెరుచుకుంటూ వెళతాం) – అని చెప్పినట్లే రాహుల్‌గాంధీ రెండుసార్లు దేశవ్యాప్తంగా పాదయాత్రలు చేశాడు. జనాల నాడి తెలుసుకున్నాడు. వారి అవసరాలేమి టో అర్థం చేసుకున్నాడు. ఇది గొప్ప పరిణామం కదా? ఇతర నాయకులం దరికీ భిన్నంగా ప్రవర్తిస్తూ తన ప్రత్యేకతను తను నిలుపుకున్నాడు కదా? ప్రజాస్పందన ఎన్నికల ఫలితాలు అన్నీ అనుకూలంగా వస్తున్నాయి. దేశంలో జరిగిన ఉప ఎన్నికల్లో ఇండియా కూటమి ఘన విజయం సాధించడం మనం చూశాం. విద్వేషాలు రెచ్చగొట్టిన బీజేపీకి ప్రజలు అంచెలంచలుగా బుద్ధి చెపుతూ వస్తున్నారు. రాహుల్‌గాంధీ మణిపూర్‌లో రెండుసార్లు పర్యటించి, తను వారికి అండగా ఉన్నానని భరోసా ఇచ్చాడు. గుజరాత్ లోనూ విస్తృతంగా పర్యటించాడు. మోడీషాలను వారి గుజరాత్‌లోనే ఓడించి బుద్ధి చెపుతామని పార్లమెంటులోనే ప్రకటించాడు. ఇక ప్రధాని మోడీ ఒక్కసారి కూడా మణిపూర్ సందర్శించలేదు. దేశ ప్రజల విశ్వాసం కోల్పోతూ, క్రమంగా బలహీన పడడానికి అదీ ఒక కారణం!
మరో ముఖ్యమైన విషయమేమంటే ఇటీవల (జులై2024) రష్యా వెళ్లిన ప్రధాని మోడీ దేశానికున్న పరువూ గౌెరవం తీసేసి వచ్చాడు. 2014 వరకు దేశంలో శాంతి భద్రతలు లేవని, దేశ ప్రజలు భయభ్రాంతులై గడిపేవారని అక్కడి భారతీయ సమూహాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ చెప్పారు. పదేండ్లుగా తాను చేసిన నిర్వాకంచ అక్కడివారికి తెలియదనుకున్నాడు పాపం! ప్రపంచం కుగ్రామమైంది. ఎక్కడా ఏం జరిగినా ప్రపంచమంతా తెలిసే సాంకేతిక యుగంలో మనమున్నామన్న సంగతి కూడా మరిచి, నోటి కొచ్చింది మాట్లాడితే ఎలా? చదువూ విజ్ఞతాలేని వాడి ఆలోచనలు ఇలాగే దిగజారి ఉంటాయి. ప్రధాని స్థానంలో ఉండి దేశానికున్న పరువు మంటగలిపే విధంగా మాట్లాడొచ్చా? హుందాతనం ఏదీ? దేశంలో మీడియాను మోడీ తన ఆధీనంలో ఉంచుకుంటే ఉంచుకున్నాడు గాక – విదేశీ మీడియా ఊర్కోదు. శక్తి పుంజుకున్న యూట్యూబ్ ఛానళ్లూ ఊరుకోవు. ఉక్రెయిన్ దేశ అధ్యక్షుడు జెలెన్‌స్కీ- మోడీ రష్యా పర్యటనను తీవ్రంగా నిరసించాడు.”ప్రపంచంలో పెద్ద ప్రజాస్వామ్యపు దేశాధినేత మాస్కో వెళ్లి అక్కడి రక్తపిపాసి(పుతిన్)ని కౌెగిలించుకోవడం నిరాశ కలిగించింది” అని ఇంకా తీవ్రపదజాలంతో విమర్శించాడు. అయితే ఇదే జెలెన్‌స్కీని నరేంద్రమోడీ ఆ మధ్య ఇటలీలో కలిసినపుడు ఇలాగే కౌగిలించుకున్నాడు. ఒక ఆలోచనా విధానమేమీ లేనివారి ప్రవర్తన ఇలాగే ఉంటుంది. ఉక్రెయిన్ పిల్లల ఆసుపత్రి మీద రష్యా బాంబులు పడి అనేక మంది చనిపోయిన కొన్ని గంటల వ్యవధిలోనే మోడీ రష్యా నేలమీద కాలు మోపాడు. ”యుద్ధం-శాంతికి పరిష్కారం కాదు” – అని ఒక గొప్ప విషయం పుతిన్‌కు హితబోధ చేశాడు. అతిధిగా వచ్చినవారిని అవమాన పరచడం సభ్యత కాదని పుతిన్ మౌనంగా ఉండిపోయాడేమో గానీ, అతను గనక గుజరాత్, మణిపూర్ మారణహోమాల్ని గుర్తు చేసి ఉంటే మోడీ ముఖం ఎక్కడ పెట్టుకునేవారో తెలియదు. మణిపూర్ మహిళల్ని నగంగా ఊరేగిస్తే ఉలుకూ పలుకూ లేనివాడికి శాంతి వచనాలు పలికే అర్హత ఉందా? విదేశాల్లో పర్యటిస్తున్నప్పుడు ‘యుద్ధ దేశం నుండి కాదు, బుద్ధుడి దేశం నుండి వచ్చానని చెప్పుకునే మోడీకి అసలు బుద్ధుడి పేరెత్తే అర్హత ఉందా? మత విద్వేషాలు రేపి, దేశంలో మారణహోమాలు సృష్టించే ఒక అహంకారికి బుద్ధుడి పేరెత్తే అర్హత ఎలా ఉంటుందీ?
మోడీ రష్యాలో పుతిన్ ఎదురుగా కూర్చుని శాంతి వచనాలు వల్లిస్తున్నప్పుడే, రష్యా ఉక్రెయిన్‌పై మిస్సైల్స్ ప్రయోగించింది – అంటే పుతిన్ మోడీని గౌరవించినట్టా? అవమానించినట్టా? ఇక్కడ ఇంకొక విషయం కూడా ఉంది. భారతీయ సనాతన ధర్మాన్ని అభిమానించి, ఆరాధించే భారత ప్రధానికి రష్యా సనాతన మతబోధకుడైన సెయింట్ ఆండ్రూ పేరున ఉన్న పురస్కారం లభించింది. అది చూసుకుని మోడీ తనకు తాను సంతోషించాల్సిందే! భారతీయులెవరూ గర్వించలేదు. ప్రధాని మోడీ తనస్థాయి ఏమిటో ఆలోచించుకోకుండా లోక్‌సభ ఎలక్షన్ సభల్లో (2024) ప్రసంగిస్తూ. ”అదానీ, అంబానీలు రాహుల్‌గాంధీకి, కాగ్రెస్ పార్టీకి బస్తాల్లో డబ్బు కుక్కి కుక్కి ట్రక్కులు నింపి పంపారని” – అన్నాడు. అంటే ఏమిటీ? అదానీ, అంబానీలు దోషులని, దేశ ద్రోహులని ఆరోపించనట్టే కదా? మరి అలాంటి ముఖేష్ అంబానీ ఇంట్లో పెండ్లికి మోడీ తగుదునమ్మా అని వెళతాడా?- అని ఈ దేశ ప్రజలు అడగడం కాదు, మండిపడుతున్నారు. సమాధానం చెప్పుకోవాలి కదా? ఎందుకు చెప్పుకోలేదూ? మోడీ ప్రభుత్వం, ఈ దేశ ప్రజల సొమ్మును కార్పోరేట్లకు ముఖ్యంగా అదానీ, అంబానీలకు దోచిపెడుతూ ఉందని ఈ దేశ ప్రజలకు తెలుసు. చదువులేనివారని అనుకున్నారే గాని, కనీసం ఇంగితజ్ఞానం కూడా లేనివారు తమకు ప్రధానిగా ఉన్నాడా? ఇలాంటి వారికా తాము అంతటి ఉన్నత స్థాయినిచ్చాం? – అని ప్రజలు తమలో తాము కుమిలిపోతున్నారు.
బుద్ధుడు, బ్రూనో, డార్విన్, మార్క్స్, పూలేలు చేసిన త్యాగాల ముందు అంబానీ పెండ్లి పేరుతో ఆర్భాటంగా, అసహ్యంగా, వికృతంగా చేసిన బిలియన్ల డబ్బు ఖర్చు ఎందుకు పనికోస్తుందీ? ఆ మహనీయుల కాలిగోటితో కూడా సమానం కాదు. అసలు పోలికే అసమంజసం-నిజమే! కానీ, అన్ని బిలియన్ల డబ్బు ఖర్చు చేయడం వల్ల దేశానికి గానీ , సమాజానికి గానీ ఏ మాత్రం ఉపయోగం జరుగలేదు. వృధా! వృధా!! అదేమైనా నిజాన్ని నిలుపడానికా? మానవీయ విలువల్ని నిలుపడానికా? పేదల సంక్షేమం కోసమా? పర్యావరణ పరిరక్షణకా? ఎందుకు అంత డబ్బు ఖర్చు చేసినట్టూ? అతని డబ్బూ- అతని సంతోషం కోసం ఖర్చు చేసుకున్నాడని- అంటారేమో, అన్యాయంగా ప్రజల్ని కొల్లగొట్టి సంపాయించిందే కదా? కార్పోరేట్ల దగ్గర ఉన్నదయినా, ప్రభుత్వాల దగ్గర ఉన్నదైనా అంతా ప్రజల సొమ్మేనన్న – విషయం ఎవరూ మరిచిపోకూడదు. లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, అతని కుటుంబ సభ్యులు తప్ప, మిగతా రాజకీయ పార్టీ నాయకులంతా అంబానీ ఆర్భాటంలో భాగస్వాము లయ్యారు. ఆయన మాత్రం అంబానీ, మోడీల అహంకారంపై దెబ్బతీస్తూ, సామాన్యుల ప్రతినిధిగా ఒంటరిగా నిలబడ్డాడన్నది, ఈ దేశ ప్రజలు గమనించారు!
– కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు విజేత,
జీవశాస్త్రవేత్త: మెల్బోర్న్ నుంచి
డాక్టర్ దేవరాజు మహారాజు