2014 కెరియర్ అడ్వాన్స్మెంట్ (సిఏఎస్) ప్రక్రియను వేగవంతం చేయాలి..

నవతెలంగాణ- డిచ్ పల్లి
న్యాయబద్ధంగా జరగాల్సిన 2014 రిక్రూట్మెంట్ అధ్యాపకుల కెరియర్ అడ్వాన్స్మెంట్ స్కీం ( సి ఏ ఎస్ )ప్రక్రియను వేగవంతం చేయాలని 2014 ద్వారా నియామకమైన అధ్యాపకులు మంగళవారం యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం యాదగిరి కి వినతిపత్రం అందజేశారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ అన్ని అర్హతలు కల్గిఉండి యూనివర్సిటీ అభివృద్ధిలో భాగం పంచుకుంటున్న అధ్యాపకులకు కొందరు ఉద్దేశపూర్వకంగానే పదోన్నతులను నిలుపుదల చేశారని పేర్కొన్నారు. దశాబ్దాలుగా ప్రఖ్యాతి గాంచిన జాతీయ, అంతర్జాతీయ యూనివర్సిటీ లలో పరిశోధన, బోధనా అనుభవాన్ని కలిగిన వారు తెలంగాణ యూనివర్సిటీ లో 2014 రిక్రూట్మెంట్ ద్వారా నియామకం పొందారని, గతంలో న్యాక్ అక్రిడేషన్ లో కీలక భూమిక పోషించి న్యాక్ బి ప్లేస్ గ్రేడు రావడంలో తీవ్రంగా కృషి చేశారని పేర్కొన్నారు.నేడు కేంద్ర ప్రభుత్వ సంస్థల నుంచి పరిశోధన ప్రాజెక్టుల ద్వారా యూనివర్సిటీ కి నిధులు తెప్పించడంలో 2014 రిక్రూట్మెంట్ ద్వారా నియామకం కాబడిన వారు అధికంగా ఉండడం యూనివర్సిటీ కి గర్వకారణమని పేర్కొన్నారు.2014 నియామకం కాబడినవారికి అర్హత కలిగిన ఇంక్రిమెంట్లతో పాటు వేతన సవరణ ద్వారా జీతభత్యాలు పొందుతున్నప్పటికీ పదోన్నతిని ఆపడం విచారకరమన్నారు. యూనివర్సిటీ లో సాంకేతికంగా జరిగే ఈ అసౌకర్యం వలన నేటికీ ముగ్గురు అర్హతలు ఉండి పదోన్నతులు పొందకుండానే పదవి విరమణ పొందారని ఆందోళన వ్యక్తం చేశారు.కోర్టు పదోన్నతులను కల్పించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినప్పటికీ నిబంధనల పేరుతో ఎప్పటికప్పుడు వాయిదా వేస్తున్నారని ఆవేదనను వ్యక్తం చేశారు.పదోన్నతి కల్పించాలని హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ తో పాటు , స్టాండింగ్ కౌన్సిల్, గవర్నమెంట్ తరఫున లీగల్ ఒపీనియన్ కాఫీలను రిజిస్ట్రార్ కు అందజేశారు. ఈ విషయాలను అన్నింటిని సమగ్రంగా ఇంచార్జీ వైస్ ఛాన్సలర్ వాకాటి కరుణ, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యులందరితో చర్చించి పదోన్నతి ప్రక్రియను వేగవంతం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో 2014 లో నియామకం పొందిన అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు పాల్గొన్నారు.