2025: పోరాటాలు, ప్రతిఘటనల రంగస్థలం

2025: A theater of struggles and resistanceముగిసిపోయిన 2024వ సంవత్సరం జాతీయంగానూ అంతర్జాతీయంగానూ అత్యంత కల్లోలితంగా సాగింది. భారతదేశంలోనైతే అయోధ్యలోని కొత్తగా నిర్మించిన అసంపూర్ణ రామాలయంలో ప్రభుత్వ ప్రాయోజిత విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంతో ఈ ఏడాది మొదలైంది. హిందూ రాజ్యశకం మొదలైందని బీజేపీ నేతలిచ్చిన సంకేతమది. దీన్ని వెంట వెంటనే ప్రతిపక్ష నాయకులపై కేంద్ర దర్యాప్తు సంస్థలు వివిధ రకాల దాడులు చేశాయి. ఇద్దరు ముఖ్యమంత్రులను అరెస్టు చేశాయి. కీలకమైన 18వ లోక్‌సభ ఎన్నికలకు రంగం సిద్ధం చేయబడింది. బీజేపీి, ఆరెస్సెస్‌లు వారి అనుంగు అనుచరులు ఒకవైపు, ఇండియా వేదిక పార్టీలు మరోవైపుగా బరి గీయబడింది. ఫలితాలు బీజేపీకి ఎదురుదెబ్బగా మారాయి. 400 సీట్లపైన తెచ్చుకుంటామన్న బీజేపీకి మెజార్టీకన్నా తక్కువగా 240 స్థానాలు మాత్రమే వచ్చాయి.మూడోసారి నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారం చేపట్టిన రాజకీయ పరిస్థితిని ఇలా క్రోడీకరించవచ్చు: మోడీ సర్కారు హిందూత్వ కార్పొరేట్‌ ఎజెండాతో ముందుకు పోవాలని గట్టి పట్టుదలతో వుంది. నయా ఉదారవాద విధానాలనే కొనసాగించడం వల్ల ప్రజలపై భారాలు గుమ్మరించ బడుతున్నాయి. ధరల పెరుగుదల, నిరుద్యోగం, గ్రామీణ పట్టణ ప్రాంతాలలో పేదల బాధావేదనలు, ప్రతిపక్షం బలోపేతమైన కారణంగా హిందూత్వ నిరంకుశ శక్తులకు మరింత విస్త్రతమైన ప్రతిఘటన పెంచేందుకు అవకాశం ఏర్పడింది.
అవే ప్రమాద పోకడలు
పార్లమెంటులో బీజేపీ బలహీన పడిందంటే అర్థం ప్రభుత్వం అధికారం చలాయించడంలో ప్రమాదకర స్వభావం తగ్గిపోతుందని కాదు. ప్రభుత్వ వ్యవస్థలను చేజిక్కించుకోవడం ద్వారా అన్ని రంగాల్లో అంటే విద్యా సామాజిక సాంస్కృతిక రంగాలలో హిందూత్వ భావజాలాన్ని జొప్పించే పని కొనసాగుతున్నది. ప్రజలలో సమాజంలో ముస్లిములపై రెచ్చగొట్టే తరహాలో ముస్లిం వ్యతిరేక ప్రచారంతో చిచ్చుపెట్టి శాశ్వత మత విభజన తీసుకురావాలనే ప్రయత్నం నిరంతరాయంగా సాగిపోతున్నది. సంబాల్‌, అజ్మీర్‌ మసీదుల కింద సర్వే చేసి గుళ్లను కనిపెట్టాలనే డిమాండు ఈ వ్యూహంలో భాగమే. ఇదొక ప్రమాదం. వామపక్ష ప్రజాస్వా మిక శక్తులు మరింత మహత్తర మైన సంకల్పంతో ఎదుర్కోవాలి. సైద్ధాంతిక పోరాటం సాగించాలి.
2024లో మత శక్తులు కార్పొరేట్ల కూటమి మరింత విస్తరించింది. మోడీ ప్రభుత్వానికి అత్యంత ఇష్టులైన బడా పెట్టుబడి దారులు ఇతోధికంగా సంపదలను పోగేసు కున్నారు. అత్యధిక లాభాలు గుంజారు. వీరిలో అయిదుగురు కార్పొరేట్లు అంబానీ, అదానీ, టాటా, బిర్లా, భారతి మిట్టల్‌ ద్రవ్యేతర కార్పొరేట్‌ రంగ ఆస్తులలో అయిదో వంతు స్వంతం చేసుకున్నారు. మోడీ ప్రభుత్వ మూడో దఫా పాలనలో ప్రయివేటీకరణ మరింత దూకుడు పెరిగింది. విద్యుత్‌ పంపిణీ రంగంలో డిస్కామ్‌లు ప్రయివేటు పరం చేయబడ్డాయి. కేంద్రపాలిత ప్రాంతమైన చండీగఢ్‌లో లాభాలతో నడిచే ఒక డిస్కమ్‌ను అమ్మి ప్రయివేటు పరం చేయడానికి వ్యతిరేకంగా భారీ పోరాటం నడుస్తున్నది. మరో లాభదాయకమైన ప్రభుత్వ రంగ సంస్థ ఫెర్రో స్క్రాప్‌ నిగమ్‌ లిమిటెడ్‌ కూడా అటూ ఇటుగా వుంది.
ప్రతిఘటనలు కూడా…
ఈ విధానాలు గానీ ప్రజలపై వాటి ప్రభావాలు గానీ ఏ సవాళ్లు లేకుండా నల్లేరు మీద బండిలా నడిచిపోవడం లేదు. శ్రామిక ప్రజల్లో భిన్న తరగతులు ఈ కాలంలో అనేక పోరాటాలు చేశారు. అంగన్‌వాడీ, ఆశా వర్కర్లు, మధ్యాహ్న భోజన పథకం వంటి స్కీమ్‌ వర్కర్ల సమ్మెలు, పోరాటాలు వీటిలో చాలా విస్తఅతమైనవి. విశాఖ ఉక్కు ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా అత్యంత సుదీర్ఘంగా చేస్తున్న పోరాటం కొన సాగుతూనే వుంది. రంగాలవారీగా చూస్తే విద్యుత్‌, బొగ్గు, తంతి తపాలా, బ్యాంకులు బీమా ఉద్యోగులు సమ్మెలు చేశారు. తమిళనాడులోని కాంచీపురంలో శాంసంగ్‌ కార్మికులు 37 రోజుల పాటు సాగించిన సమ్మె అత్యంత ప్రముఖమైంది. ఈ బహుళజాతి సంస్థ కార్మికులు యూని యన్‌ ఏర్పాటు చేసుకునే హక్కు కోసం జయప్రదంగా పోరాటం నడిపి విజయం సాధించారు.
కేంద్ర కార్మిక సంఘాలు (సిటియులు), సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్‌కెఎం) ఉమ్మడిగా పెద్ద ఎత్తున ఉమ్మడి కార్యాచరణలు నడిపాయి. మహిళలపై తీవ్రమవుతున్న నేరాలు అత్యాచారాలకు వ్యతిరేకంగా పోరాటాలు జరిగాయి. లోప భూయిష్టమైన పోటీ పరీక్షలు, ప్రశ్నా పత్రాల లీకేజీలకు వ్యతిరేకంగా కొన్ని రాష్ట్రాలలో యువత పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహించింది. ఫీజుల పెంపుదలకూ నూతన విద్యా విధానానికి వ్యతిరేకంగా విద్యార్థులు పోరాడుతున్నారు. ఈ నూతన సంవత్సరంలో మరిన్ని పోరాటాలు, ప్రతిఘటనా కేంద్రాలు మొదలవుతాయి.
అన్నిటికన్నా ఘోరం
అంతర్జాతీయంగా చూస్తే 2024 అన్నిటినీ మించి మున్ముందుగా గాజాలో పాలస్తీనియన్లపై ఇజ్రాయిల్‌ సాగించిన జాతి హత్యాకాండ మున్ముందుగా గుర్తుండిపోతుంది. 21వ శతాబ్దంలోనే అతి ఘోరమైన జాతిమేధం అది. 2023 అక్టోబరులో మొదలైన ఈ క్రూర దాడి 2024 పొడుగునా కొనసాగింది. నూతన సంవత్సరం మొదలవుతున్నా ఉపశమన సూచనలు లేవు. పౌరులనే లక్ష్యంగా చేసుకుని వైమానిక దాడులు, డ్రోన్లు, మందుగుండు ప్రయోగాలు సాగుతున్నాయి. మరీ ప్రత్యేకించి ఆస్పత్రులను స్కూళ్లను దాడికి లక్ష్యంగా చేసుకుంటున్నారు. గాజాకు ఆహార సరఫరాలను నిలిపేయడంతో ఆకలి మంటలు కూడా జాతి నరమేధానికి ఆయుధంగా మారాయి. ఈ అమెరికా అండతో ఇజ్రాయిల్‌ సాగిస్తున్న ఈ దురాక్రమణను ఆపేందుకోసం జోక్యం చేసుకోవడంలో వైఫల్యం ప్రపంచమంతటా నిస్పృహ వ్యక్తమవుతున్నది. అదే సమయంలో ఈ మారణహోమాన్ని తట్టుకుని అసాధారణమైన ధైర్యంతో ప్రతిఘటిస్తున్న పాలస్తీనా ప్రజలపై ప్రశంసలతోపాటు సంఘీభావం కూడా వ్యక్తమవుతున్నది.
మితవాదం..వామపక్ష ప్రత్యామ్నాయం..
2024లో యూరప్‌లో పచ్చి మితవాద శక్తులు ముందుకొచ్చాయి. మధ్యేవాద సోషల్‌ డెమోక్రాట్లు నయా ఉదారవాద విధానాలను ఆలింగనం చేసుకున్న మితవాదం వైపు మొగ్గే పరిణామ క్రమానికి ఇది పరాకాష్ట..నికరమైన వామపక్ష శక్తి లేని ఈ దేశాల్లో ప్రతిపక్ష స్థానాన్ని మితవాదులు ఆక్రమిస్తున్నారు. వామపక్షం ఒక సమర్థమైన ప్రత్యామ్నాయాన్ని ముందుకు తేగలిగిన చోట్ల పచ్చి మితవాద శక్తులకు అది పోటీ ఇవ్వగలుగుతున్నది. ఫ్రాన్స్‌లో వామపక్ష కూటమిగా వున్న పాపులర్‌ ఫ్రంట్‌ పార్లమెంటు ఎన్నికల్లో అతి పెద్ద శక్తిగా వచ్చి అభివృద్ధి నిరోధకులను నిలవరించగలిగింది. బెల్జియం వామపక్షం గతేడాది యూరోపియన్‌ పార్లమెంటు ఎన్నికల్లోనూ జాతీయ స్థానిక ఎన్నికల్లోనూ చెప్పుకోదగిన విజయాలు సాధించింది.
స్వతంత్ర శక్తి, సమైక్య పోరాటం
భారతదేశంలో కూడా వామపక్షం శక్తి సామర్థ్యాలు రానున్న రోజుల్లో ఆవిష్కృతం కావాలి. నూతన సంవత్సరంలో సమైక్య వామపక్ష శక్తి సమర్థతతో సకల ప్రజాస్వామిక శక్తులనూ కూడగట్టగలగాలి. హిందూత్వ కార్పొరేట్‌ పాలక వ్యవస్థను ఓడించేందుకు లౌకిక ప్రజాస్వామిక శక్తులు చేస్తున్న పోరాటాన్నిది బలోపేతం చేస్తుంది.2025 ఏప్రిల్‌లో 24వ జాతీయ మహాసభకు సీపీఐ(ఎం) సమాయత్తమవుతోంది. తన స్వతంత్ర శక్తిని పార్టీ ప్రజా పునాదిని పెంచుకోవడం కోసం అది తన సమర్థతనంతటినీ మలుచుకోవాలి. తద్వారా వామపక్ష ప్రజాస్వామిక ప్రత్యామ్నాయ ప్రయత్నాలు దృఢతరమవుతాయి.
(జనవరి1 ‘పీపుల్స్‌ డెమోక్రసీ’ సంపాదకీయం)