ఈసెట్‌లో 20,899 మంది ఉత్తీర్ణత

– ఫలితాలు విడుదల చేసిన లింబాద్రి
– జులైలో ప్రవేశాల కౌన్సెలింగ్‌
ఈసెట్‌ ఫలితాల వివరాలు
దరఖాస్తు హాజరు ఉత్తీర్ణత శాతం
అబ్బాయిలు 16,209 15,636 14,415 92.19
అమ్మాయిలు 7,052 6,818 6,484 95.10
మొత్తం 23,261 22,454 20,899 93.07
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో బీటెక్‌, బీఈ, బీ ఫార్మసీ, బీఎస్సీ మ్యాథమెటిక్స్‌ కోర్సుల్లో రెండో ఏడాదికి లాటరల్‌ ఎంట్రీ ద్వారా 2023-24 విద్యాసంవత్సరానికి సంబంధించిన ప్రవేశాల కోసం నిర్వహించిన ఈసెట్‌ ఫలితాలను హైదరాబాద్‌లో మంగళవారం ఉన్నత విద్యామండలి చైర్మెన్‌ ఆర్‌ లింబాద్రి విడుదల చేశారు. ఈసెట్‌కు 23,261 మంది దరఖాస్తు చేయగా, 22,454 మంది పరీక్ష రాశారు. వారిలో 20,899 (93.07 శాతం) మంది ఉత్తీర్ణత సాధించారు. ఇందులో అబ్బాయిలు 16,209 మంది దరఖాస్తు చేస్తే, 15,636 మంది హాజరయ్యారు. వారిలో 14,415 (92.19 శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు. 7,052 మంది అమ్మాయిలు దరఖాస్తు చేయగా, 6,818 మంది పరీక్ష రాశారు. వారిలో 6,484 (95.10 శాతం) మంది ఉత్తీర్ణత పొందారు. 11 కోర్సులకు ఈసెట్‌ రాతపరీక్ష నిర్వహించగా, అత్యధికంగా ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ ఇంజినీరింగ్‌ (ఈఈఈ) విభాగానికి 5,598 మంది దరఖాస్తు చేశారు. 5,418 మంది పరీక్ష రాస్తే 4,777 (88.17 శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు. ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజినీరింగ్‌ (ఈసీఈ) విభాగానికి 5,248 మంది దరఖాస్తు చేయగా, 5,068 మంది పరీక్ష రాశారు. వారిలో 4,907 (96.82 శాతం) మంది ఉత్తీర్ణత సాధించారు. మెకానికల్‌ ఇంజినీరింగ్‌కు 4,240 మంది దరఖాస్తు చేస్తే, 4,082 మంది పరీక్షకు హాజరయ్యారు. వారిలో 3,693 (90.47 శాతం) మంది ఉత్తీర్ణత పొందారు. సివిల్‌ ఇంజినీరింగ్‌కు 3,916 మంది దరఖాస్తు చేస్తే, 3,792 మంది పరీక్ష రాశారు. వారిలో 3,604 (95.04 శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు. కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌ (సీఎస్‌ఈ)కి 3,136 మంది దరఖాస్తు చేయగా, 3,040 మంది పరీక్షకు హాజరయ్యారు. వారిలో 2,927 (96.28 శాతం) మంది ఉత్తీర్ణత సాధించారు. అత్యల్పంగా బీఎస్సీ మ్యాథమెటిక్స్‌ విభాగానికి 44 మంది దరఖాస్తు చేస్తే, 16 మంది పరీక్ష రాశారు. వారిలో 16 (వందశాతం) మంది ఉత్తీర్ణత పొందారు. మెటలర్జికల్‌ ఇంజినీరింగ్‌కు 97 మది దరఖాస్తు చేయగా, 96 మంది పరీక్షకు హాజరయ్యారు. వారిలో 93 (96.88 శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు. తెలంగాణ నుంచి 21,120 మంది దరఖాస్తు చేస్తే, 20,517 మంది పరీక్ష రాశారు. వారిలో 19,054 (92.87 శాతం) మంది ఉత్తీర్ణత సాధించారు. ఏపీ నుంచి 2,141 మంది దరఖాస్తు చేయగా, 1,937 మంది పరీక్షకు హాజరయ్యారు. వారిలో 1,845 (95.25 శాతం) మంది ఉత్తీర్ణత పొందారు. ఈ కార్యక్రమంలో ఓయూ వీసీ దండెబోయిన రవీందర్‌, ఉన్నత విద్యామండలి వైస్‌ చైర్మెన్‌ వి వెంకటరమణ, కార్యదర్శి ఎన్‌ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
176 కాలేజీల్లో 9 వేల సీట్లు
రాష్ట్రంలో 176 ఇంజినీరింగ్‌ కాలేజీల్లో తొమ్మిది వేల సీట్లు అందుబాటులో ఉంటాయని ఉన్నత విద్యామండలి చైర్మెన్‌ లింబాద్రి, ఈసెట్‌ కన్వీనర్‌ శ్రీరాం వెంకటేశ్‌ చెప్పారు. ఆయా కాలేజీల్లో ఇంజినీరింగ్‌ ప్రథమ సంవత్సరంలో మిగిలిపోయిన సీట్లు ఏడు, ఎనిమిది వేల వరకు ఉంటాయన్నారు. ఈసెట్‌లో ఉత్తీర్ణులైన అభ్యర్థులందరికీ ఇంజినీరింగ్‌లో ప్రవేశం లభిస్తుందని వివరించా రు. ముఖ్యంగా టాప్‌ కాలేజీల్లో చేరిన విద్యార్థులే ఐఐటీ, ఎన్‌ఐటీల్లో సీట్లు వస్తే వెళ్లిపోతారని అన్నారు. వాటిలోనే సీట్లు మిగులుతాయని చెప్పారు. ఈసెట్‌ ప్రవేశాల కౌన్సెలింగ్‌ ప్రక్రియ వచ్చేనెలలో నిర్వహిస్తామన్నారు.