– ఈ ఏడాది జూన్ ఒకటి నుంచి కొత్త జీతాలు అమల్లోకి…
– రిటైర్‌మెంట్ టైంలో వడ్డీలేకుండా బకాయిల చెల్లింపు
– ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది : రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
నవతెలంగాణ-ముషీరాబాద్
టీఎస్‌ఆర్టీసీ ఉద్యోగులకు 2017 నాటి ఫిట్‌మెంట్‌ను 21 శాతంగా నిర్ణయించినట్టు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. పెరిగిన ఫిట్‌మెంట్‌తో కూడిన వేతనాలు ఈ ఏడాది జూన్ ఒకటో తేదీ నుంచి చెల్లిస్తామన్నారు. పేస్కేల్-2017 నుంచి ఇప్పటి వరకు రావల్సిన వేతన బకాయిలను ఉద్యోగుల రిటైర్‌మెంట్ సమయంలో వడ్డీ లేకుండా చెల్లిస్తామని తెలిపారు. హైదరాబాద్‌లోని ముషీరాబాద్ ఆర్టీసీ బస్‌భవన్‌లో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2017 జనవరి 1వ తేదీ నాటి 31.1 శాతం కరువు భత్యాన్ని 2017 ఏప్రిల్ 1 నుంచి పే స్థిరీకరణలో విలీనం చేస్తామన్నారు. ఈ వేతన సవరణ వల్ల ప్రభుత్వంపై ఏటా రూ.418.11 కోట్ల ఆర్థికభారం పడుతుందని చెప్పారు. పేస్కేల్-2017తో సర్వీసులో ఉన్న 42,057 మంది ఉద్యోగులు, 2017 ఏప్రిల్ 1 నుంచి పదవీ విరమణ చేసిన 11,014 మంది ఉద్యోగులు…మొత్తంగా 53,071 మందికి ఆర్థిక ప్రయోజనం కలుగుతుందని వివరించారు. ప్రతిపక్షాలు ఆర్టీసీపై విష ప్రచారం మానుకోవాలని హితవు పలికారు. ఎన్ని ఇబ్బందులు ఉన్నా మహాలక్ష్మి పథకాన్ని విజయవంతంగా అమలు చేస్తున్నామనీ, ఆర్డినరీ బస్సులకు ఎక్స్‌ప్రెస్ బస్సుల రంగులు వేసి నడుపుతున్నారనే అవాస్తవ ప్రచారాలను ప్రజలు తిప్పికొట్టాలని కోరారు. మహాలక్ష్మి పథకం వల్ల ఆటో కార్మికులకు కొంత అన్యాయం జరిగిందనీ, వారిని ఆర్థికంగా ఆదుకునేందుకు ప్రయత్నిస్తామన్నారు. శవాల మీద పేలాలు ఏరుకునే విధంగా బీఆర్‌ఎస్ నేతలు, మాజీ మంత్రులు ప్రవర్తిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వాళ్లు అధికారంలో ఉన్నప్పుడు ఆటో కార్మికులకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదన్నారు. కానీ తమను మాత్రం రూ.15 వేలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారని ఎద్దేవా చేశారు. మహాలక్ష్మి పథకం ద్వారా 3 నెలల్లో 25 కోట్ల మంది మహిళలు ప్రయాణం చేశారని తెలిపారు. అందుకు ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులకు కృతజ్ఞతలు తెలపాలన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్‌ను వాడుకున్నారనీ, బాండ్స్ విషయంలోనూ కొన్ని ఇబ్బందులు ఉన్నాయని అన్నారు. ఆర్టీసీ సంస్థను నష్టాల నుంచి ప్రాఫిట్ ఓరిఎంటేషన్ వైపుగా తీసుకెళ్తున్నామని తెలిపారు. మహాలక్ష్మి పథకం ప్రవేశపెట్టిన తర్వాత ప్రయాణికుల సంఖ్య దాదాపు 50 శాతం పెరిగిందని.. రద్దీకి అనుగుణంగా త్వరలోనే నూతన బస్సులు ఏర్పాటు చేస్తామని చెప్పారు. సమావేశంలో రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి శ్రీనివాసరాజు, టీఎస్ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తదితరులు పాల్గొన్నారు.