ఆదిలాబాద్ కు విచ్చేసిన 218 పోలీసు కానిస్టేబుళ్ళు..

– 140 సివిల్ పోలీసు సిబ్బందికి పోలీస్ స్టేషన్ల కేటాయింపు
నవతెలంగాణ – ఆదిలాబాద్ టౌన్
క్రమశిక్షణ, అంకితభావంతో విధులను నిర్వర్తించాలని జిల్లా ఎస్పీ ఆలం అన్నారు. సోమవారం పట్టణంలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో 9 నెలల పాటు కటోర పోలీసు శిక్షణను తీసుకొని ఆదిలాబాద్ జిల్లాకు నూతనంగా విచ్చేసిన 218 పోలీసు సివిల్, ఏఆర్ సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ మేరకు సిబ్బందికి పోలీసు వ్యవస్థ పై, పోలీసు విధులపై నిజ జీవితంలో చేయవలసిన పనులపై ప్రత్యేకంగా సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. పోలీసు వ్యవస్థ సమాజంలో బాధ్యతాయుతమైన పాత్రను పోషిస్తుందని తెలిపారు. పోలీస్ స్టేషన్ లో చేయవలసిన విధులపై కనీస అవగాహనను ప్రతి ఒక్కరు కలిగి ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లాకు విచ్చేసిన సివిల్ 94 మెన్ కానిస్టేబుల్ లకు 46 విమెన్ కానిస్టేబుల్ లకు జిల్లావ్యాప్తంగా ఉన్న పోలీస్ స్టేషన్లో పోస్టింగ్స్ ను కల్పించడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ లో రిసెప్షన్ సెంటర్, సాంకేతికతను వినియోగించుకుని సిబ్బంది, రైటర్స్, జనరల్ డ్యూటీ, కోర్టు డ్యూటీ లాంటి విధులు ఉంటాయని వాటిపై ప్రతి ఒకరు రానున్న రోజుల్లో పూర్తి పరిజ్ఞానాన్ని సంపాదించాలని తెలిపారు. పోలీస్ స్టేషన్ లో నేర నియంత్రణ నేర పరిశోధన అలాంటి అంశాలు ముఖ్య పాత్రను పోషిస్తాయని తెలిపారు. నేను నియంత్రణలో పెట్రోలింగ్, వెహికల్ చెకింగ్, బీట్లు, పికెట్లను ఏర్పాటు చేయడం లాంటి అంశాలు వస్తాయని, అదేవిధంగా ఫింగర్ ప్రింట్స్ కనుగొనడం, సీసీటీవీ కెమెరాల ఏర్పాటు, మొబైల్ నెట్వర్క్ పరిశోధన, అలాంటివి ఉపయోగించబడతాయని తెలిపారు.
అదేవిధంగా నేర పరిశోధనల లో మానవ మేధస్సును ఉపయోగించుకొని సమాచారాన్ని రాబట్టాలని తెలిపారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ఆధునిక పరికరాలతో కూడిన పరిజ్ఞానాన్ని, సాంకేతికతను వినియోగించడం జరుగుతుందని వాటి ద్వారా నేరస్తులను కనుగొనడంలో, నేరాలు జరగకుండా ప్రజల రక్షణలో కీలకపాత్రను పోషిస్తాయని తెలిపారు. ముఖ్యంగా సమాచారాన్ని రాబట్టడంలో సమాజంలో కలిసిపోతూ నిఘా వ్యవస్థను పటిష్టం చేసుకుని ఎలాంటి సమాచారాన్ని ముందస్తుగా సేకరించే విధంగా విధులను నిర్వర్తించాలని సూచించారు. 24 గంటలు అప్రమత్తంగా ఉంటూ విధులను నిర్వర్తించాలని సూచించారు. అదేవిధంగా పోలీసు లో ఉండే వివిధ రంగాలు స్పెషల్ బ్రాంచ్ డిసిఆర్బి సైబర్ క్రైమ్ ఏఆర్ లో ఉండే బాంబు డిస్పోజల్ టీం డార్క్ స్క్వాడ్ మోటార్ వెహికల్ తదితర వాటిపై అత్యవసర సమయాలలో స్పందించే విధంగా ఉండే మాబ్ ఆపరేషన్ లాంటి వాటిపై ప్రత్యేక శిక్షణను అవగాహనాలను కల్పించారు. ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లాకు వచ్చిన పోలీసు సిబ్బంది యువకులని సాంకేతిక పరిజ్ఞానాన్ని సులువుగా వినియోగించే సత్తా కలవాలని, ఉన్నత విద్యను అభ్యసించి వచ్చిన వారు కావున ప్రజలలో తమకున్న  ప్రత్యేక నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ, పోలీసు వ్యవస్థ గౌరవాన్ని, కీర్తి పెంపొందించే విధంగా విధులను నిర్వర్తించాలని సూచించారు. ఎలాంటి దురలలాట్లకు లోను కాకుండా ఉండాలని, ఎలాంటి అత్యవసర సమయంలోనైనా సమస్యలకైనా జిల్లా పోలీసు ఉన్నతాధికారులకు యంత్రాంగాన్ని సంప్రదించి అపోహలకు లోను కాకుండా ఉండాలని సూచించారు. విధులను నైపుణ్యం నిబద్ధత పనితనాన్ని చూపించిన వారు ఉన్నత స్థానాలకు ఎదగగలరని తెలిపారు. ఈ కార్యక్రమంలో నూతనంగా జిల్లాకు విచ్చేసిన 88 ఏఆర్ కానిస్టేబుల్, అదనపు ఎస్పీ బి సురేందర్ రావు, డీఎస్పీలు పోతారం శ్రీనివాస్, బి సురేందర్ రెడ్డి, హసీబుల్లా, ప్రకాష్, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు, రిజర్వ్ సిబ్బంది, అసోసియేషన్ అధ్యక్షుడు పెంచల వెంకటేశ్వర్లు, పోలీస్ కార్యాలయం సిబ్బంది పాల్గొన్నారు.