– రూ.500 లక్షల కోట్లకు రియల్ ఎస్టేట్
– నారెడ్కో- నైట్‌ఫ్రాంక్ రిపోర్ట్
హైదరాబాద్ : భారత రియాల్టీ రంగం 2047 నాటికి 5.83 ట్రిలియన్ డాలర్ల విలువకు చేరొచ్చని నైట్ ఫ్రాంక్, నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ (నారెడ్కో) సంయుక్తంగా అంచనా వేశాయి. ఇది రూపాయి కరెన్సీలో రూ.480 లక్షల కోట్లకు సమానం. ప్రస్తుతం జిడిపిలో ఈ రంగం 7.3 శాతం వాటాను కలిగి ఉండగా.. 15.50 శాతానికి చేరొచ్చని అంచనా వేసింది. శనివారం హైదరాబాద్‌లో నైట్‌ఫ్రాంక్- నారెడ్కో రూపొందించిన విజన్ 2027 రిపోర్ట్‌ను భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, నార్కెడ్కో ప్రెసిడెంట్ రాజన్ బందెల్కర్, నైట్‌ఫ్రాంక్ ఇండియా సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గులామ్ జియా, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ నివేదిక ప్రకారం.. రియల్ ఎస్టేట్ రంగంలో నివాస సెగ్మెంట్‌కు అధిక వాటా ఉంటుంది. 2047 నాటికి భారత ఆర్థిక వ్యవస్థ పరిమాణం 33-40 ట్రిలియన్ డాలర్ల మధ్య ఉండొచ్చని అంచనా. రాబోయే 25 సంవత్సరాలలో దేశంలో 23 కోట్ల ఇళ్ల అవసరముండొచ్చు. 2047 నాటికి భారత రియల్ ఎస్టేట్ మార్కెట్ విలువ 12 రెట్లు పెరగొచ్చు. ఆఫీస్ రియల్ ఎస్టేట్ మార్కెట్ విలువ 473 బిలియన్ డాలర్లకు పెరగనుంది. గతేడాది ఇది 40 బిలియన్ డాలర్లుగానే ఉంది.