– ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాల్లో
దూసుకెళ్లిన హస్తం వికటించిన బీజేపీ వ్యూహం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ రిజర్వుడు నియోజకవర్గాల్లో హస్తం పార్టీ దూసుకెళ్లింది. బీఆర్‌ఎస్ 8 స్థానాలకు పరిమితమైంది. ఏడాదిన్నర నుంచి ఆ స్థానాలపై కేంద్రీకరించి పనిచేసిన బీజేపీ ఎన్నికల్లో బొక్కబోర్లా పడింది. మోడీ జపించిన ఎస్సీ వర్గీకరణ తంత్రం పనిచేయలేదు. ఆ సామాజిక తరగతులకు భరోసా కల్పించలేకపోయింది. హైదరాబాద్‌లో మందకృష్ణ మాదిగ సభ పెట్టి ప్రధానితో మాట్లాడించినా రిక్తహస్తమే మిగిలింది. అన్ని పార్టీల మాదిరిగానే వర్గీకరణపై కమిటీ వేస్తామని చేసిన ప్రకటన పుట్టిముంచింది. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాలు మొత్తం 31 ఉండగా అందులో 23 స్థానాలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుని ముందువరుసలో నిలిచింది. బీఆర్‌ఎస్ 8 స్థానాలకు పరిమితమైంది. 19 ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గాల్లో 14 స్థానాలు, ఎస్టీ స్థానాల్లో 12కుగానూ తొమ్మిది హస్తగతమయ్యాయి.