విద్యుత్ ఆధునిక మానవుడి జీవితంలో భాగమైంది. స్వాతంత్య్రం సిద్ధించిన నాటి నుండీ దేశ ప్రజలకు అవసరమైన విద్యుత్తును ఉత్పత్తి చేయడానికి ఏ ఒక్క ప్రైవేటు కంపెనీ కూడా ముందుకు రాలేదని మనందరికీ తెలుసు. ప్రభుత్వరంగ సంస్థలే విద్యుత్తును ఉత్పత్తి చేస్తూ ప్రజలకు, ముఖ్యంగా వ్యవసాయంలాంటి కీలక రంగాలకు, సేవా రంగాలకే కాకుండా ప్రైవేటు పరిశ్రమలకు కూడా సరఫరా చేస్తున్నాయి.
కానీ ప్రపంచబ్యాంకు సంస్కరణలలో భాగంగా విద్యుత్ రంగాన్ని ప్రైవేటుపరం చేయడానికి తొలుత ఏపీఎస్‌ఈబీని మూడు ముక్కలుగా చేసారు. నాలుగేండ్ల పాటు ప్రతి సంవత్సరం 15శాతం విద్యుత్ ఛార్జీలు పెంచడానికి ఒప్పందాలు జరిగాయి. అందులో భాగంగా మొదటి దఫా ఛార్జీల వడ్డన 2000 సంవత్సరంలో జరిగింది. మిలీనియం ప్రారంభ సంవత్సరంలో వీటికి వ్యతిరేకంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తొమ్మిది వామపక్ష పార్టీలు, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో పోరాటం ప్రారంభమైంది. వినూత్నమైన పోరాటానికి రూపకల్పన జరిగింది. బిజిలీ బంద్ రాష్ట్ర ప్రజలందరూ సంపూర్ణంగా గంటపాటు రాత్రిపూట నిర్వహించారు. ప్రజా బ్యాలట్‌లో లక్షలాదిమంది పాల్గొన్నారు. 99శాతం మంది విద్యుత్ ఛార్జీల పెంపును వ్యతిరేకించారు. మంత్రుల ఘెరావ్‌లు జరిగాయి. వీటికి పరాకాష్టగా 2004 ఆగస్టు 28న చలో అసెంబ్లీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమాన్ని మరో జలియన్‌వాలాబాగ్ చేయాలని ప్రభుత్వం చూసింది. బషీర్‌బాగ్ వద్ద ప్రదర్శనను అడ్డుకుని బుల్లెట్ల వర్షం కురిపించింది. పదుల సంఖ్యలో తూటాలు దూసు కెళ్ళాయి. వందల సంఖ్యలో తీవ్రంగా గాయాల పాలయ్యారు. రామకృష్ణ, విష్ణువర్ధన్, బాలస్వామి అమరులయ్యారు. వారి త్యాగం వృధా కాలేదు. విద్యుత్తు ప్రైవేటీకరణ ఆగిపోయిందంటే అది వారి త్యాగ ఫలితమే. నేటికీ వ్యవసాయానికి ఉచిత విద్యుత్ అందుతున్న దంటే అది ఆ ఉద్యమ ఫలమే. యూనిట్ ధర రు.15కి మించి పెరగలేదు. బలహీన వర్గాలకు, పేదల కాలనీలకు విద్యుత్ సరఫరా, మంచినీటి సరఫరాలకు, స్థానిక సంస్థలకు ఇస్తున్న రారుతీలకు కారణం ఆనాటి నుండి నేటివరకు విద్యుత్ బోర్డు మూడుముక్కలైనా ప్రభుత్వరంగంలో ఉండటమే కారణం. లేదంటే ఈ వెసులు బాట్లు ఉండేవా? వ్యవసాయ రంగం, రైతాంగం వెనుకబడిన ప్రాంతాలలో పూర్తిగా దివాళా తీసేది. తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టులన్నీ లిఫ్టు పథకాలే. వీటికి 13,250 మెగావాట్ల విద్యుత్తు కావాలి. ఈ పరిస్థితిలో తెలంగాణ వ్యవసాయరంగ భవిష్యత్తు ఊహించగలమా? విద్యుత్ ధరలు పెరిగితే దేశంలో అన్ని వస్తువు ధరలు పెరుగుతూనే ఉంటాయి.
ప్రజల పెట్టుబడి, కార్మికుల శ్రమతో నిర్మించుకున్న ప్రభుత్వరంగ విద్యుత్ సంస్థలను కారుచౌకగా కొనుగోలు చేయడానికి, ప్రభుత్వాలను దళారులుగా వాడుకో వడానికి పెట్టుబడిదారులు తెగబడుతున్నారు. ఈ కీలకమైన రంగాన్ని అదానీ, అంబానీలకు అప్పగించ డానికి కేంద్ర బీజేపీ ప్రభుత్వం తెగబడింది.ఆనాడు విద్యుత్తు రాష్ట్రాల జాబితాలో ఉండేది కాబట్టి ఎక్కడికక్కడ ప్రజలు ప్రతిఘటించి పోరాడారు. ఆనాటి విద్యుత్తు ఉద్యమం దేశానికే ఆదర్శంగా నిలిచింది. కానీ నరేంద్రమోడీ ప్రభుత్వం విద్యుత్తును కేంద్ర జాబితాలోకి తీసుకుంటూ చట్టాలు చేసింది.
చమురు క్షేత్రాలను (సముద్రాన్ని), బొగ్గు క్షేత్రాలను, గ్యాస్ వనరులను బడా కార్పొరేట్లకు దోచిపెట్టడానికి చట్టాలలో అనేక మార్పులు చేసింది. సింగరేణి లాంటి ప్రభుత్వరంగ సంస్థలకు క్రమక్రమంగా బొగ్గు క్షేత్రాలు లేకుండా చేసే ప్రక్రియ ప్రారంభమైంది. వ్యవసాయరంగంలో విద్యుత్ వినియోగానికి, మోటర్లకు మీటర్లు బిగించాలని రాష్ట్రాలకు సర్య్కులర్ జారీ చేసింది. కేంద్ర సూచించిన విద్యుత్ సంస్కరణలు అమలు చేసే రాష్ట్రాలకే రుణాలు పొందే విధానం రూపొందించింది. ఏపీ ప్రభుత్వం మీటర్లు పెట్టడానికి హామీ ఇచ్చిన మేరకే ఆ రాష్ట్రానికి అదనంగా రుణాలు పొందడానికి, ఇతర ఆర్థికపరమైన వెసులుబాటు కల్పించింది. బీజేపీయేతర ప్రభుత్వాలు తమ ఆదేశాలను పాటించకపోతే వారికి ప్రోత్సహకాలు ఉండవనే సంకేతాలు పంపింది కేంద్రం. విద్యుత్ సంస్కరణల పేరుతో రాష్ట్రాలపై బెదిరింపులు, ఆంక్షలు పెంచింది.
విద్యుత్ రంగాన్ని సంపూర్ణంగా ప్రైవేటీకరిం చడానికి నిర్ణయించిన నాటి టీడీపీి ప్రభుత్వం నేడు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ-ఎన్‌డీఏ కూటమిలో భాగస్వామిగా ఉన్నది. ఎన్‌డీిఏ ప్రభుత్వం ప్రైవేటీకరణ కోసం ప్రత్యేకంగా ఒక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసి ‘పెట్టుబడుల ఉపసంహరణ శాఖ’ అని పేరు కూడా పెట్టింది. 1991లో ప్రారంభమైన ఆర్థిక సంస్కరణలను వేగవంతం చేసే చర్య ఇది.
పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలు పెరిగినట్లుగా విద్యుత్ ఛార్జీలు కూడా నిరంతరం పెరుగుతూనే ఉండే ప్రమాదాన్ని కేంద్రంలోని బీజేపీ -ఆర్‌ఎస్‌ఎస్ ప్రభుత్వం ముందుకు తెచ్చింది. 2020 విద్యుత్ సవరణ చట్టం ప్రకారం విద్యుత్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు అన్నీ ప్రైవేటువారికి కారుచౌకగా అప్పగించడానికి, ప్రైవేట్ విద్యుత్ ఉత్పత్తిదారులైన రిలయన్స్, అదానీ వంటి కంపెనీలకు లాభాలు వచ్చేవిధంగా విద్యుత్ ఛార్జీలను నిర్ణయించేలా విధానం రూపొందించింది. 20శాతానికి మించి సబ్సిడీ ఇవ్వరాదని నిర్ణయించింది. వ్యవసా యానికి వినియోగించే మోటార్లు అన్నిటికీ స్మార్ట్ మీటర్లు బిగించాలనీ, రీడింగ్ ప్రకారం ఏ నెలకానెల ముందుగానే బిల్లులు చెల్లించే పద్ధతి పెట్టాలనీ, ఉచిత విద్యుత్ స్థానంలో నగదు బదిలీ పథకం పెట్టుకోవాలనీ బీజేపీ-ఆర్‌ఎస్‌ఎస్ కేంద్రప్రభుత్వం సూచించింది. 11 రాష్ట్ర ప్రభుత్వాలు, దేశంలోని 500 రైతుసంఘాలు వ్యతిరేకించాయి. దేశం ఆహార సంక్షోభ కోరల్లో చిక్కుకుంటాయని హెచ్చరించాయి.
అత్యంత కీలకమైన విద్యుత్‌రంగం దేశమంతటా ప్రైవేటు వ్యక్తుల స్వంత ఆస్థిగా మారిపోతే మొత్తం దేశ ప్రజల భవిష్యత్తే అంధకారంగా మారిపోతుంది. చిన్నతరహా, మధ్యతరహా పరిశ్రమలు, వ్యవసాయ రంగం, సామాజిక న్యాయం, త్రాగునీటి పథకాలు అన్నీ సంక్షోభంలోకి నెట్టబడతాయి. అయితే అదానీ, అంబానీలు మాత్రం ప్రపంచస్థాయి కుబేరులుగా మరింతగా వెలిగిపోతారు. ఇద్దరు భారతీయులు ప్రపంచంలో మొదటి, రెండవ స్థానంలోకి ఎదిగారని దేశం గర్వపడవచ్చని ఆర్‌ఎస్‌ఎస్- బీజేపీలు దేశానికి చెప్పడానికి, ఇదే పెద్ద దేశభక్తి అని ఇప్పటికే సిలబస్ రూపొందించి ప్రచారంలో పెట్టింది. దేశంలోని 140కోట్ల మంది జనాభాలో సుమారు 120కోట్ల మంది ప్రజలు ఏమైపోయినా పర్వాలేదు. వారికి మతం, కులం, భాష, ప్రాంతం భావోద్వేగాలు ఎక్కించి వారిని మత్తులో ఉంచి విద్యుత్ సంస్కరణలు అమలు చేయించుకునే ప్రయత్నంలో బడా కార్పొరేట్లు, బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ బిజీగా ఉన్నాయి.
2024 ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈసారి బీజేపీ కేంద్రంలో గనుక తిరిగి అధికారంలోకి వస్తే ప్రజల ఆస్థులు, సంపదలు ఏమీ మిగలకుండా కేవలం కొద్ది కుటుంబాల వ్యక్తిగత ఆస్తిగా మారిపోతాయి. ఆనాడు కమ్యూనిస్టుల నాయకత్వంలో పెద్ద ఉద్యమాలు చేయబట్టే, ఆస్తులు కాపాడబడ్డాయి. ధరలు పెరగకుండా ప్రైవేటుకు సంస్థలను అమ్మకుండా ఆపగలిగాము.ఆందుకే ఆనాటి విద్యుత్ పోరాట స్ఫూర్తితో తిరిగి ఉద్యమాన్ని నిర్మించాల్సిన అవసరం నేడున్నది.
(ఆగష్టు 28 బషీర్‌బాగ్ డే)
బండారు రవికుమార్
9121080160