ఎంబీఏ కన్వీనర్‌ కోటాలో 23,989 సీట్లు

– ఎంసీఏలో 4,583 సీట్లు
– నేటినుంచి ధ్రువపత్రాల పరిశీలన
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో 2024-25 విద్యాసంవత్సరంలో ప్రవేశాల కోసం నిర్వహించిన ఐసెట్‌ కౌన్సెలింగ్‌లో భాగంగా మంగళవారం నుంచి ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ మేరకు సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌, ఐసెట్‌ ప్రవేశాల కన్వీనర్‌ శ్రీదేవసేన సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఎంబీఏలో 33,629 సీట్లున్నాయని తెలిపారు. అందులో కన్వీనర్‌ కోటాలో 23,989 సీట్లున్నాయని పేర్కొన్నారు. ఎంసీఏలో 6,162 సీట్లుంటే, కన్వీనర్‌ కోటాలో 4,583 సీట్లు అందుబాటులో ఉన్నాయని వివరించారు. సోమవారం నాటికి 10,634 మంది అభ్యర్థులు ప్రాసిసెంగ్‌ ఫీజు చెల్లించారని తెలిపారు. ప్రాసెసింగ్‌ ఫీజు చెల్లింపునకు తుది గడువు ఈనెల ఎనిమిదో తేదీ వరకు ఉందని పేర్కొన్నారు. మంగళవారం నుంచి ఈనెల తొమ్మిదో తేదీ వరకు ధ్రువపత్రాల పరిశీలన జరుగుతుందని వివరించారు. నాలుగు నుంచి 11 వరకు వెబ్‌ఆప్షన్లను నమోదు చేసేందుకు అవకాశముందని పేర్కొన్నారు. ఇతర వివరాల కోసం ష్ట్ర్‌్‌జూర://్‌స్త్రఱషవ్‌.అఱష.ఱఅ వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించారు.