– 5191 మంది విద్యార్థులు
నవతెలంగాణ – ఆదిలాబాద్ టౌన్
2025-26 విద్యా సంవత్సరానికి గాను జవహర్ నవోదయ విద్యాలయంలో ఆరో తరగతిలో ప్రవేశానికి శనివారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. ఇందుకు గాను ఇప్పటికే విద్యాలయ సమితి అన్ని జిల్లాల్లో ఏర్పాట్లు చేపట్టింది. ఉమ్మడి జిల్లాకు చెందిన జవహర్ నవోదయ విద్యాలయం కాగజ్ నగర్ లో ఉంది. రాబోయే విద్యాసంవత్సరంలో ఆరో తరగతి ప్రవేశానికి గాను గత ఆగస్టు నెలలోనే విద్యార్థులు దరఖాస్తులు చేసుకున్నారు. ఉమ్మడి జిల్లా నుంచి 5 వేల 191 మంది పరీక్ష రాయనుండగా వారికి కోసం 24 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 11 గంటల 30 నిమిషాల నుంచి 1గంటల 30 నిమిషాల వరకు పరీక్ష కొనసాగుతుంది. ఇప్పటికే హాల్ టికెట్లను ఆన్లైన్ లో పొందుపరిచారు. ఇదిలా ఉంటే కొత్త జిల్లాల్లో ప్రవేశ పరీక్షకకు సంబంధించి సన్నాహక సమావేశాలు పూర్తి చేశారు.
సమయానికి కేంద్రాలకు చేరుకోవాలి
ఈ సందర్భంగా డీఈఓ ప్రణీత మాట్లాడుతూ… జిల్లాలో నవోదయ పరీక్షకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. జిల్లా వ్యాప్తంగా 1170 మంది విద్యార్థులకు గాను 5 కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో గర్ల్స్ హైస్కూల్, లిటిల్ ఫ్లవర్, చావర అకాడమితో పాటు ఇచ్చోడ, ఉట్నూర్ లో కేంద్రాలను ఏర్పాటు చేసి సౌకర్యాలు కల్పించడం జరిగిందన్నారు. పరీక్షల సూపరింటెండెట్లు, పరిశీలకులను కూడా నియమించమన్నారు. విద్యార్థులు పరీక్ష సమయానికి కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. ఆలస్యం అయితే కేంద్రాల్లోకి అనుమతి ఉండదని పేర్కొన్నారు.