24 గంటల ఉచిత విద్యుత్ ఉత్త మాటే

– రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదే
– రేవంత్ మాటలని వక్రీకరిస్తున్న బిఆర్ఎస్ సీఎం కేసీఆర్ దిష్టి బొమ్మ దగ్ధం
– డీసీసీ ప్రధాన కార్యదర్శి మీసం నాగరాజ్ యాదవ్
నవతెలంగాణ – చిన్నకోడూరు 
తెలంగాణ రాష్ట్రంలో 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా ఉత్త మాటే అని సిద్దిపేట జిల్లా డీసీసీ ప్రధాన కార్యదర్శి మీసం నాగరాజ్ యాదవ్ అన్నారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ విషయంలో టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను బిఆర్ఎస్ నాయకుల వక్రీకరిస్తూన్నరని, ఇలాంటి దుష్ప్రచారన్ని తీవ్రంగా ఖండిస్తూ సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం లోని మైలారం సబ్ స్టేషన్ ముందు సిఎం కెసిఆర్ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. అమెరికాలో ఎన్నారైలు అడిగిన పలు ప్రశ్నలకు టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి సమాధానం ఇస్తూ తెలంగాణలో 80-90శాతం రైతులు సన్న,చిన్నకారు రైతులే ఉన్నారని, 24 గంటల ఉచిత విద్యుత్ పేరుతో రైతులను కెసిఆర్ సర్కార్ మోసం చేస్తుందని, ఎప్పుడొస్తుందో ఎప్పుడు పోతుందో తెలియని దుస్థితి ఏర్పడిందని అన్నారు. రాష్ట్రంలో విద్యుత్ సరఫరాపై ప్రతీ విద్యుత్ సబ్ స్టేషన్ లాగ్ బుక్ రికార్డు చూస్తే తెలుస్తుందని అన్నారు. ఏనాడు రైతులకు గానీ, గృహ వినియోగదారులకు 24 గంటలు విద్యుత్ ఇవ్వలేదని చెప్పారు. ప్రజలను మభ్యపెట్టి, పారిశ్రామిక రంగానికి 24గంటల విద్యుత్ ఇస్తూ ఇతర రాష్ట్రాలలో తక్కువ ధరకు కొనుగోలు చేసి పరిశ్రమలకు ఎక్కువ ధరకు అమ్ముతూ కమిషనులు తీసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. కోతలు లేకుండా రైతులకు ఎనిమిది గంటల నాణ్యమైన విద్యుత్ అందిస్తే బాగుంటుందని మాత్రమే అభిప్రాయం వ్యక్తం చేశారని తప్ప ఎక్కడ ఉచిత విద్యుత్ ఇవ్వము, ఉచిత విద్యుత్ రద్దు చేస్తామని  చెప్పలేదని స్పష్టం చేశారు. రైతులకు ఉచిత విద్యుత్  ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదన్నారు. రైతులను తప్పు దోవ పట్టించడానికే కేటీఆర్, బిఆర్ఎస్ ఇలాంటి చీప్ పాలిటిక్స్ చేస్తున్నాయని, బిఆర్ఎస్ ఎన్ని కుయుక్తులు పన్నినా తెలంగాణలో రైతులు కాంగ్రెస్ పార్టీథఝతోనే ఉంటారన్నారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు మీసం మహేందర్, సందబోయిన పర్శరామ్, ఉడుత జయంత్, బత్తిని గణేష్, జక్కుల నాగరాజు,  కోర్రి శంకర్, ప్రశాంత్,  కల్లూరి నర్సయ్య, మాసం శేషు, చిన్న మహేందర్  కోడెల నాగరాజ్ తదితరులు పాల్గొన్నారు.