రష్యా, ఉక్రెయిన్ సరిహద్దు నగరమైన బెల్లోరాడ్ పైన శనివారం ఉక్రెయిన్ చేసిన దాడిలో 24మంది చనిపోయారని, మొత్తం 108మంది గాయపడ్డారని బెల్గోరాడ్ ప్రాంత గవర్నర్ వ్యాచెస్లావ్ గ్లడ్కోవ్ ఒక టెలిగ్రాం పోస్టులో చెప్పారు. ఈ దాడిలో 100 కార్లు పూర్తిగా కాలిపోయాయని, 30 భవనాలు, వాణిజ్య సముదాయాలు, అనేక గ్రుహాలు దెబ్బతిన్నాయని కూడా ఆయన తెలిపారు. బెల్గోరాడ్ రష్యా, ఉక్రెయిన్ సరిహద్దుకు 40కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ దాడిలో నిషేధిత క్లష్టర్ బాంబులను వాడినట్టు రష్యన్ రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఐక్యరాజ్య సమితి కన్వెన్ష్ 2008ని అనుసరించి పౌరుల ప్రాణాలకు ప్రమాదకరమైనవనే కారణంగా ఈ బాంబులను 110 దేశాలు నిషేధించాయి. రష్యన్ వాయు రక్షణ దళాలు చాలా రాకెట్ బాంబులను నిర్వీర్యం చేసినప్పటికీ కొన్ని బాంబులు బెల్గోరాడ్ పైన పడ్డాయి. రష్యా సరిహద్దు నగరమైన బెల్గోరాడ్ పైన ఉక్రెయిన్ జరిపిన దాడిని ఐక్యరాజ్య సమితి ఖండించింది. పౌరులను చంపాలనే లక్ష్యంతోనే ఉక్రెయిన్ ఈ దాడి చేసిందని రష్యా ఆరోపించిన తరువాత ఐక్యరాజ్య సమితి ఈ దాడిని ఖండించటం జరిగింది. పౌరులపైన దాడి చేయటం, పౌర నివాసాలపైన దాడులు చేయటం అంతర్జాతీయ మానవతా చట్టాల ఉల్లంఘన కిందకు వస్తుందని, ఈ దాడులను తక్షణం ఆపాలని ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ ఒక ప్రకటన చేశారు.