రంగారెడ్డి కలెక్టరేట్‌ ఉద్యోగులకు 24 శాతం హెచ్‌ఆర్‌ఏ ఇవ్వాలి

To the employees of Ranga Reddy Collectorate 24 percent HRA should be given– ఉద్యోగుల పెండింగ్‌ బిల్లులను విడుదల చేయాలి : మంత్రి పొన్నంకు టీఎన్జీవో వినతి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రంగారెడ్డి కలెక్టరేట్‌ ఉద్యోగులకు 24 శాతం హెచ్‌ఆర్‌ఏ చెల్లించాలని టీఎన్జీవో కేంద్ర సంఘం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది. ఉద్యోగుల పెండింగ్‌ బిల్లులను వెంటనే విడుదల చేయాలని కోరింది. ఈ మేరకు మంత్రి పొన్నం ప్రభాకర్‌, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావును టీఎన్జీవో ప్రధాన కార్యదర్శి మారం జగదీశ్వర్‌, అసోసియేట్‌ అధ్యక్షులు కస్తూరి వెంకటేశ్వర్లు, ఎం సత్యనారాయణగౌడ్‌ కలిసి వినతిపత్రం సమర్పించారు. లక్డికాపూల్‌లో ఉండే రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ కార్యాలయం కొంగర కలాన్‌కు మారడం వల్ల ఉద్యోగులకు 24 శాతం హెచ్‌ఆర్‌ఏ అమలు చేయడం లేదని తెలిపారు. కొంగరకలాన్‌ ప్రాంతం ఆదిభట్ల జీహెచ్‌ఎంసీ పరిధిలో ఉన్నందున 24 శాతం హెచ్‌ఆర్‌ఏను అమలు చేయాలని కోరారు. పెండింగ్‌లో ఉన్న డీఏలను విడుదల చేయాలని సూచించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో చర్చించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామంటూ వారు హామీ ఇచ్చారని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీవో రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు లక్ష్మణ్‌, నాయకులు బుచ్చిరెడ్డి, మాధవ్‌ గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.