చెత్తకుప్పలో రూ.25 కోట్లు..

25 crores in the garbage.– బెంగళూరులో దొరికిన అమెరికన్‌ డాలర్లు
బెంగళూరు: ఎన్నికల సీజన్‌ కావటంతో కరెన్సీ కట్టలు ప్రవహిస్తున్నాయి. అయితే అక్కడ ఎన్నికల్లేవ్‌. అయినా రూ. 25 కోట్లు విలువ చేసే అమెరికన్‌ డాలర్లు చెత్త కుప్పలో బయటపడ్డాయి. ఇటీవల బెంగళూరులో చెత్త ఏరుకునే వ్యక్తి షాక్‌కు గురయ్యాడు. అయితే, అది భారతీయ కరెన్సీ కాదు.. అమెరికా డాలర్లు. సల్మాన్‌ షేక్‌ అనే వ్యక్తి బెంగళూరు శివారులో చెత్త ఏరుకుంటుండగా 23 కట్టల అమెరికన్‌ డాలర్లు అతడికి కనిపించాయి. ఒక్కసారిగా నోరెళ్లబెట్టిన అతడు.. ఆ కట్టలు తీసుకొని ఇంటికి వెళ్లిపోయాడు. నవంబర్‌ 5న ఆ మొత్తాన్ని తన యజమాని బప్పాకి అప్పగించాడు.అతడు ఈ విషయాన్ని స్థానిక సామాజిక కార్యకర్త కలిముల్లాకి తెలియజేయగా.. ఇద్దరూ కలిసి బెంగళూరు పోలీస్‌ కమిషనర్‌ దయానందకు ఈ విషయాన్ని వివరించారు. వారిద్దరితో మాట్లాడిన ఆయన.. కేసును దర్యాప్తు చేయాల్సిందిగా హెబ్బల్‌ పోలీసులను ఆదేశించారు. ఈ మొత్తం విలువ రూ.25 కోట్లు ఉంటుందని పోలీసులు అంచనా వేశారు. ఈ నోట్లపై కొన్ని రకాల రసాయనాలను పూసినట్లు పోలీసులు గుర్తించారు. బ్లాక్‌ డాలర్‌ స్కామ్‌కు పాల్పడుతున్న ముఠాకి చెందిన వారు ఈ కరెన్సీ నోట్లను అక్కడ వదిలేసి వెళ్లిపోయి ఉంటారని అనుమానిస్తున్నారు. అంతేకాకుండా అవి ఒరిజినల్‌ డాలర్లేనా?లేదంటే నకిలీవా? అని గుర్తించేందుకు వాటిని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాకు పంపామని పోలీసులు తెలిపారు.