– ప్రభుత్వ చీఫ్‌విప్, ఎమ్మెల్యే దాస్యం వినరుభాస్కర్
నవతెలంగాణ- హన్మకొండ
వరంగల్ నగరంలోని వరద బాధితులకు తక్షణ సహాయంగా రాష్ట్ర ప్రభుత్వం రూ.250 కోట్లు మంజూరు చేసిందనివరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే, ప్రభుత్వ చీఫ్‌విప్ దాస్యం వినరుభాస్కర్ తెలిపారు. ఆదివారం హన్మకొండ జిల్లా కాకతీయ పట్టణ అభివృద్ధి సంస్థ(కుడా) కార్యాలయంలో వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్, కుడా చైర్మెన్ సుందర్ రాజ్ యాదవ్, తదితరులతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2020లో పెద్ద ఎత్తున వర్షం నమోదు కాగా నగరంలోని లోతట్టు ప్రాంతాలు, రోడ్లు, డ్రయినేజీలు, నాలాలు తెగిపోయాయన్నారు. అప్పుడు నగరాన్ని సందర్శించిన మంత్రి కేటీఆర్ తక్షణ సాయం కింద రూ.20 కోట్లు తర్వాత రూ.100 కోట్లు కేటాయించినట్టు చెప్పారు. ఈ ఏడాది అంతకంటే రికార్డు స్థాయిలో 275 మి.మీ వర్షపాతం నమోదయిందన్నారు. దాంతో నీట మునిగి ముంపునకు గురయిన సమ్మయ్య నగర్, రామ్ నగర్, జవహార్ నగర్, తదితర కాలనీలను అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి రూ.1000 కోట్ల వరకు ఎస్టిమేషన్స్ పంపించినట్టు తెలిపారు. దాంతో తక్షణ సహాయం కింద రూ.250 కోట్లు కేటాయించారని, అందుకు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. ఆక్రమణకు గురైన నాలాలను పూర్తిగా తొలగించే దిశగా ఆదేశాలున్నాయని చెప్పారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అనేక ముంపు ప్రాంతాలను సందర్శించి రూపాయి కూడా ఇవ్వలేదని, ఆర్థికంగా కేంద్రం నుంచి సహాయ సహకారాలు అందించలేని దుస్థితిలో ఉన్నారని ఆరోపించారు. కేంద్రం నుంచి ఏం నిధులు తెచ్చి నగరాభివృద్ధికి కృషి చేశారో వరంగల్ నగర ప్రజలకు తెలపాలని డిమాండ్ చేశారు. పర్యావరణ పరిరక్షణకు ప్లాస్టిక్ కవర్లను నిషేధిం చాలని తెలిపారు. తక్షణ అభివృద్ధి కింద చేపట్టాల్సిన పునర్నిర్మాణ పనులపై అధికారులనూ ఆదేశించినట్టు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని బీజేపీ నాయకులు అవగాహన లేని మాటలు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వంపై బురద చల్లుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం కేసీఆర్, కేటీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. సమా వేశంలో గ్రంథాలయ సంస్థ చైర్మెన్ అజిజ్ ఖాన్, కార్పొరేటర్లు మామిండ్ల రాజు, అశోక్ యాదవ్, రంజిత్ రావు, కుడా మాజీ డైరెక్టర్ శివశంకర్ పాల్గొన్నారు.