గణేశ్ నిమజ్జనానికి 25వేల మందితో పోలీసులతో బందోబస్తు..

– నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్..
నవతెలంగాణ – సుల్తాన్ బజార్ 
గణేశ్ నిమజ్జనం ప్రశాంతంగా జరిగేందుకు పోలీసు శాఖ తరపున అవసరమైన ఏర్పాట్లు చేశామని నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. సుమారు 25 వేల మంది పోలీసు అధికారులు, సిబ్బందితో బందోబస్తు చేపట్టినట్లు వెల్లడించారు. భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో  నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో అధికారులు, ఉత్సవ సమితి ప్రతినిధులతో సమన్వయ సమావేశంలో ఆయన మాట్లాడారు. మండప నిర్వాహకులు నిర్ణీత సమయంలో నిమజ్జనానికి విగ్రహాలను తరలించి సహకరించాలన్నారు. ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనం మంగళవారం మధ్యాహ్నం ఒంటిగంటన్నరకల్లా పూర్తి అవుతుందని, మిగిలిన ప్రతిమలను సైతం త్వరితగతిన నిమజ్జనం చేసినట్లయితే ఇబ్బందులు ఉండవన్నారు. భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి అధ్యక్షుడు రాఘవరెడ్డి మాట్లాడుతూ.. అయ్యప్ప స్వామి దీక్ష తరహాలో నిమజ్జనోత్సవంలో మాంసం, మద్యానికి దూరంగా ఉండాలని ఆయన సూచించారు. ఉత్సవ సమితి కార్యదర్శి డాక్టర్ రావినూతల శశిధర్, సైబరాబాద్ పోలీస్ జాయింట్ కమిషనర్ జోయల్ డేవిస్, జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్ రఘుప్రసాద్, జోనల్ కమిషనర్లు రవికిరణ్, వెంకన్న, ఉత్సవ కమిటీ ప్రధాన కార్యదర్శి రాజా వర్ధన్ రెడ్డి, కరోడిమల్, మెట్టు వైకుంఠం, శ్రీరామ్ వ్యాస్, గోవింద్ రాఠి పాల్గొన్నారు.