మధ్యప్రదేశ్ : గుజరాత్, జార్ఖండ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ సహా వివిధ రాష్ట్రాలకు చెందిన 26 మంది బాలికలు భోపాల్‌లో అక్రమం గా నిర్వహిస్తున్న షెల్టర్ హోమ్ నుంచి అదృశ్యమయ్యారు. జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మెన్ ప్రియాంక్ కనుంగో.. భోపాల్ శివార్లలోని పర్వాలియా ప్రాంతంలోని ఆంచల్ బాలికల హాస్టల్‌ను ఆకస్మికంగా సందర్శించినప్పుడు ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. షెల్టర్ హోమ్ రిజిస్టర్‌ను పరిశీలించిన తర్వాత అందులో 68 మంది బాలికల ఎంట్రీలు ఉన్నాయని, అయితే వారిలో 26 మంది కనిపించడం లేదని కనుంగో గుర్తించారు. అదృశ్యమైన బాలికల గురించి షెల్టర్ హోమ్ డైరెక్టర్ అనిల్ మాథ్యూను ప్రశ్నించగా.. ఆయన పొంతన లేని సమాధానలు చెప్పడంతో.. అనుమానం వచ్చిన అధికారి.. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల దర్యాప్తులో బాలికల హాస్టల్‌లో అనేక అవకతవకలు వెలుగులోకి వచ్చాయి. అసలు షెల్టర్ హౌంను అక్రమంగా నిర్వహిస్తున్నట్లు తేలింది. ఈ విషయం గురించి తెలుసుకున్న గవర్నర్.. దీనిపై దర్యాప్తు చేయాల్సిందిగా ఆదేశిస్తూ ప్రభుత్వ సీఎస్‌కు నోటీసులు పంపినట్టు తెలిపారు. ఇక షెల్టర్ హౌంలోని మిగతా పిల్లలను చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి అప్పజెప్పారు.