– ఎనిమిదిరోజుల్లో బీఆర్‌ఎస్ తమ వైఖరి ప్రకటించాలి
– లేదంటే ఆ పార్టీని ఓడిస్తాం : బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్.కృష్ణయ్య
రాష్ట్ర బీసీ జాబితా నుంచి 26 కులాలను తొలగించి బీసీలను అన్ని విధాలా బీఆర్‌ఎస్ ప్రభుత్వం అన్యాయం చేసిందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య తెలిపారు. ఆదివారం హైదరాబాద్‌లోని బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్‌లో 26 బీసీ కులాల పోరాట సమితి అధ్యక్షులు ఆళ్ల రామకృష్ణ అధ్యక్షతన విలేకర్ల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ తొలగించిన వెనుకబడిన 26 కులాలను 8 రోజుల్లోపు బీసీ జాబితాలో కలపాలని సీిఎం కేసీఆర్‌ను డిమాండ్ చేశారు. ఇప్పటికే విద్య, ఉపాధి, ఉద్యోగాల్లో ఎంతో నష్టపోయారని ఆందోళన వ్యక్తం చేశారు. తల్లితండ్రులు బీసీలుగా ఉంటె పిల్లలు ఓసీలు ఎలా అవుతారని అయన ప్రశ్నించారు. బీసీలను విభజించి అధికారంలోకి వస్తామంటే బీసీలు ఊరుకోబోరని హెచ్చరించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి మద్దతివ్వాలనే విషయం నాలుగు రోజుల్లో ప్రకటిస్తామని తెలిపారు. డిసెంబర్ 13, 14 న జరగనున్న పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో బీసీ కుల గణన చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలో ధర్నా చేపట్టనున్నట్టు ప్రకటించారు. విలేకర్ల సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎర్ర సత్యనారాయణ, నిరుద్యోగ జేఏసీ చైర్మెన్ నీలం వెంకటేష్ ముదిరాజ్, సుధాకర్, రాజేందర్, అనంతయ్య, పితాని ప్రసాద్ , బిల్ల దీపిక తదితరులు పాల్గొన్నారు