– ఇందిరమ్మ ఇళ్లకు ముగిసిన దరఖాస్తుల స్వీకరణ
– లబ్ది కోసం అర్హుల ఎదురు చూపు
నవతెలంగాణ – మల్హర్ రావు
ఇంటి స్థలం కలిగి ఉండి పక్క ఇల్లు నిర్మించుకోవాలనుకునే నిరుపేదలకు రూ.3 లక్షల ఆర్థిక సాయం అందించేలా గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన గృహలక్ష్మీ పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసింది. ఇందుకు కోసం స్వీకరించిన దరఖాస్తులన్నింటిని పక్కన పెట్టాలని జిల్లా కలెక్టర్లను ఆదేశిస్తూ ఈ నెల 3న ఉత్తర్వులు జారీ చేసింది.దీంతో మండలంలో 15 గ్రామాల్లో ఈ పథకం కోసం అందిన 2,753 దరఖాస్తులు బుట్టదాఖలైయ్యాయి. దీనిపై దరఖాస్తు దారుల్లో నిరాశ వ్యక్తం అవుతున్నప్పటికి బీఆర్ఎస్ ప్రకటించిన రూ.3 లక్షలకు రూ.2 లక్షలు కలిపి రూ.5 లక్షల సాయాన్ని ఇంటి నిర్మాణం కోసం అందిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించడం ఊరటనిస్తోంది.ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలపై అర్హులైన వారిలో ఆశలు చిగురిస్తున్నాయి. అయితే విధివిధానాలపై ఇప్పటి వరకు స్పష్టత లేకపోవడం గమనార్హం. తాజాగా ప్రజాపాలనలో భాగంగా ఇందిరమ్మ ఇండ్ల కోసం స్వీకరించిన దరఖాస్తులను ప్రస్తుతం ఆన్ లైన్ లో నమోదు చేస్తున్నారు. వాటి ఆధారంగా అర్హుల ఎంపికకు సంబంధించి విధి,విధానాలు ఖరారైయ్యే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది.
మంజూరు కాకండానే…
2018 ఎన్నికల్లో రెండవసారి అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం అర్హులైన వారందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించి ఇస్తామని ప్రకటించింది.ఇండ్ల నిర్మాణాలు ప్రారంభించినప్పటికి బిల్లుల జాప్యం కారణంగా వాటిని చేపట్టేందుకు కాంట్రాక్టర్లు ఆసక్తి చూపలేదు. దీంతో మండలంలో రాఘవయ్య పల్లిలో పనులు అభ్యంతరంగా నిలిచిపోగా మల్లారం పరిధిలో అసలే నిర్మాణాలు చేపట్టలేదు.ఈ నేపథ్యంలో బిఆర్ఎస్ ప్రభుత్వం 2023 ఎన్నికలకు ముందు సొంత ఇంటిష్ఠలం కలిగి ఉన్న పేదలకు రూ.3 లక్షల ఆర్థిక సాయం అందించేలా గృహలక్ష్మీ పథకాన్ని ప్రవేశపెట్టింది. గతేడాది ఆగస్టులో ప్రజల నుంచి దరఖాస్తులు స్వకరించింది.ఇందు కోసం మండల వ్యాప్తంగా 2,753 దరఖాస్తులు చేసుకున్నారు క్షేత్రస్థాయిలో విచారణ అనంతరం 2,251 అర్హులుగా అధికారులు తేల్చి 502 పక్కన పెట్టారు. ఈ తరుణంలో ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో ఎంపిక ప్రక్రియ నిలిచిపోయిది. ఎన్నికల తరువాత ప్రభుత్వం మారిపోవడంతో ఇండ్లను మంజూరు చేయకుండానే ఈ పథకం రద్దయింది.
ఇందిరమ్మ ఇళ్లపై ఆశలు…
గృహలక్ష్మీ దరఖాస్తులను రద్దు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సొంతింటి కలలను సహకారం చేసేలా అర్హులైన వారికి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు రూ.5 లక్షల సాయం అందిస్తామని ఎన్నికల మెనిపేస్టో ప్రకటించింది తదనుగుణంగా గత నెల 28 నుంచి ఈ 6వ తేదీ వరకు సాగిన ప్రజాపాలనలో అర్హులైన వారి నుంచి దరఖాస్తులు స్వీకరించింది. 8 రోజుల పాటు మండలంలో 9,107 అందిన ఈ దరఖాస్తులను ప్రస్తుతం ప్రజాపాలన అధికారిక వెబ్ సైట్లో నమోదు చేస్తున్నారు. విధి, విధానాలు ఇంకా ఖరారు కానప్పటికీ సోమవారం జరిగే రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది.అయితే ఏ ప్రాతిపదికన లబ్ధిదారులను ఎంపిక చేస్తారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది
రెండింటికి చెడ్డ రెవడిలా పేదల పరిస్థితి…
గృహలక్ష్మీ లబ్ధిదారుల ఎంపిక బాధ్యతలను అప్పటి బిఆర్ఎస్ ప్రభుత్వం ఎమ్మెల్యే లకు అప్పజెప్పింది.దీంతో నేరుగా ఎమ్మెల్యే లను కలువకపోయిన ఎంతోమంది నిరుపేదలు వారి అనుయాయులుగా ఉన్న ఆ పార్టీలోని ద్వితీయ శ్రేణి నాయకులను ఆశ్రయించారు. తమకు ఎలాగైనా ఇండ్లకు మంజూరు చేయించాలని కోరుతూ రూ.10 వేల నుంచి రూ.50 వేల వరకు ముట్టజెప్పారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. దరఖాస్తు దారుల నుంచి పైరవీలు ఎక్కువగా జరిగి వారికి వేళల్లో ముట్టజెప్పాల్సి వచ్చింది. తీరా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో తాము ఇచ్చిన డబ్బులు ఇవ్వమని కోరితే బిఆర్ఎస్ నాయకులు మొఖం చాటేస్తున్నట్లుగా బహిరంగంగానే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాగా గృహలక్ష్మీ పథకాన్ని రద్దు చేయడంతో పేదలు రెండు విధాలా నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడటంతో వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.