ఈ ఏడాది 28 బిలియన్ల ఫార్మా ఎగుమతులు

– గతేడాది ఆశించిన స్థాయిలో నమోదు కాలేదు
– ఫార్మాగ్జిల్‌ డైరెక్టర్‌ జనరల్‌ రవి ఉదరు వెల్లడి
– వచ్చే నెలలో అంతర్జాతీయ ఎగ్జిబిషన్‌
హైదరాబాద్‌ : ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 28 బిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.2.30 లక్షల కోట్లు) విలువ చేసే ఔషద ఉత్పత్తుల ఎగుమ తులు అంచనా వేస్తున్నామని ఫార్మా గ్జిల్‌ డైరెక్టర్‌ జనరల్‌ రవి ఉదరు భాస్కర్‌ అన్నారు. 2022-23లో 3.25 శాతం వృద్థితో 25.39 బిలియన్‌ డాలర్ల ఎగుమతులు జరిగాయన్నారు. తొలిసారి 25 బిలియన్ల మార్క్‌ను చేరుకున్నప్పటికీ.. పరిశ్రమ ఇంతకంటే ఎక్కువ 27 బిలియన్లుగా అంచనా వేసిందన్నారు. ముఖ్యంగా ఆఫ్రికా, సిఐఎస్‌ దేశాలకు చేసే ఎగుమతుల్లో ప్రతికూల వృద్థి చోటు చేసుకుందన్నారు. మంగళవారం హైదరాబాద్‌లో ఫార్మాగ్జిల్‌ రెగ్యూలేటరీ ఎఫైర్స్‌ డైరెక్టర్‌ లక్ష్మీ ప్రసన్న చుండుతో కలిసి ఉదరు భాస్కర్‌ మీడియాతో మాట్లాడారు. గతేడాది దేశంలో ప్రస్తుతం 50 బిలియన్‌ డాలర్ల విలువ చేసే ఔషద ఉత్పత్తులు నమోదయ్యాయన్నారు. ఇందులో సగం ఎగుమతులు జరగడం విశేషమన్నారు. ఈ రంగం ఎగుమతుల్లో తెలుగు రాష్ట్రాల వాటా అత్యంత కీలకంగా ఉందన్నారు. గ్లోబల్‌ ఎగుమతుల్లో విలువ పరంగా భారత్‌ 11వ స్థానంలో, సంఖ్య పరంగా 3వ స్థానంలో ఉందన్నారు. గ్లోబల్‌ టాప్‌ 25 ఫార్మా కంపెనీల్లో ఎనిమిది భారత్‌కు చెందినవేనని అన్నారు. ఔషద ముడి సరుకుల ఎగుమతుల్లో చైనా అగ్రస్థానంలో ఉందన్నారు. ఆ దేశం దాదాపుగా 1.73 ట్రిలియన్‌ డాలర్ల ఫార్మా ఎగుమతులు చేస్తోందన్నారు. ఇతర దేశాలతో పోల్చితే ఇది చాలా ఎక్కువన్నారు. మొత్తం ప్రపంచానికి కావాల్సిన ఎపిఐ, ఇంటర్మీడియట్‌ ముడి సరుకుల ఎగుమతుల్లో చైనా ఏకంగా 65-70 శాతం వాటా కలిగి ఉందన్నారు. దిగుమతులను తగ్గించుకోవడానికి భారత్‌ పిఎల్‌ఐ స్కీమ్‌ కింద ప్రోత్సాహకాలు ఇస్తున్నప్పటికీ పెద్ద పురోగతి కనబడటం లేదన్నారు. స్వల్వంగా మాత్రమే దిగుమతులు తగ్గాయన్నారు.
మూడు రోజులు ఫార్మా ఎగ్జిబిషన్‌
జులై 5,7,8 తేదిల్లో హైదరాబాద్‌లో నిర్వహించనున్న అంతర్జాతీయ ఫార్మా ఎగ్జిబిషన్‌ (ఐపెక్స్‌) 9వ ఎడిషన్‌ వివరాలను రవి ఉదరు భాస్కర్‌ వెల్లడించారు. దీనికి 120 దేశాల దిగుమతి, ఎగుమతి దారులు సహా 3500 మంది ఎగ్జిబిటర్లు, 4500 మంది విదేశీ ప్రతినిధులు, లక్షకు పైగా సందర్శకులు హాజరు కానున్నారని తెలిపారు. ఈ ప్రదర్శన వ్యాపారాన్ని పెంచుకునేందుకు ప్రపంచ దేశాల సాంకేతికతను పంచుకునేందుకు విస్తృత అవకాశాలు కల్పిస్తుందన్నారు.