ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్‌లో 28 మంది!

28 people in track and field!– ఒలింపిక్స్‌కు అథ్లెట్లను ప్రకటించిన ఏఎఫ్‌ఐ
న్యూఢిల్లీ: 2024 పారిస్‌ ఒలింపిక్స్‌కు భారత అథ్లెటిక్స్‌ సమాఖ్య (ఏఎఫ్‌ఐ) 28 మందితో కూడిన జట్టును గురువారం ప్రకటించింది. జులై 26 నుంచి పారిస్‌ ఒలింపిక్స్‌ ఆరంభం కానుండగా.. ఆగస్టు 1 నుంచి 11 వరకు ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్‌ ఈవెంట్లు ఉండనున్నాయి. భారత అథ్లెటిక్స్‌ సమాఖ్య గురువారం విడుదల చేసిన అథ్లెట్ల జాబితాలో 11 మంది మహిళా అథ్లెట్లు చోటు దక్కించుకున్నారు. టోక్యో ఒలింపిక్స్‌ పసిడి విజేత నీరజ్‌ చోప్రా.. ఊహించినట్టుగా భారత అథ్లెటిక్స్‌ బృందానికి సారథ్యం వహించనున్నాడు. ఇక ఇటీవల ఇంటర్‌ స్టేట్‌ చాంపియన్‌షిప్స్‌లో సత్తా చాటి ఒలింపిక్స్‌కు ఆఖరు నిమిషంలో అర్హత సాధించిన స్ప్రింటర్‌ కిరణ్‌ పహల్‌కు మహిళల రిలే జట్టులో చోటు దక్కలేదు. భారత అథ్లెటిక్స్‌ సమాఖ్య నిబంధనల ప్రకారం.. నేషనల్‌ క్యాంపర్స్‌ను రిలే జట్టులో ఉంచకూడదనే విధానం కారణంగానే కిరణ్‌ పహల్‌ను పక్కన పెట్టినట్టు సమాచారం. మహిళల 400 మీటర్ల రేసు వ్యక్తిగత విభాగంలోనే కిరణ్‌ పహల్‌ పతకం కోసం పోటీపడనుంది. తెలుగు తేజం జ్యోతి ఎర్రాజి 100మీ హర్డిల్స్‌లో పోటీపడనుంది. పారిస్‌ ఒలింపిక్స్‌కు అర్హత సాధించినా.. డోపింగ్‌ సస్పెన్షన్‌ కారణంగా జావెలిన్‌ త్రోయర్‌ డి.పి మనును పారిస్‌ ఒలింపిక్స్‌కు ఎంపిక చేయలేదు.
అథ్లెటిక్స్‌లో భారత బృందం
పురుషులు: అవినాశ్‌ సబ్లె (3000 మీ స్టీపుల్‌ఛేజ్‌), నీరజ్‌ చోప్రా, కిశోర్‌ కుమార్‌ ఝా (జావెలిన్‌ త్రో), తజిందర్‌ పాల్‌ సింగ్‌ తూర్‌ (షాట్‌ పుట్‌), ప్రవీణ్‌ చిత్రవెల్‌, అబ్దుల్లా అబూబాకర్‌ (ట్రిపుల్‌ జంప్‌), సర్వేశ్‌ కుశారె (హై జంప్‌), ఆక్షదీప్‌ సింగ్‌, వికాశ్‌ సింగ్‌, పరంజిత్‌ సింగ్‌ (20కె రేస్‌ వాక్‌), మహమ్మద్‌ అనాస్‌, అమోజ్‌ జాకబ్‌, సంతోశ్‌, రాజేశ్‌ రమేశ్‌, మిజో కురియన్‌ (4, 400 మీ రిలే), సురజ్‌ పన్వార్‌ (రేస్‌ వాక్‌ మిక్స్‌డ్‌ మారథాన్‌).
మహిళలు: కిరణ్‌ పహల్‌ (400 మీ), పారుల్‌ చౌదరి (3000 మీ స్టీపుల్‌ఛేజ్‌, 5000 మీ), జ్యోతి ఎర్రాజి (100మీ హార్డిల్స్‌), అన్నూ రాణి (జావెలిన్‌ త్రో), అబా కతువ (షాట్‌ పుట్‌), జ్యోతిక, శుభ వెంకటేశన్‌, విత్య రామరాజ్‌, పూవమ్మ ఎఆర్‌, ప్రాచి (4, 400 మీ రిలే), ప్రియాంక గోస్వామి (20 కిమి రేస్‌ వాక్‌/రేస్‌ వాక్‌ మిక్స్‌డ్‌ మారథాన్‌).