ఇండోనేషియాలో భారీ వరదలు .. 28 మంది మృతి

జకార్తా : ఇండోనేషియాను భారీ వరదలు ముంచెత్తాయి. కొండచరియలు విరిగిపడటంతో 28 మంది మరణించారు. నలుగురు గల్లంతయ్యారని ఆదివారం అధికారులు తెలిపారు. ఇండోనేషియాలోని సుమత్రా ప్రావిన్స్‌లో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వరదలు ముంచెత్తడంతో 28 మంది మృతి చెందారని ప్రావిన్షియల్‌ రెస్క్యూటీమ్‌ చీఫ్‌ అబ్దుల్‌ మాలిక్‌ పేర్కొన్నారు. గల్లంతైన నలుగురి కోసం గాలిస్తున్నామని అన్నారు. వరదలతో తన్హ్‌ దతార్‌ రీజెన్సీకి బురద కొట్టుకొచ్చిందని జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (బీఎన్‌బీపీ) ఓ ప్రకటనలో తెలిపింది. ఉప జిల్లాలను ప్రభావితం చేసిందని, 84 హౌసింగ్‌ యూనిట్లు, 16 వంతెనలు ప్రభావితమ య్యాయని వెల్లడించింది. రహదారిని పునరుద్ధరించేందుకు భారీ యంత్రాలను మోహరించినట్లు అధికారులు తెలిపారు.