ఇంకో 280 కొడితే!

– లక్ష్యం 444, ప్రస్తుతం 164/3
– క్లిష్ట పరిస్థితుల్లో టీమ్‌ ఇండియా
– ఆసీస్‌తో ఐసీసీ డబ్ల్యూటీసీ ఫైనల్‌
లక్ష్యం 444 పరుగులు. ప్రస్తుతం 164/3. చేతిలో ఏడు వికెట్లు ఉండగా చారిత్రక టెస్టు గద దక్కేందుకు భారత్‌ ఇంకో 280 పరుగులు చేయాల్సింది. ఐసీసీ డబ్ల్యూటీసీ ఫైనల్లో నేడు ఆఖరు రోజు ఆట. ఆస్ట్రేలియా విజయానికి ఏడు వికెట్ల దూరంలో నిలువగా.. విరాట్‌ కోహ్లి, అజింక్య రహానెలు భారత్‌ ఆశలను సజీవంగా నిలిపారు.
క్యాచౌట్‌ వివాదం!
గిల్‌ (18) క్యాచౌట్‌ నిర్ణయం వివాదాస్పదమైంది. బొలాండ్‌ ఓవర్లో మూడో స్లిప్స్‌లో కామెరూన్‌ గ్రీన్‌ క్యాచ్‌ అందుకున్నా.. బంతి ఓ వైపు నేలకు తాకుతున్నట్టు రీప్లేలో కనిపించింది. టీవీ అంపైర్‌ నిర్ణయంతో భారత అభిమానులు ‘మోసం.. మోసం’ అంటూ నినాదాలు చేశారు.
ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్లో భారత్‌ ఎదురీదుతోంది. 444 పరుగుల రికార్డు లక్ష్య ఛేదనలో కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (43, 60 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్‌), శుభ్‌మన్‌ గిల్‌ (18), చతేశ్వర్‌ పజార (27) వికెట్లు చేజార్చుకున్న టీమ్‌ ఇండియా.. మరో 280 పరుగులు చేయాల్సి ఉంది. విరాట్‌ కోహ్లి (44 బ్యాటింగ్‌, 60 బంతుల్లో 7 ఫోర్లు), అజింక్య రహానె (20 బ్యాటింగ్‌, 59 బంతుల్లో 3 ఫోర్లు) అజేయంగా ఆడుతున్నారు.
రోహిత్‌ మెరిసినా..
444 పరుగుల రికార్డు ఛేదనలో భారత్‌కు మంచి ఆరంభం లభించింది. ఓపెనర్లు రోహిత్‌ శర్మ (43), శుభ్‌మన్‌ గిల్‌ (18, 19 బంతుల్లో 2 ఫోర్లు) వేగంగా పరుగులు సాధించారు. సాఫీగా సాగుతున్న ఛేదనకు వివాదాస్పద క్యాచ్‌ అంతరాయం కలిగించింది. స్లిప్స్‌లో గిల్‌ క్యాచ్‌ను కామెరూన్‌ అందుకున్న తీరు గందరగోళంగా ఉన్నప్పటికీ టీవీ అంపైర్‌ అవుట్‌గా ప్రకటించాడు. దీంతో భారత్‌కు తొలి ఎదురు దెబ్బ తగిలింది. టీ విరామ సమయానికి భారత్‌ 41/1తో నిలిచింది.
చివరి సెషన్‌ను రోహిత్‌ శర్మ, చతేశ్వర్‌ పుజార (27, 47 బంతుల్లో 5 ఫోర్లు) మెరుగ్గా మొదలెట్టారు. ఓ ఎండ్‌లో రోహిత్‌ ఎదురు దాడి చేయగా.. పుజార సైతం అదే దారిలో నడిచాడు. ఈ ఇద్దరు క్రీజులో ఉండగా ఆసీస్‌పై ఒత్తిడి కనిపించింది. రోహిత్‌ అర్థ సెంచరీకి చేరువైన తరుణంలో స్పిన్నర్‌ నాథన్‌ లయాన్‌ను ప్రయోగించిన ఆసీస్‌.. రెండో వికెట్‌ భాగస్వామ్యానికి తెరదించింది. 77 బంతుల్లోనే 51 పరుగులు జోడించిన పుజార, రోహిత్‌ ఆకట్టుకున్నారు. కానీ రోహిత్‌ను లయాన్‌ ఎల్బీగా అవుట్‌ చేయగా.. తర్వాతి ఓవర్లోనే కమిన్స్‌కు పుజార వికెట్ల వెనకాల దొరికిపోయాడు. 91/1తో పటిష్టంగా కనిపించిన భారత్‌ 93/3తో మళ్లీ ఒత్తిడిలో కూరుకుంది. పుజార,రోహిత్‌ నిష్క్రమణతో జతకట్టిన విరాట్‌ కోహ్లి, అజింక్య రహానె నాల్గో వికెట్‌కు కీలక భాగస్వామ్యం నిర్మించారు. అజేయంగా 71 పరుగులు నమోదు చేశారు.
అలెక్స్‌ మెరుపుల్‌
ఓవర్‌నైట్‌ స్కోరు 123/4తో నాల్గో రోజు బ్యాటింగ్‌కు వచ్చిన ఆస్ట్రేలియా.. విలువైన పరుగులు జోడించింది. ఓవర్‌నైట్‌ బ్యాటర్లు లబుషేన్‌ (41), కామెరూన్‌ గ్రీన్‌ (18) ఎంతోసేపు నిలువలేదు. లబుషేన్‌ను ఉమేశ్‌, గ్రీన్‌ను జడేజా అవుట్‌ చేశారు. కానీ అలెక్స్‌ కేరీ (66 నాటౌట్‌) భారత్‌ ఛేదించాల్సిన లక్ష్యాన్ని భారీగా పెంచాడు. మిచెల్‌ స్టార్క్‌ (41)తో కలిసి ఏడో వికెట్‌కు 107 పరుగులు జోడించిన కేరీ.. ఆసీస్‌కు మంచి స్కోరు అందించాడు. ఆరు ఫోర్లతో 82 బంతుల్లో అర్థ సెంచరీ సాధించిన అలెక్స్‌ ధనాధన్‌ ఆటతో మెప్పించాడు. స్టార్క్‌, కమిన్స్‌ (5) నిష్క్రమణతో ఆసీస్‌ రెండో ఇన్నింగ్స్‌ను 270 పరుగుల వద్ద డిక్లరేషన్‌ ప్రకటించింది. భారత్‌కు 444 పరుగుల రికార్డు లక్ష్యాన్ని నిర్దేశించింది. భారత బౌలర్లలో జడేజా (3/58), ఉమేశ్‌ (2/54), షమి (2/39) రాణించారు.
స్కోరు వివరాలు
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌ : 469/10
భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ : 296/10
ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌ : ఖవాజ (సి) భరత్‌ (బి) ఉమేశ్‌ 13, వార్నర్‌ (సి) భరత్‌ (బి) సిరాజ్‌ 1, లబుషేన్‌ (సి) పుజార (బి) ఉమేశ్‌ 41, స్మిత్‌ (సి) ఠాకూర్‌ (బి) జడేజా 34, హెడ్‌ (సి,బి) జడేజా 18, గ్రీన్‌ (బి) జడేజా 25, అలెక్స్‌ నాటౌట్‌ 66, స్టార్క్‌ (సి) కోహ్లి (బి) షమి 41, కమిన్స్‌ (సి) (సబ్‌) అక్షర్‌ (బి) షమి 5, ఎక్స్‌ట్రాలు : 26, మొత్తం : (84.3 ఓవర్లలో 8 వికెట్లకు) 270 డిక్లేర్డ్‌.
వికెట్ల పతనం : 1-2, 2-24, 3-86, 4-111, 5-124, 6-176, 7-260, 8-270.
బౌలింగ్‌ : షమి 16.3-6-39-2, సిరాజ్‌ 20-2-80-1, ఠాకూర్‌ 8-1-21-0, ఉమేశ్‌ 17-1-54-2, జడేజా 23-4-58-3.
భారత్‌ రెండో ఇన్నింగ్స్‌ : రోహిత్‌ (ఎల్బీ) లయాన్‌ 43, గిల్‌ (సి) గ్రీన్‌ (బి) బొలాండ్‌ 18, పుజార (సి) అలెక్స్‌ (బి) కమిన్స్‌ 27, కోహ్లి బ్యాటింగ్‌ 44, రహానె బ్యాటింగ్‌ 20 , ఎక్స్‌ట్రాలు : 12, మొత్తం : (40 ఓవర్లలో 3 వికెట్లకు) 164.
వికెట్ల పతనం : 1-41, 2-92, 3-93.
బౌలింగ్‌ : కమిన్స్‌ 9-0-42-1, బొలాండ్‌ 11-1-38-1, స్టార్క్‌ 7-0-45-0, గ్రీన్‌ 2-0-6-0, లయాన్‌ 11-1-32-1.