29 చలో హైదరాబాద్..

– ఐఎఫ్టియు రాష్ట్ర ఉపాధ్యక్షులు దాస్ .కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా వాల్ పోస్టర్ల ఆవిష్కరణ

నవతెలంగాణ- ఆర్మూర్
మోడీ కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా 29 ఆగస్టు చలో హైదరాబాద్ జయప్రదం చేయాలని ఐఎఫ్టియు రాష్ట్ర ఉపాధ్యక్షులు దాస్ పిలుపునిచ్చారు. చలో హైదరాబాద్ పోస్టర్లను పట్టణంలోని మామిడిపల్లిలో మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోడీ ఎన్నికల వాగ్దానాలు విస్మరించి, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేయడం, అమ్మకానికి పెట్టడం, కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్, స్కీమ్ వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించకుండా, 4 కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్ లను తెచ్చి కార్మికులను కట్టు బానిసలుగా మార్చే కుట్ర చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నరేంద్ర మోడీ ప్రతి సంవత్సరం రెండు కోట్ల మందికి కొలువులు ఇస్తామని మాట నీళ్ల మూటగా మారిందని ఆయన అన్నారు. స్వచ్ భారత్ లో ముందు వరుసలో ఉండి కృషి చేస్తున్న సఫాయి కార్మికులను శాలువా కప్పి సన్మానిస్తే సరిపోదని  2016 అక్టోబర్ 26 తేదీన సుప్రీంకోర్టు తీర్పును ప్రకారం సమాన పనికి సమాన వేతనం కార్మికులకు అమలు చేయించాలని మోడీ ప్రభుత్వాన్ని దాసు డిమాండ్ చేశారు. దేశంలో ఉన్న కార్మికులందరికీ పిఎఫ్, ఈఎస్ఐ చట్టాలను అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ బాటలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్  ప్రయనించకుండా, కార్మిక హక్కుల అమలుపై కృషి చేయాలని ఆయన కోరారు. కెసిఆర్ గ్రామపంచాయతీ కార్మికుల సమ్మె సందర్భంగా ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని, లేనిచో కార్మికుల కోపాగ్నికి బలికాక తప్పదని ఆయన హెచ్చరించారు. ఐఎఫ్టియు జాతీయ కమిటీ ఇచ్చిన పిలుపు లో భాగంగా, ఆగస్టు 29 న, ఛలో హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద మహా ధర్నాను నిర్వహిస్తున్నామని ధర్నా లో అన్ని రంగాల కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని దాసు పిలుపును ఇచ్చారు.