లాసెట్‌లో 29,049 మంది ఉత్తీర్ణత

– ఫలితాలు విడుదల చేసిన లింబాద్రి
– 26 లా కాలేజీల్లో 7,560 సీట్లు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో లా కోర్సుల్లో 2023-24 విద్యాసంవత్సరానికి సంబంధించిన ప్రవేశాల కోసం నిర్వహించిన లాసెట్‌ రాతపరీక్షల ఫలితాలను గురువారం హైదరాబాద్‌లో ఉన్నత విద్యామండలి చైర్మెన్‌ ఆర్‌ లింబాద్రి విడుదల చేశారు. లాసెట్‌కు 43,692 మంది దరఖాస్తు చేయగా, 36,218 మంది పరీక్ష రాశారు. వారిలో 29,049 (80.21 శాతం) మంది అభ్యర్థులు ఉత్తీర్ణులయ్యారు. ఇందులో 31,022 మంది అబ్బాయిలు దరఖాస్తు చేస్తే, 25,586 మంది పరీక్షకు హాజరయ్యారు. వారిలో 20,930 (81.80 శాతం) మంది ఉత్తీర్ణత పొందారు. 12,667 మంది అమ్మాయిలు దరఖాస్తు చేయగా, 10,629 మంది పరీక్ష రాశారు. వారిలో 8,117 (76.37 శాతం) మంది ఉత్తీర్ణత సాధించారు. ముగ్గురు ట్రాన్స్‌జెండర్లు దరఖాస్తు చేస్తే, ముగ్గురూ పరీక్షకు హాజరయ్యారు. వారిలో ఇద్దరు (66.67 శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు. మూడేండ్ల ఎల్‌ఎల్‌బీ కోర్సుకు 31,485 మంది దరఖాస్తు చేయగా, 25,747 మంది పరీక్ష రాశారు. వారిలో 20,234 (78.59 శాతం) మంది ఉత్తీర్ణత పొందారు. ఐదేండ్ల ఎల్‌ఎల్‌బీ కోర్సుకు 8,858 మంది దరఖాస్తు చేస్తే, 7,529 మంది పరీక్షకు హాజరయ్యారు. వారిలో 6,039 (80.21 శాతం) మంది ఉత్తీర్ణత సాధించారు. ఎల్‌ఎల్‌ఎం కోర్సుకు 3,349 మంది దరఖాస్తు చేయగా, 2,942 మంది పరీక్ష రాశారు. వారిలో 2,776 (94.36 శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు. ర్యాంకు కార్డుల కోసం ష్ట్ర్‌్‌జూర://శ్రీaషషవ్‌.్‌రషష్ట్రవ.aష.ఱఅ వెబ్‌సైట్‌ను సంప్రదించాల్సి ఉంటుంది. లింబాద్రి, ఓయూ వీసీ డి రవీందర్‌ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో 26 లా కాలేజీలున్నాయని చెప్పారు. మూడేండ్ల లా కోర్సుకు సంబంధించి 23 కాలేజీల్లో 4,630 సీట్లు, ఐదేండ్ల లా కోర్సులకు చెందిన 18 కాలేజీల్లో రెండు వేల సీట్లు, ఎల్‌ఎల్‌ఎం లా కోర్సుకు సంబంధించిన 19 కాలేజీల్లో 930 సీట్లు కలిపి మొత్తం 7,560 సీట్లున్నాయని వివరించారు. గతేడాది 6,235 సీట్లు భర్తీ అయ్యాయని అన్నారు. 1,325 సీట్లు మిగిలాయని వివరించారు. రాష్ట్రంలోని లా కాలేజీలన్నింటికీ బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా (బీసీఐ) గుర్తింపు ఉందన్నారు. రాష్ట్రంలో గుర్తింపు లేకుండా లా కాలేజీల్లేవని చెప్పారు.
64 ఏండ్ల అభ్యర్థి దరఖాస్తు
లా కోర్సుకు భారీగా డిమాండ్‌ ఉందని లింబాద్రి, రవీందర్‌ అన్నారు. ఎల్‌ఎల్‌ఎం కోర్సులో చేరేందుకు 64 ఏండ్ల అభ్యర్థి దరఖాస్తు చేశారని వివరించారు. దీనికి 16 నుంచి 22 ఏండ్ల వారు 126 మంది దరఖాస్తు చేస్తే, 120 మంది, 23 నుంచి 30 ఏండ్ల వారు 1,365 మంది దరఖాస్తు చేయగా, 1,175 మంది, 31 నుంచి 40 ఏండ్ల వారు 1,100 మంది దరఖాస్తు చేస్తే, 878 మంది, 41 నుంచి 50 ఏండ్ల వారు 530 మంది దరఖాస్తు చేయగా, 422 మంది, 51 నుంచి 60 ఏండ్ల వారు 151 మంది దరఖాస్తు చేస్తే, 116 మంది, 60 ఏండ్లు పైబడిన వారు 77 మంది దరఖాస్తు చేయగా, 65 మంది ఉత్తీర్ణత పొందారని వివరించారు. ఎల్‌ఎల్‌బీ మూడేండ్ల కోర్సుకు సంబంధించి 1961లో పుట్టినతేదీ వ్యక్తి (62 ఏండ్ల) దరఖాస్తు చేశారని అన్నారు. దీనికి 16 నుంచి 22 ఏండ్ల వరకు 3,380 మంది దరఖాస్తు చేస్తే, 2,225 మంది, 23 నుంచి 30 ఏండ్ల వారు 12,689 మంది దరఖాస్తు చేయగా, 8,421 మంది, 31 నుంచి 40 ఏండ్ల వరకు 11,239 మంది దరఖాస్తు చేస్తే, 7,013 మంది, 41 నుంచి 50 ఏండ్ల వరకు 3,243 మంది దరఖాస్తు చేయగా, 1,999 మంది, 51 నుంచి 60 ఏండ్ల వరకు 691 మంది దరఖాస్తు చేస్తే, 427 మంది, 60 ఏండ్లకుపైగా 243 మంది దరఖాస్తు చేయగా, 149 మంది ఉత్తీర్ణత సాధించారని చెప్పారు. ఐదేండ్ల లా కోర్సుకు 16 నుంచి 22 ఏండ్ల వారు 5,566 మంది దరఖాస్తు చేస్తే, 3,767 మంది, 23 నుంచి 30 ఏండ్ల వారు 1,958 మంది దరఖాస్తు చేయగా, 1,338 మంది, 31 నుంచి 40 ఏండ్ల వారు 985 మంది దరఖాస్తు చేస్తే, 685 మంది, 41 నుంచి 50 ఏండ్ల వారు 264 మంది దరఖాస్తు చేయగా, 187 మంది, 51 నుంచి 60 ఏండ్ల వారు 71 మంది దరఖాస్తు చేస్తే 53 మంది, 60 ఏండ్లు పైబడిన వారు 14 మంది దరఖాస్తు చేయగా, తొమ్మిది మంది ఉత్తీర్ణులయ్యారని వివరించారు. ఈ కార్యక్రమంలో ఉన్నత విద్యామండలి కార్యదర్శి ఎన్‌ శ్రీనివాసరావు, లాసెట్‌ కన్వీనర్‌ బి విజయలక్ష్మి, మాజీ కన్వీనర్‌ జిబి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

లాసెట్‌ ఫలితాల వివరాలు

దరఖాస్తు    హాజరు     ఉత్తీర్ణత    శాతం
అబ్బాయిలు  31,022     25,586  20,930  81.80
అమ్మాయిలు 12,667   10,629  8,117     76.37
ట్రాన్స్‌జెండర్లు 3                3             2     66.67
మొత్తం      43,692      36,218  29,049  80.21
లా కోర్సుల వారీగా ఉత్తీర్ణత వివరాలు
కోర్సు   దరఖాస్తు    హాజరు      ఉత్తీర్ణత     శాతం
ల్‌ఎల్‌బీ
3 ఏండ్లు       31,485     25,747   20,234  78.59
ఎల్‌ఎల్‌బీ
5 ఏండ్లు      8,858        7,529      6,039   80.21
ఎల్‌ఎల్‌ఎం 3,349  2,942     2,776   94.36
మొత్తం 43,692    36,218    29,049  80.21