3: ఆగస్టు 16, 17 తేదీల్లో చంద్రయాన్-3లో కీలక ఘట్టాలు

నవతెలంగాణ – హైదరాబాద్: భారత్ ప్రయోగించిన చంద్రయాన్-3 ఇప్పటివరకు సజావుగానే సాగుతోంది. ఇవాళ చంద్రుడి ఉపరితలాన్ని మరింత సమీపించేలా చంద్రయాన్-3 కక్ష్యను 174 కి.మీ × 1437 కి.మీ మేర తగ్గించారు. ఈ మేరకు నిర్వహించిన మూడో దశ సాంకేతిక ప్రక్రియ విజయవంతమైంది.  సోమవారం నాడు చంద్రయాన్-3 పరిభ్రమించే ఎత్తును కూడా గణనీయంగా తగ్గించడం తెలిసిందే. జాబిల్లి కక్ష్యలోని ఈ స్పేస్ క్రాఫ్ట్ ను 14 వేల కి.మీ ఎత్తు నుంచి 4,313 కి.మీ ఎత్తుకు తీసుకువచ్చారు. ఆగస్టు 14న కూడా కక్ష్యను కుదించే ప్రక్రియ నిర్వహించనున్నట్టు ఇస్రో వెల్లడించింది. ఇక, ఆగస్టు 16న చంద్రయాన్-3లో కీలక ఘట్టం చోటు చేసుకోనుంది. చంద్రయాన్-3 100 కిలోమీటర్ల వృత్తాకార కక్ష్యలోకి ప్రవేశించనుంది. ఆగస్టు 17న విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ లతో కూడిన ల్యాండింగ్ మాడ్యూల్ ప్రొపల్షన్ మాడ్యూల్ నుంచి విడిపోనుంది.