– వారంతా ముందుకొచ్చి పోరాడాలి
– మామ, అల్లుళ్లు కలిసే దుబ్బాకను దోచుకుండ్రు
– బీఆర్‌ఎస్ పార్టీని పాతర వేయాలి
– ఈటల రాజేందర్ తట్టెడు మట్టి పోసాడా: ఎన్నికల సభల్లో రేవంత్‌రెడ్డి
నవతెలంగాణ దుబ్బాక/దుబ్బాక రూరల్/ జమ్మికుంట/ ముషీరాబాద్
ముప్పై లక్షల మంది నిరుద్యోగులు ఈ కురుక్షేత్రంలో ముందు ఉన్నారని, వారంతా కలిసి కేసీఆర్ ప్రభుత్వాన్ని బొంద పెట్టాలని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డి పిలుపిచ్చారు. కేసీఆర్ బక్కొడు కాదు.. బకాసురుడని, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఈ పదేండ్లలో సీఎం కేసీఆర్ అవినీతి అక్రమాలతో సంపాదించుకున్న వెయ్యి కోట్ల రూపాయలను జైల్‌లో వేసి కక్కిస్తామని తెలిపారు. చెర్లపల్లి జైలులోనే కేసీఆర్‌కు డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు కట్టిస్తామని, ఆయనతోపాటు కేటీఆర్, కవిత, హరీశ్‌రావు లకు చోటు ఉంటుందని జోస్యం చెప్పారు. గురువారం సిద్దిపేట జిల్లా దుబ్బాక, కరీంనగర్ జిల్లా హుజూరాబాద్, హైదరాబాద్‌లోని ముషీరాబాద్ నియోజకవర్గాల్లో జరిగిన కాంగ్రెస్ ఎన్నికల ప్రచార సభల్లో రేవంత్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. దుబ్బాక అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి నేటి తెలంగాణ వరకు ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలోనే దుబ్బాకకు రావాల్సిన నిధులు సిద్దిపేటకు తీసుకువెళ్తున్నప్పుడు ముత్యంరెడ్డి హయాంలోనే తిరిగి దుబ్బాకకు నిధులు సమకూర్చి ఈ ప్రాంతాన్ని అభివద్ధి చేశాడని గుర్తుచేశారు. బీజేపీ, బీఆర్‌ఎస్ తామంటే తాము చేశామని చెప్పుకుంటూ నేడు దుబ్బాక ప్రజల ఓట్ల కోసం ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారని అన్నారు. ఈ ఎన్నికల్లో కేసీఆర్‌ను బోంద పెడితే రూ.4000 పింఛన్ ఇస్తామన్నారు. పదేండ్లలో కేసీఆర్ ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని, పైగా వెయ్యి ఎకరాల్లో ఫామ్‌హౌజ్, పంజాగుట్టలో 15 వందల ఇండ్లు కట్టుకున్నాడని ఆరోపించారు. మల్లన్న సాగర్ బాధితులు, ఈ ప్రాంత రైతుల సమస్యల మీద సుప్రీంకోర్టు వరకు వెళ్లి కోట్లాడింది కాంగ్రెస్ పార్టీ అని గుర్తుచేశారు. దుబ్బాకను రెవెన్యూ డివిజన్ చేస్తామని, పీజీ కాలేజీ, చేనేత కార్మికులకు పవర్ లూమ్స్ తీసుకొస్తామని, కేసీఆర్ చదివిన కామారెడ్డిలో చేనేత కార్మికుడికి ఇల్లు కూడా ఇవ్వలేదని అన్నారు.
ఈటల రాజేందర్ తట్టెడు మట్టి పోసాడా
కరీంనగర్ జిల్లా జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో నిర్వహించిన సభలో రేవంత్ మాట్లాడుతూ.. హుజూరాబాద్ గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయాలని తనతో పాటు కోదండరామ్, బల్మూరు వెంకట్ వచ్చారని చెప్పారు. ఇవి ఆశామాషీ ఎన్నికలు కాదని.. రాజరికపు పాలన ఉండాలా వద్దా అనే అంశాన్ని తెల్చనున్న ఎన్నికలని తెలిపారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా అంటే దేశ మాజీ ప్రధాని పీవీ జిల్లా అని గుర్తుచేసుకున్నారు. దొంగ ఏడ్పు ఏడ్చి గెలిచిన ఈటల రాజేందర్.. కేంద్ర ప్రభుత్వం నుంచి ఏమైనా నిధులు తెచ్చారా అని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్, బీజేపీ దొందు దొందేనని ఆరోపించారు. ఈటల రాజేందర్ ఉప ఎన్నికల్లో గెలిచిన తర్వాత తట్టెడు మట్టి కూడా పోయలేదని విమర్శించారు. ఏడుసార్లు ఈటలను గెలిపించినా హుజురాబాద్ వద్దనుకొని, గజ్వేల్‌కు పోయిండని అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వంలో అంజన్ కీలక పాత్ర
హైదరాబాద్ ముషీరాబాద్‌లోని కవాడిగూడ డివిజన్ కట్ట మైసమ్మ దేవాలయం వద్ద నుంచి గాంధీనగర్, బోలక్‌పూర్, సాగర్ లాల్ హాస్పిటల్, ఫిష్ మార్కెట్, రాంనగర్ చౌరస్తా వరకు వర్షాన్ని సైతం లెక్కచేయకుండా రేవంత్ రోడ్‌షో నిర్వహించారు. అనంతరం రామ్‌నగర్ చౌరస్తా వద్ద ఆయన మాట్లాడుతూ.. ముషీరాబాద్ నియోజకవర్గంలో ప్రజలకు ఏ కష్టం వచ్చినా ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ అండగా ఉండే వ్యక్తి అంజన్ కుమార్ యాదవ్ అని అన్నారు. కాంగ్రెస్‌ను ఆశీర్వదించేందుకు ముషీరాబాద్ ప్రజలే కాదు. వరుణ దేవుడు కూడా వచ్చాడు అని తెలిపారు. రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆయన కీలకపాత్ర పోషిస్తారని హామీ ఇచ్చారు.