– డబ్ల్యూహెచ్‌ఓ నివేదిక
జెనీవా : గత కొన్ని సంవత్సరాలుగా నీటి ప్రమాదాల వల్ల మరణాలు ఎక్కువగానే సంభవిస్తున్నాయి. నీట మునిగి మృతి చెందారనే వార్తలు తరచూ వింటూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో ఒక్క 2021 సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా మూడు లక్షలమంది నీటిలో మునిగి చనిపోయినట్లు తాజాగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూహెచ్‌ఓ)నివేదిక తెలిపింది. ఈ లెక్కల్నిబట్టి చూస్తే.. బహుశా ప్రతి గంటకు 30 మంది నీటి ప్రమాదాల వల్ల చనిపోయారని డబ్ల్యూహెచ్‌ఓ అంచనా వేసింది. ఈ మేరకు శుక్రవారం (డిసెంబర్ 13) డబ్ల్యుహెచ్‌ఓ విడుదల చేసిన నివేదిక వెల్లడించింది. ప్రత్యేకించి తక్కువ ఆదాయం, మధ్యస్థ ఆదాయం గల దేశాల్లో ఈ ప్రమాదాలు 92 శాతం సంభవించాయని ఈ నివేదిక స్పష్టం చేసింది. ఇక 2021లో ఆగేయాసియా దేశాల్లో (భారత్‌తో సహా)83 వేల మరణాలు సంభవించాయి. ఇవి మొత్తం మరణాలలో 28 శాతంగా ఉందని ఈ నివేదిక పేర్కొంది.
శుక్రవారం జెనీవాలో జరిగిన సమావేశంలో డబ్ల్యూహెచ్‌ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయసస్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ నివేదికపై మాట్లాడారు. నీటి ప్రమాదాలపై దేశాలు అవగాహన పెంచుకోవడానికి, నివారణ వ్యూహాలకు సంబంధించి మార్గనిర్దేశం చేయడానికి, నీటి ప్రమాదాల కేసుల్ని ట్రాక్ చేయడానికి ఈ నివేదిక ఉపయోగపడుతుందని ఆంధోమ్ అన్నారు.
2000 సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా భారత్‌తో సహా 139 దేశాల్లో నీటి ప్రమాదాలతో చనిపోయేవారి శాతం 38 శాతం తగ్గింది. 2000 కంటే.. 2021లో అంటే గడచిన ఇరవై ఏండ్లలో ఈ మరణాల నివారింపులో పురోగతి ఉన్నప్పటికీ.. వివిధ దేశాల మధ్య అసమానత ఉంది. యూరోపియన్ దేశాల్లో ఈ ప్రమాదాల్లో మరణించే వారి శాతం 68 శాతం, ఆగేయాసియా దేశాల్లో 48 శాతం తగ్గినట్టు నివేదిక తెలిపింది.
ముఖ్యంగా చిన్నారులు, యువతే ఈ ప్రమాదాల్లో ఎక్కువగా చనిపోతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయసున్న చిన్నారుల మరణాల శాతం దాదాపు 24 శాతం ఉంది. ఇక 5-14 సంవత్సరాల మధ్య వయసులో గలవారు 19 శతం, టీనేజ్ అండ్ యూత్ 15-29 మధ్య వయసుగలవారు 14 శాతంగా ఉంది. భారత్‌లో 26 శాతం (30-44 మధ్య వయసు), 25 శాతం (18-29 వయసు), 17 శాతం (45-59 వయసు), 12 శాతం (0-13 వయసు), 10 శాతం (14-17), 10 శాతం (60 ఏండ్లకు పైబడినవారు)గా ఉంది.