317 జీవో బాధితులకు సత్వరమే న్యాయం చేయాలి

– మంత్రి దామోదర రాజనర్సింహకు టీఎస్‌యూటీఎఫ్‌ వినతి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో 317 జీవో బాధిత ఉద్యోగులు, ఉపాధ్యాయులందరికీ సత్వరమే న్యాయం చేయాలని టీఎస్‌యూటీఎఫ్‌ రాష్ట్ర కమిటీ డిమాండ్‌ చేసింది. 317 జీవో మంత్రివర్గ ఉపసంఘం చైర్మెన్‌, మంత్రి దామోదర రాజనర్సింహ కార్యాలయంలో, సాధారణ పరిపాలన శాఖ ముఖ్యకార్యదర్శి బెన్హర్‌ మహేష్‌ దత్‌ ఎక్కాను మంగళవారం హైదరాబాద్‌లో ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కె జంగయ్య, ప్రధాన కార్యదర్శి చావ రవి కలిసి వినతిపత్రం సమర్పించారు. క్యాడర్‌లో జూనియర్‌ అయిన కారణంగా స్థానికేతర మల్టీజోన్‌/జోన్‌/జిల్లాకు కేటాయించిన ఉపాధ్యాయులు, ఉద్యోగులను వారి మొదటి ఆప్షన్‌ న్రపకారం స్థానిక మల్టీజోన్‌/జోన్‌/జిల్లాకు బదిలీ చేయాలని డిమాండ్‌ చేశారు. ఖాళీలు అందుబాటులో లేకుంటే సూపర్‌ న్యూమరరీ పోస్టులను సృష్టించి ఉద్యోగ విరమణ లేదా పదోన్నతుల కారణంగా ఏర్పడే ఖాళీల్లో దశలవారీగా సర్దుబాటు చేయాలని సూచించారు. నూతన జిల్లాలు ఏర్పడిన తర్వాత ఉమ్మడి జిల్లా ప్రాతిప్రతిదికన నిర్వహించిన టీఆర్టీ- 2017లో ఎంపికైన స్థానికేతర జిల్లాల్లో నియామకమైన ఉపాధ్యాయులను వారి ఆప్షన్‌ మేరకు స్థానిక జిల్లాకు బదిలీ చేయాలని కోరారు. స్థానికేతర జిల్లాల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు ఎవరైనా డీఎస్సీ-2024 ద్వారా స్థానిక జిల్లాలో అదే కేటగిరీ లేదా మరో కేటగిరీ పోస్టులో ఉపాధ్యాయులుగా ఎంపికైతే వారికి సర్వీస్‌ ప్రొటెక్షన్‌, పే ప్రొటెక్షన్‌ కల్పించడం ద్వారా కొందరికి న్యాయం చేయొచ్చని వివరించారు. 317 జీవో అమలు కారణంగా ఇతర మల్టీజోన్‌/జోన్‌/జిల్లాకు కేటాయించిన ఉద్యోగులకు మానవతాదృష్టితో పూర్తి సర్వీసును పరిగణనలోకి తీసుకుని మొదటి ఆప్షన్‌ ఇచ్చిన జిల్లాకు కేటాయించాలని తెలిపారు. కారుణ్య నియామకం పొందిన వితంతువులకు మాత్రమే గత కేటాయింపులో ప్రాధాన్యత ఇచ్చారనీ, ఈ వివక్ష సమంజసం కాదని పేర్కొన్నారు. వితంతువులైన మహిళా ఉద్యోగులందరికీ వారి ఆప్షన్‌ ప్రకారం కోరుకున్న మల్టీజోన్‌/జోన్‌/జిల్లాకు బదిలీ చేయాలని కోరారు. వైకల్యం 40 శాతం పైబడిన విభిన్న ప్రతిభావంతుల (వికలాంగుల)కు హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం ప్రాధాన్యత కల్పించి వారి ఆప్షన్‌ ప్రకారం కోరుకున్న మల్టీజోన్‌/జోన్‌/జిల్లాకు కేటాయించాలని సూచించారు. దంపతులైన ఉద్యోగులందరినీ వారి ఆప్షన్‌ ప్రకారం ఒకే మల్టీజోన్‌/ జోన్‌/ జిల్లాకు బదిలీ చేయాలని విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వ, ప్రభుత్వరంగ సంస్థల ఉద్యోగ దంపతులను కూడా పరిగణనలోకి తీసుకోవాలని తెలిపారు. ఉపాధ్యాయుల్లో 19 జిల్లాల స్పౌజ్‌లకు బదిలీలు నిర్వహించారనీ, మిగిలిన 13 జిల్లాల స్పౌజ్‌లలో 647 మంది స్కూల్‌ అసిస్టెంట్లకు బదిలీలు చేశారని వివరించారు. ఇంకా 1,500 మంది మాత్రమే వేర్వేరు మల్టీజోన్‌/ జోన్‌/ జిల్లాల్లో మిగిలిపోయారని పేర్కొన్నారు. వారందరినీ ఆప్షన్‌ ప్రకారం ఒకే మల్టీజోన్‌/జోన్‌/జిల్లాకు బదిలీ చేయాలని కోరారు.