317 జీవో బాధిత ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి

– విద్యాశాఖ ముఖ్యకార్యదర్శికి తపస్‌ వినతి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో 317 జీవో బాధిత ఉపాధ్యాయుల సమస్యలను తక్షణమే పరిష్కరించి వారికి న్యాయం చేయాలని తపస్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది.ఈ మేరకు విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశాన్ని సోమవారం హైదరాబాద్‌లోని సచివాలయంలో ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు హన్మంతరావు, ప్రధాన కార్యదర్శి నవాత్‌ సురేష్‌ కలిసి వినతిపత్రం సమర్పించారు. డీఎస్సీ నియామకాల కంటే ముందే 317 జీవో బాధితులకు బదిలీలు చేపట్టాలని కోరారు. క్యాబినెట్‌ సబ్‌కమిటీ దీనిపై ఆలోచన చేస్తున్నదనీ, త్వరలో పరిష్కారం చూపుతామని ఆయన హామీ ఇచ్చారని తెలిపారు.గెజిటెడ్‌ హెడ్మాస్టర్‌ పదోన్నతులకు సంబంధించి ఈనెల ఒకటి నుంచి ప్యానల్‌ ఇయర్‌గా ప్రకటించిన పదోన్నతులను కల్పిస్తామంటూ వివరించారని పేర్కొన్నారు.ప్రతినెలా పదోన్నతులు ఇస్తే బాగుంటుందనీ, గతంలో ఇచ్చారంటూ గుర్తు చేశామని తెలిపారు. ప్రతినెలా కాకుండా ఏడాదికి రెండుసార్లు ఇచ్చేలా ఆలోచన చేస్తామన్నారని వివరించారు. బదిలీ అయి రిలీవ్‌ కాకుండా ఉన్న ఉపాధ్యాయులను సర్దుబాటు కంటే ముందే రిలీవ్‌ చేయాలని కోరారు.నూతన విద్యావిధానం-2020ని రాష్ట్రంలో అమలు చేసి ఎన్‌సీఈఆర్టీ పాఠ్యాంశాలను బోధించే విధంగా చూడాలని సూచించారు.