తెలంగాణకు ఆత్మవంటి
స్థానికతకు స్థానం లేకుండా చేసి
పైనున్నోళ్లం కిందున్నోళ్లని
తొక్కి మరింత పైకిపోవాలని
ఇతరుల స్థానాలను, అవకాశాలను
కొల్లగొట్టడానికి కోటి విద్యలు ప్రదర్శించి
దోచుకోవడానికి దారులు కనిపెట్టిన
మానవతామూర్తులెందరో?
ప్రాణమైన…ఆత్మాభిమానమైన..
జీతమైనా..జీవితమైనా..కష్టార్జితమైన..
సర్వస్వం త్యాగం చేయడమేనా?
కొందరిని రక్షించి.. ఎందరినో శిక్షించే…
అవకాశవాదపు అంచులను తాకే…
ఈనీతి న్యాయాన్ని కనిపెట్టి
‘స్థానికత’ ఆత్మ గౌరవాన్ని ఫణంగా పెట్టి
అంగట్లో సరుకుగా చేసి..
ఏం పందెం కాస్తావు? నీ సర్వీసునా..
నీ ఆరోగ్యాన్నా..నీ కుటుంబాన్నా..
అనే స్థాయికి దిగజార్చిన
మహానుభావులెవ్వరో?
నా జిల్లాకు నేను, నా కుటుంబానికి నేను
అనే పోటీలో నిలబడ్డ ఓ బాధితుడా…
ఈ కృత్రిమ మార్కెట్‌కు సూత్రధారెవరు?
ఈ డిమాండ్‌కు పాత్రధారెవరు?
ప్రశ్నించే తీరిక.. కొట్లాడి వేచి చూసే ఓపిక లేని
ఓ సగటు ఉద్యోగి..నీ బాధ తీరేదెన్నడు?
ఆపన్న ‘హస్తమై.’ ఆత్మీయ నేస్తమై..
అధికారంలో కొలువుదీరిన మరుక్షణమే
నీ కష్టాలను కడతేరుస్తామన్న ప్రజా ప్రభుత్వం
చోద్యం చూస్తున్న వేళ
నీ మనోవేదన వినేదెవరు?
నీ ఆక్రందన పట్టించుకునేదెవరు?
జరిగిన అన్యాయాన్ని రూపుమాపుతామని
స్వాంతన చేకూర్చేదెవరు?
బాధితునికి బాసటగా నిలిచి
స్థానికత బాధను తీర్చేదెవరు?
(చీకటి జీవో 317కు మూడేండ్లు నిండిన సందర్భంగా)
– చెలుమల్ల ఇంద్రరేఖ,
9948015339