
సీఐటీయూ జిల్లా కార్యదర్శి నూర్జహాన్ డిమాండ్
నవతెలంగాణ – కంటేశ్వర్
మహిళలకు చట్ట సభల్లో 33% రిజర్వేషన్లను వెంటనే అమలు చేయాలి అని, శ్రమను గుర్తించి మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించాలి అని, సీఐటీయూ జిల్లా కార్యదర్శి నూర్జహాన్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఐటీయూ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమం స్వర్ణ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి నూర్జహాన్ మాట్లాడుతూ.. కేంద్ర బీజేపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్నది. కార్పొరేట్ సంస్థల ప్రయోజనాల కోసం మతోన్మాద విధానాలను వేగవంతం చేసింది. శ్రమను శ్రమ చేసే మహిళలను గౌరవించడం లేదు. మహిళా హక్కులు మానవ హక్కుల్లో భాగమే, కానీ బీజేపీ ప్రభుత్వం మహిళల హక్కులను హరిస్తున్నది. పోరాడి సాధించుకున్న శ్రామిక మహిళల చట్టాలను రద్దు చేసి పారిశ్రామికవేత్తల లాభాల కోసం 4 లేబర్ కోడ్లను తెచ్చింది. దేశవ్యాప్తంగా మహిళలు, పిల్లలపై అత్యాచారాలు, హింసలు బాగా పెరిగాయి. మహిళలకు సమాన హక్కులు, శ్రమకు గుర్తింపు, సమాన పనికి సమాన వేతనాలు, మహిళలపై అత్యాచారాలు, హింసను అరికట్టడం, నేరస్థులకు కఠిన శిక్షలు, చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్ల అమలు, మహిళలు పెద్ద సంఖ్యలో నిరుద్యోగంతో బాధపడటం లాంటి ప్రధాన సమస్యలను పరిష్కరించడంలో బిజెపి ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది.వంద సంవత్సరాల క్రితం 8 గంటల పని, సమాన పనికి సమాన వేతనం, ఓటు హక్కు తదితర డిమాండ్ల కోసం |శ్రామిక మహిళలు సాగించిన పోరాట స్ఫూర్తికి చిహ్నంగా అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవం మహిళలు చేస్తున్న జీతభత్యం లేని శ్రమ విలువ దేశ స్థూల జాతీయోత్పత్తిలో 3.1 శాతం ఉంది. జాతీయ స్థూల ఉత్పత్తిలో ప్రధాన పాత్ర పోషిస్తున్న మహిళల కనీస అవసరాలను కూడా ప్రభుత్వాలు తీర్చడం లేదు. ఇన్ని బాధ్యతలు మోయవలసి రావటంతో వారి సమయం, శక్తి మొత్తం ఈ వేతనం లేని శ్రమకే వెచ్చిస్తున్నారు. ఇటువంటి వేతనం లేని సంరక్షణ పనులు కోసం పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు రోజులో 5 గంటలకు పైగా వెచ్చిస్తున్నారు. వీటన్నిటితో పాటు పని ప్రదేశాలలో శ్రామిక మహిళలు వేతనాలు, సర్వీసు కండీషన్లు, గౌరవం, పదోన్నతుల విషయంలో తీవ్ర వివక్షకు, అవమానాలకు గురౌవుతున్నారు.దేశంలో మహిళలు అభద్రతతో బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు. మతోన్మాద మనువాదులు మహిళలపై హత్యలు, అత్యాచారాలతో చలరేగిపోతున్నారు. మహిళలు సంఘటితమై ప్రతిఘటించడం తప్ప దీనికి మరొక పరిష్కారం లేదు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ స్ఫూర్తితో మహిళలను చైతన్యపరుద్దాం- పోరాటాలను ఉధృతం చేద్దాం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మహిళా వ్యతిరేక విధానాలను ఐక్యంగా ప్రతిఘటిద్దాం. సమానత్వం, శ్రమకు తగిన గుర్తింపును సాధించుకుందాం.. ఈ కార్యక్రమంలో సీనియర్లను అంగన్వాడీ టీచర్లకు ఆయాలకు ఆశలకు జి ఎన్ ఏం లాను సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షులు శంకర్ గౌడ్, సిఐటియు జిల్లా కోశాధికారి స్వర్ సూర్య కళ, రేణుక, సుకన్య లలిత, హైమావతి సాహేరా, రేవతి, వాణి , సందీప, సరిత, రాజ్యలక్ష్మి, సల్మా తదితరులు పాల్గొన్నారు.