ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధికి రూ.340కోట్లు..

340 crores for the development of Adilabad town.నవతెలంగాణ – ఆదిలాబాద్ టౌన్
ఆదిలాబాద్ పట్టణాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఎంపిక చేసుకోని అమృత్ పథకం కింద తాగు నీరు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం కోసం రూ.340 కోట్లు ఇచ్చారని ఎంపీ గోడం నగేష్ అన్నారు. బుధవారం పట్టణంలోని టీచర్స్ కాలనీలో రూ.1 కోటి 20 లక్షల రూపాయలు టీఐఎఫ్ఎసీ నిధులతో నిర్మించే సీసీ రోడ్డు, డ్రైనేజీ పనులకు ఎమ్మెల్యే పాయల శంకర్ తో కలిసి శంఖుస్థాపన చేశారు. కాలనీకి వచ్చిన ఎంపీ, ఎమ్మెల్యేలను కౌన్సిలర్ కృష్ణయాదవ్ తో పాటు కాలనీవాసులు శాలువతో సత్కరించారు. ఈ సందర్భంగా ఎంపీ గోడం నగేష్ మాట్లాడుతూ… పెరుగుతున్న జనాభా, ప్రాంతాలకు అనుగుణంగా ఆదిలాబాద్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కూడా సహకారం అందిస్తుందన్నారు. అమృత్ పథకంలో ఎంపిక చేసి స్వచ్ఛమైన తాగు నీరు అందించడంతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థకు నిధులు వెచ్చించి పనులు చేపట్టిందని గుర్తు చేశారు. గత ప్రభుత్వం ప్రారంభించిన పనులు పెండింగ్లో ఉన్న వాటిని గుర్తించి ఒక్కొక్కటిగా ఎమ్మెల్యే సహకారంతో ప్రభుత్వానికి విన్నవించి పూర్తి చేసేల కృషి చేస్తున్నామన్నారు.
జిల్లా అభివృద్ధికి కృషి..
ఎమ్మెల్యే పాయల శంకర్ మాట్లాడుతూ..15 సంవత్సరాల నుండి టీచర్స్ కాలనీ వాసులు రోడ్డు సౌకర్యం కోసం ఎంతో కష్టపడ్డారన్నారు. వారి కల నేరబోతుందన్నారు. అధికారులు కూడా పనులను త్వరతగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. గ్రేడ్ వన్ మున్సిపాలిటిగా మారిన ఆదిలాబాద్ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేల తనవంతుగా కృషి చేస్తానన్నారు. ఇంకా రూ.40 కోట్ల కోసం ప్రతిపాధనాలు పంపించడం జరిగిందని, అవి వచ్చిన తరువాత మిగిత కాలనీల్లో కూడా పనులు చేపడుతామని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే అటూ 170 కాలనీలో రూ.1 కోటి 60 లక్షల రూపాయలతో నిర్మించనున్న బీటీ రోడ్డు, సీసీ డ్రైనేజీ నిర్మాణ పనులకు ఎంపీ గోడం నగేష్, ఎమ్మెల్యే పాయల శంకర్ భూమిపూజ చేశారు. కాలనీకి వచ్చిన అథితులను పుర్ణకుంభంతో స్వాగతం పలికారు. ముందుగా పొచ్చమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో సుభాష్ నగర్ కౌన్సిలర్ల లక్ష్మణ్, నాయకులు ముకుంద్, లాలామున్న, రవి, కౌన్సిలర్ పవన్ నాయక్, జోగు రవి, సోమ రవి, స్వామి రెడ్డి, అడెల్లు, దొంతులవార్ రమేష్  పాల్గొన్నారు.