– రక్షించిన ఉన్నతాధికారులు
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
భారీ వర్షాల్లో తడుస్తూ, వరదల్లో చిక్కుకున్న 35 మంది గ్రేహౌండ్స్ కమాండోలను పోలీసు ఉన్నతాధికారులు రక్షించిన సంఘటన రాష్ట్ర సరిహద్దులో చోటు చేసుకున్నది. ఇటీవలన రాష్ట్ర సరిహద్దుల్లోని ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన మావోయిస్టులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న రాష్ట్ర గ్రేహౌండ్స్ బృందం తిరుగు ప్రయాణమైంది. రాష్ట్ర సరిహద్దులు దాటి నడుచుకుంటూ వస్తున్న 35 మందితో కూడిన గ్రేహౌండ్స్ కమాండో బృందం సరిహద్దుల్లో హెలీప్యాడ్ వద్ద ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులో చిక్కుకుంది. అప్పటికే ఐదు రోజులగా వర్షంలో తడుస్తూ కాలి పాదాలకు తీవ్రమైన బొబ్బలు రావటంతో అతి కష్టం మీద వాగు దాటటానికి ప్రయత్నిస్తున్న కమాండోలకు వరద ఉధృతి కారణంగా అందులో కొట్టుకుపోయే పరిస్థితి ఏర్పడింది. ఈ విషయమై సమాచారమందుకున్న గ్రేహౌండ్స్ ఉన్నతాధికారులు వెంటనే హెలికాప్టర్ ద్వారా రెస్క్యూ టీమ్‌ను ఆ వాగు వద్దకు పంపించారు. ఆ వాగులో చిక్కుకున్న ఒక్కొక్కరిని జాగ్రత్తగా హెలికాప్టర్‌లోకి రెస్క్యూ టీమ్ చేర్చింది. అప్పటికే తీవ్రమైన జ్వరాలతో బాధపడుతున్న గ్రేహౌండ్స్ బృందాన్ని ఏటూరునాగారంలోని ముసునూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి అధికారులు తరలించారు. వారి ఆరోగ్య పరిస్థితి బాగానే ఉన్నదని అధికారులు తెలిపారు.