– బెంగళూర్ టెస్టులో న్యూజిలాండ్ గెలుపు
– 1988 తర్వాత భారత్‌లో తొలి టెస్టు విక్టరీ
– సొంతగడ్డపై టీమ్ ఇండియాకు భంగపాటు
బెంగళూర్‌కు భారత్‌కు భంగపాటు ఎదురైంది. చిన్నస్వామిలో న్యూజిలాండ్ 36 ఏండ్ల నిరీక్షణకు తెరపడింది. వర్షం ప్రభావిత పరిస్థితుల్లో పేస్‌ను అనుకూలించిన పిచ్‌పై కివీస్ ఖతర్నాక్ విజయం సాధించింది. 8 వికెట్ల తేడాతో తొలి టెస్టులో భారత్‌పై ఘన విజయం సాధించింది. 1988 తర్వాత భారత్‌లో న్యూజిలాండ్‌కు దక్కిన తొలి టెస్టు విజయం ఇదే.
కివీస్ లక్ష్యం 107 పరుగులు. పేస్ దళపతి బుమ్రా ప్రతి బంతికి వికెట్ పడగొట్టే ఒత్తిడి సృష్టించినా.. అభిమానులు ప్రతి బంతికి వికెట్ కోసం అప్పీల్ చేసినా.. అసమాన ఒత్తిడిని న్యూజిలాండ్ అధిగమించింది. రచిన్ రవీంద్ర (39 నాటౌట్), విల్ యంగ్ (48 నాటౌట్) రాణించటంతో మూడు మ్యాచుల టెస్టు సిరీస్‌లో న్యూజిలాండ్ 1-0 ఆధిక్యం సాధించింది.
నవతెలంగాణ-బెంగళూర్
తొలి టెస్టులో న్యూజిలాండ్ ఘన విజయం సాధించింది. 107 పరుగుల ఊరించే లక్ష్యాన్ని 27.4 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. రచిన్ రవీంద్ర (39 నాటౌట్, 46 బంతుల్లో 6 ఫోర్లు), విల్ యంగ్ (48 నాటౌట్, 76 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్) ఒత్తిడిలో కీలక ఇన్నింగ్స్‌లతో న్యూజిలాండ్‌ను గెలుపు తీరాలకు చేర్చారు. ఉదయం సెషన్లో జశ్‌ప్రీత్ బుమ్రా పేస్‌తో నిప్పులు చెరిగినా.. సొంతగడ్డపై భారత్‌కు అనూహ్య పరాభవం తప్పలేదు. తొలి ఇన్నింగ్స్‌లో శతకం సహా ఛేదనలో సూపర్ ఇన్నింగ్స్‌తో మెరిసిన భారత సంతతి కివీస్ ఆటగాడు రచిన్ రవీంద్ర ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు అందుకున్నాడు. మూడు మ్యాచుల టెస్టు సిరీస్‌లో న్యూజిలాండ్ 1-0తో ముందంజ వేసింది. భారత్, న్యూజిలాండ్ రెండో టెస్టు ఈ నెల 24 నుంచి పుణె వేదికగా జరుగనుంది.
బుమ్రా మెరిసినా..
పిచ్‌ను సరిగా అర్థం చేసుకోకపోవటం, తుది జట్టు ఎంపికలో వ్యూహాత్మక తప్పిదం భారత్‌ను మరోసారి వెంటాడింది. ఆఖరు రోజు ఆటలో ఉదయం సెషన్లో పిచ్ నుంచి సీమర్లకు గొప్ప సహకారం లభించింది. పేస్ దళపతి జశ్‌ప్రీత్ బుమ్రా కండ్లుచెదిరే బంతులు సంధించాడు. రెండో బంతికే న్యూజిలాండ్ కెప్టెన్ టామ్ లేథమ్ (0)ను అవుట్ చేసి భారత శిబిరంలో జోష్ తీసుకొచ్చాడు. మూడో పేసర్ లోటు భారత్‌కు ప్రతికూలంగా మారగా.. న్యూజిలాండ్ బ్యాటర్లకు ఒత్తిడిని ఆధిగమించేందుకు పనికొచ్చింది. బుమ్రా రెండు వికెట్లు పడగొట్టినా.. మరో ఎండ్‌లో సహకారం లభించలేదు. సిరాజ్ ఏడు ఓవర్లలో వికెట్ తీయలేకపోయాడు. స్పిన్నర్లు రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, రవిచంద్రన్ అశ్విన్‌లకు పిచ్ నుంచి సహకారం లభించలేదు.
రచిన్.. వారెవా
లక్ష్యం 107 పరుగులే అయినా.. న్యూజిలాండ్‌పై భారత్ ఒత్తిడి పెంచింది. అభిమానులు సైతం పరుగుల వేటను కష్టతరం చేశారు. అయినా, కివీస్ బ్యాటర్లు విల్ యంగ్ (48 నాటౌట్), రచిన్ రవీంద్ర (39 నాటౌట్) అదరగొట్టారు. యంగ్ ఏడు ఫోర్లు, ఓ సిక్సర్‌తో మెరువగా.. రచిన్ రవీంద్ర ఆరు బౌండరీలతో మెరిశాడు. ఒత్తిడిని అధిగమిస్తూ పరుగులు సాధించిన ఈ జోడీ.. ఛేదనను సులభతరం చేసుకుంది. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ బాదిన రచిన్ రవీంద్ర ఛేదనలోనూ అదే జోరు చూపించాడు. భారత బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు. 27.4 ఓవర్లలో 3.97 రన్‌రేట్‌తో పరుగులు చేసిన న్యూజిలాండ్ 8 వికెట్ల తేడాతో చారిత్రక విజయం నమోదు చేసింది. బెంగళూర్‌లో స్వదేశీ తరహా పరిస్థితులు ఎదురు కావటంతో న్యూజిలాండ్ విజయం సాధ్యపడింది. తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ను 46 పరుగులకు కుప్పకూల్చిన కివీస్.. ఛేదనలో ఒత్తిడి ఎదురైనా చిరస్మరణీయ విజయం అందుకుంది.
స్కోరు వివరాలు
భారత్ తొలి ఇన్నింగ్స్ : 46/10
న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ : 402/10
భారత్ రెండో ఇన్నింగ్స్ : 462/10
న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్ : టామ్ లేథమ్ (ఎల్బీ) జశ్‌ప్రీత్ బుమ్రా 0, డెవాన్ కాన్వే (ఎల్బీ) జశ్‌ప్రీత్ బుమ్రా 17, విల్ యంగ్ నాటౌట్ 48, రచిన్ రవీంద్ర నాటౌట్ 39, ఎక్స్‌ట్రాలు: 6, మొత్తం : (27.4 ఓవర్లలో 2 వికెట్లకు) 110.
వికెట్ల పతనం : 1-0, 2-35.
బౌలింగ్ : జశ్‌ప్రీత్ బుమ్రా 8-1-29-2, మహ్మద్ సిరాజ్ 7-3-16-0, రవీంద్ర జడేజా 7.4-1-28-0, కుల్దీప్ యాదవ్ 3-0-26-0, రవిచంద్రన్ అశ్విన్ 2-0-6-0.