ఏపీలో 39,008 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీ

–  కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి అన్నపూర్ణ దేవి
న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయ పోస్టుల ఖాళీలు ప్రతిఏడాదీ పెరుగుతున్నాయి. 2022-23లో రాష్ట్రంలో 39,008 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి అన్నపూర్ణ దేవి తెలిపారు. లోక్‌సభలో అడిగిన ఒక ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ఒకటో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకు 2022-23లో 39,008 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. 20021-22లో 38,191 ఉపాధ్యాయ పోస్టులు, 2020-21లో 22,609 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. దేశవ్యాప్తంగా 36 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 7,47,565 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని కేంద్ర మంత్రి తెలిపారు. తెలంగాణలో11,348, బీహార్‌లో 1,87,209, ఉత్తరప్రదేశ్‌లో 1,26,028, ఝార్ఖండ్‌లో 74,357, మధ్యప్రదేశ్‌లో 69,667, పశ్చిమ బెంగాల్‌లో 54,900 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని మంత్రి పేర్కొన్నారు.
జగన్‌ సర్కార్‌ అప్పు రూ.1,77,991 కోట్లు
నాలుగేండ్లలో రాష్ట్రంలోని వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం రూ.1,77,991 కోట్ల అప్పు చేసినట్లు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. లోక్‌సభలో ఎంపీ రఘురామ కృష్ణరాజు అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ఆర్థిక సంఘం సిఫారసులకు అనుగుణంగానే రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేసిందని తెలిపారు. 2019 మార్చి నాటికి ఆంధ్రప్రదేశ్‌ అప్పులు రూ.2,64,451 కోట్లు ఉండగా, ప్రస్తుతం రూ.4,42,442 కోట్లకు పెరిగిందని అన్నారు. 2014-15లో జిఎస్‌డిపిలో రాష్ట్ర అప్పుల వాటా 28.33 శాతం ఉండగా, 2023-24 బడ్జెట్‌ అంచనాల్లో 32.95 శాతానికి అప్పులు పెరిగాయని టీడీపీ ఎంపీ కె రామ్మోహన్‌నాయుడు అడిగిన మరో ప్రశ్నకు కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి పంకజ్‌ చౌదరి సమాధానమిచ్చారు.