ఇంత చిన్న తప్పిదానికి అంత పెద్దశిక్షా! అనడం సహజం. కానీ మాజీ మంత్రి కేటీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోవడాన్ని చిన్న తప్పిదంగా అభివర్ణించడం ఆశ్చర్యం కలిగిస్తున్నది. అయితే ఆ మాట అన్నాడో లేదో కానీ ఆయనకు మాత్రం మీడియాలో పెద్ద ప్రచారమే వచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్టు ఫిల్లర్లు కుంగిపోయి, పగుళ్లు ఏర్ప డ్డాయి. ఓవైపు పెచ్చులు రాలుతున్నాయి.మరోవైపు జాలు వస్తున్నది. ఈ క్రమంలో ఎంతోమంది నిపుణులు దాన్ని పరిశీలించి తమ అభిప్రాయాలు చెప్పారు. జాతీయ డ్యామ్ సెప్టీ అధికారులు కూడా దీన్ని పెద్ద తప్పిదంగానే పరిగణించారు. దానిపై ఇంకా విచారణ కొససాగుతున్నది. అనేక పార్టీల నేతలు కూడా ప్రాజెక్టును పరిశీలించి మానవ తప్పిదంగా వర్ణించారు. మీడియాలో కూడా అనేక కథనాలు వెలువడ్డాయి. ప్రపంచంలోని నిపుణులు, మేధావులు కూడా దానికి పరిష్కార మార్గం చూపలేదు. అలాంటి దుస్థితిలో కాళేశ్వరం ఉంటే కేటీఆర్‌కు మాత్రం ఆ కుంగుబాటు చిన్న తప్పిదమనడం సబబేనా? ఆయన ఎక్కడ పరిశీలించారో, ఎటువైపు చూసి వచ్చారో, దూరం నుంచి చూశారా? దగ్గరనుంచి చూసి వచ్చారో తెలీదు. కానీ వేల కోట్ల రూపాయల ప్రాజెక్టు కండ్ల ముందే పెళ్లలు రాలిపడుతుంటే, ఫిల్లర్లు భూమిలోకి కుంగిపోతుంటే, ఆ ప్రాజెక్టులో నీటినిల్వలు చేయలేని పరిస్థితి ఏర్పడింది. కానీ కేటీఆర్‌కు మాత్రం అది చిన్న తప్పిదమని కప్పిపుచ్చుకోవడం ఆయ నకే చెల్లింది. భారీ బడ్జెట్‌తో నిర్మించిన ‘కల్కి’ సినిమాను ప్రేక్షకులు త్రీడిలో చూస్తున్నారు. అదే విధంగా కాళేశ్వరం ప్రాజెక్టు కుంగుబాటు పెద్దగా కనిపించాలంటే కేటీఆర్ కూడా త్రీడి కండ్లజోడు ధరిస్తే బాగా కనిపిస్తుంది. అది ఎంత పెద్ద తప్పిదమో అప్పుడు అర్థమవుతుంది.
– గుడిగ రఘు