త్రీడీ చిత్రం

త్రీడీ చిత్రంతగ్గిన జబ్బు తిరగబెట్టినట్టు
వాతావరణం వింత దుప్పట్లు కప్పుకుని
వేడిగా వెక్కిరిస్తోంది
ఋతు క్రమాన్ని తలదన్నీ
కాలచక్రం రంగుల రాట్నమవుతోంది
ఒళ్ళంతా ఒకటే బాధ,
ఉక్కపోతల మధ్య ఊపిరికే విఘాతం
నిప్పుల కుంపటిపై
కుత కుత ఉడుకుతున్న దేహం
స్వేదం ఇక ధారావాహిక
పిడస గడుతున్న గొంతు నుంచి
ఎప్పుడూ వినని జీర గీతాల ఝరీ
దుఃఖపు కొలను అడుగంటింది
దిగులు బావి నుంచీ ప్రాణాల్ని ఎంత చేదుకున్నా…
దప్పిక తీరని త్రిశంకు స్వర్గం
లోలోన నీళ్లన్నీ నిండుకున్నాయి
పెదవులు చిట్లిన చీకటిలో
కనురెప్పలు పొడిబారిపోన దశ్యం
సొంపని మనసు తన్లాటలో..
రీళ్ళు తిరుగుతున్న పచ్చదన విధ్వంసం
ఇక కళ్లజోళ్లు తగిలించుకోండి
బ్రతుకు గుణపాఠం ఇప్పుడు ఓ త్రీడీ చిత్రం…!
– డా.కటుకోఝ్వల రమేష్‌, 9949083327